Safari Ride: మన అమ్రాబాద్ అడవుల్లో 'సఫారీ టూర్'.. ఎప్పట్నుంచి అంటే
Tiger stay packages back at Amrabad Tiger Reserve:సఫారీ టూర్.. ఇక తెలంగాణలోనూ అందుబాటులోకి వచ్చేసింది. ఇందుకోసం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ వేదికైంది. ప్రత్యక్షంగా పులులను చూసే అవకాశం వచ్చింది. వెళ్లే వారి కోసం ప్రత్యేక ప్యాకేజీని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది రాష్ట్ర అటవీశాఖ.
Amrabad Tiger Reserve: పర్యాటకులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర అటవీశాఖ. నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ అడవుల్లో విహారయాత్రకు ఏర్పాట్లు సిద్ధం చేసింది. సఫారీ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. అడవుల్లో జంతువులను చూస్తూ విహరించాలనుకునే ప్రకృతి ప్రేమికులు.. ఎక్కడికో వెళ్లకుండా మన రాష్ట్రంలోనే సఫారీ టూర్ ఎంజాయ్ చేసే అవకాశం దొరకనుంది.
రూ. 4900 ధర
రూ.4,900కే సఫారీ టూర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది అటవీశాఖ. ఇందులో భాగంగా శుక్రవారం నాగర్‌కర్నూల్‌జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో.. వెబ్‌సైట్, 8 కొత్త సఫారీ వాహనాలు, 6 కాటేజీలను అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఫారీ రైడ్ వెళ్లాలనుకునేవారు https://amrabadtigerreserve.com/booking-package/ లింక్ పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. సఫారీ టూర్ జనవరి 26 నుంచి ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి... గతంలో పులుల సందర్శనకు విదేశాలకు వెళ్లే పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు ప్రత్యక్షంగా చూసే అద్భుతం ఇక్కడే ఆవిష్కృతమవుతున్నదని అన్నారు. నల్లమల అందాలను చూస్తుంటే విదేశీ అనుభూతి కలుగుతున్నదని చెప్పారు. నల్లమలలో ఎకో టూరిజం అభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయని వెల్లడించారు. ఇది కృష్ణానది పరీవాహక ప్రాంతం కావడం, గడ్డి క్షేత్రాలు, శాఖాహార జంతువులు అధికంగా ఉండటంతో పులుల సంఖ్య పెరుగుతున్నదని వివరించారు. 2018లో 18 పెద్ద పులులుంటే ఇవాళ ఆ సంఖ్య 26కు చేరిందన్నారు. 106 ఊట చెరువులు, 1,149 సాసర్ పిట్లు, 99 చెక్ డ్యాంలు, 29 సోలార్ బోర్లతో జంతువులకు నీటిని అందుబాటులో ఉంచామని, 10 సీసీ కెమెరాలతో అడవులను పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు.
అమ్రాబాద్ తో పాటు అటవీ ప్రాంతాల్లో పర్యటించే, ప్రయాణించే ప్రతీ ఒక్కరూ బాద్యతాయుతంగా ఉండాలని మంత్రి కోరారు. అన్ని అడవులు ప్లాస్టిక్ ఫ్రీ జోన్లుగా ప్రకటించామని, వన్యప్రాణులకు హాని చేసే ప్లాస్టిక్ కు అడవుల నుంచి దూరంగా ఉంచాలన్నారు. అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికి ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో పాటు అధికారులు పాల్గొన్నారు.