Adilabad Tiger: ఆదిలాబాద్‌లో పులి గాండ్రింపు.. రోడ్డు దాటుతూ.. వీడియోలకు చిక్కిన పెద్దపులి-tiger was seen crossing the road and caught on video in adilabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Adilabad Tiger: ఆదిలాబాద్‌లో పులి గాండ్రింపు.. రోడ్డు దాటుతూ.. వీడియోలకు చిక్కిన పెద్దపులి

Adilabad Tiger: ఆదిలాబాద్‌లో పులి గాండ్రింపు.. రోడ్డు దాటుతూ.. వీడియోలకు చిక్కిన పెద్దపులి

HT Telugu Desk HT Telugu
Nov 12, 2024 08:10 AM IST

Adilabad Tiger: ఆదిలాబాద్ జిల్లాను పులి భయపెడుతోంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఉమ్మడి జిల్లాలో పులులు, చిరుతల సంచారం అధికమైంది. అప్పుడప్పుడు చుట్టపుచూపుగా వచ్చిపోతుండగా.. ప్రస్తుతం కొన్ని రోజుల పాటు ఇక్కడే మకాం వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

నిర్మల్ జిల్లాలో రోడ్డు దాటుతున్న పులి
నిర్మల్ జిల్లాలో రోడ్డు దాటుతున్న పులి

Adilabad Tiger: ఆదిలాబాద్‌ జిల్లా వాసుల్ని పెద్దపులి హడలెత్తిస్తోంది. నిర్మల్ జిల్లా సమీపంలోని మహబూబా ఘాట్ వద్ద పులి రోడ్డు దాటుతూ వాహనదారుల కంట పడటం కలకలం రేపుతోంది. ఇన్నాండ్లు చిరుతలు సంచరిస్తు పలు చోట్ల పశువులను చంపి తింటుండగా.. తాజాగా పెద్దపులులు సైతం పశు వులపై దాడి చేస్తూ ఉమ్మడి జిల్లాలో సంచరిస్తున్నాయి. పులులు, చిరుతల సంచారంతో ఉమ్మడి జిల్లావాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు అటవీశాఖ అధికారులు పులులు, చిరుతల సంరక్షణ కోసం చర్యలు ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కావ్వాల్ అభయారాణ్యం ఉన్నప్పటికీ పులి జాడ లేకుండా పోయింది. ఇక్కడి అడవిలో చిరుతల సంచారం ఉన్నప్పటికీ.. కొన్నేండ్ల నుంచి పులుల జాడ లేకుండాపోయింది.

తిప్పేశ్వర్ నుంచి రాక..!

మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అడవులు ఉమ్మడి జిల్లా సరిహద్దులకు ఆనుకొని ఉంటాయి. ప్రతి ఏటా ఈ అడవులతో పాటు తాడోబా అభయారణ్యం నుంచి ఇక్కడకు వచ్చిపోతుంటాయి. సరిహద్దు ప్రాంతాల గుండా జిల్లాలోకి ప్రవేశించి ఇక్కడి పశువులను వేటాడి కొన్ని రోజుల పాటు మకాం వేస్తుంటాయి. తిరిగి వాటి ఆవాసాల వైపు వెళ్లిపోతుంటాయి.

కొన్నేండ్ల నుంచి ఇది సహజమైన ప్రక్రియగా కొనసాగుతోంది. తాజాగా కొన్ని రోజుల నుంచి ఉమ్మడి జిల్లాలో పెద్దపులి సంచారం జనాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. వారం రోజుల క్రితం తిప్పేశ్వర్ నుంచి వచ్చిన పులి మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండలంలో మూడు ఆవులను, హాజీపూర్ మండలంలో రెండు గొర్రెలను చంపేసింది. ప్రస్తుతం మంచిర్యాల సమీపంలోని బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక చిరుతల సంచారం సైతం అధికమైంది. సారంగపూర్ మండలంలో రెండు ఎద్దులతో పాటు ఒక అవుపై దాడి చేసి చంపడంతో స్థానికంగా భయాందోళన వ్యక్తమైంది. తాజాగా ఆదివారం రాత్రి మహబూబ్ ఘాట్ వద్ద రోడ్డు దాటిన పులి మామడ మండలం రాసిమెట్ల అడవుల్లోకి వెళ్లినట్లు అటవీ అధికారులు చెబుతున్నారు.

మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అడవుల నుంచి వస్తుండటంతో ఇక్కడా బెబ్బులి గాండ్రింపులు వినిపిస్తున్నాయి. కనిపించిన పశువులపై పంజా విసురుతున్నాయి. రెండు నెలల క్రితం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో పులి అడుగు జాడలు గుర్తించగా.. తాజాగా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో పులులు సంచరిస్తున్నట్లు ప్రజలతో పాటు అటవీ అధికారులు గుర్తించారు.

ఇటీవల బోథ్ మండల అటవీ ప్రాంతంలో సంచరించిన పులి నిర్మల్ జిల్లా సారంగపూర్, సూర్యాపూర్, రవీందర్ నగర్, అడెల్లి ప్రాంతాల్లో సంచరించి వెళ్లిపోయింది. మహారాష్ట్ర సరిహద్దుకు వెళ్లిన ఆ పులి తాజాగా కుంటాల మండలం అంబుగాంతో పాటు పలు గ్రామాల శివారు గుండా మహబూబ్ ఘాట్ నుండి మామడ రాసిమెట్ల ప్రాంతానికి వెళ్ళిపోయిందని అటవీ అధికారులు గుర్తించారు.

జనంలో భయాందోళన..!

ఉమ్మడి జిల్లాలో అధిక భాగం పంట పొలాలు అటవీ ప్రాంతాలకు ఆనుకొని ఉండటం.. పులులు, చిరుతల సంచారం అధికం కావడంతో పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా పత్తి పంట ఏరడం, వరికోతలు ప్రారంభం కావడంతో పాటు రబీ సీజన్ కూడా మొదలైంది. దీంతో రైతులు, వ్యవసాయ కూలీలు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు.

అనేక మంది రైతులు పొలాలు అటవీ ప్రాంతాలకు అతి సమీపంలో ఉండటం..పులులు, చిరుతల సంచారం అధికం కావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివిధ మండలాలు, గ్రామాల పరిధిలో సంచరిస్తుండటం కారణంగా పొలం పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. మరోపక్క పులులు, చిరుతలను సంరక్షించేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. సమీప గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వాటికి ప్రాణహాని కలగకుండా విద్యుత్తు కంచెలను తొలగిస్తున్నారు. మరోపక్క అప్రమత్తంగా ఉండాలంటూ జనాలకు సైతం సూచనలు చేస్తున్నారు.

నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్, మండలాల్లో పులి ఇటీవల సంచరించడంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయంగుప్పిట్లో, ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళనలో ఉన్నారు. అయితే తాజాగా సోమవారం వేకువజామున మామడ మండలంలోని తాండ్ర సమీపంలో, మహబూబ్ ఘాట్ సమీపంలో పులి సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దిలావరప్పూర్ మండలంలో ఇటీవల పశువుల కాపరులకు పులి కనబడడంతో ఆందోళనకు గురయ్యారు.

వైరల్ అవుతున్న వీడియో..

సోమవారం ఉదయం బూరుగుపల్లి తాండ్ర, వేకువజామున మహబూబ్ ఘాట్ వద్ద పులి సంచరిస్తుందన్న వార్త దావానంలా జిల్లా వ్యాప్తంగా విస్తరించింది. అయితే అటువైపుగా వెళ్తున్న కారులో నుండి పులి సంచరిస్తున్న వీడియోను తీశారు. పెద్దపులి రోడ్డు దాటుతూ వాహనదారులకు కనిపించింది. వారంతా ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.

ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు సిబ్బందితో కలిసి మహబూబాఘాట్కు చేరుకుని పులి ఆనవాళ్ల కోసం వెతుకుతూ వాహనదారులను అప్రమత్తం చేశారు. పెద్దపులిసంచారిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయ్యాయి.

గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలి: ఫారెస్టు అధికారులు..

పులి సంచరిస్తుందన్న విషయాన్ని తెలుసుకున్న అటవీశాఖాధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. భైంసా మండలంలోని మాటేగాం, దిలావర్పూర్ మండలంలోని కదిలి గ్రామాల్లో పాఠశాల విద్యా ర్థులను దింపి వస్తున్న రాంపూర్ సేయింట్ థామస్ పాఠశాల బస్సు ఘాట్ రోడ్డు దిగుతున్న గుట్ట ప్రాంతంలో సమయంలో, దిలావర్ పూర్ డంపింగ్ యార్డు వైపు బస్సుకు అడ్డుగా పులి వచ్చిందని డ్రైవర్ తెలిపారు. ద్విచక్ర వాహనాదారులు, ఆటోల వారు ఆందోళనకు గురయ్యారు. పులి గాండ్రిస్తూ పత్తి చేనులోకి వెళ్లి పోయింది. పులి సంచరిస్తున్న ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖాధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.

(రిపోర్టింగ్:: వేణుగోపాల్ కామాజీ, ఉమ్మడిదలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner