Tiger Spotted In Kawal : కవ్వాల్ లో పెద్ద పులుల సంచారం, భయాందోళనలో ప్రజలు
Tiger Spotted In Kawal : ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపుల్లి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని పలు తండాల్లో సంచరిస్తు్న్న పెద్దపులి..పశువులపై దాడి చేస్తుంది.
కుంటాల మండలంలోని సూర్యాపూర్, మెదన్పూర్, అంబుగామ అటవీ ప్రాంతాల్లో గత శుక్రవారం నుంచి పెద్దపులి అలజడి సృష్టిస్తోంది. పదిహేను రోజుల క్రితం మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ నుంచి బొందిడి, కిన్వట్ అటవీ ప్రాంతాల మీదుగా తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశించింది. జిల్లాలోని భీంపూర్, తాంసి, తలమడుగు మీదుగా బోథ్ మండలానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలం అడెల్లి తండా నుంచి మహారాష్ట్రలోని అప్పారావుపేట్ మీదుగా కుంటాల మండలంలోని సూర్యాపూర్, మెదన్పూర్ బుడుబుడు జలప్రాంతంలో సంచరిస్తూ పశువులపై దాడికి పాల్పడిన పెద్దపులి తాజాగా మంగళవారం సరిహద్దుల్లోనే సంచరించడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది.
ట్రాప్ కెమెరాల ద్వారా అటవీ అధికారుల పరిశీలన
సూర్యాపూర్ అటవీ ప్రాంతంలో పశువులపై దాడి చేయడంతో అధికారులు ట్రాఫ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు పలుమార్లు ఆవు కళే బరాన్ని తినేందుకు వచ్చిన పులి కెమెరాకు చిక్కినట్లు అధికారులు నిర్ధారించారు. గత ఆదివారం సూర్యాపూర్ గ్రామస్తులు మేత కోసం తీసుకెళ్లగా చెరువులో నీళ్లు తాగేందుకు వచ్చిన పెద్దపులి కనిపించడంతో పశువులు బెదిరి నీటిలోకి వెళ్లాయి. కాపరులు కుంటి రాములు, దొంతుల చిన్నయ్య చెట్టెక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. మండలంలోని అంబుగామ అటవీ ప్రాంతం పీర్ల గుట్టలో ఆవుపై దాడిచేసి గాయపరిచింది. కాగా మంగళ వారం తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోనే పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
పులి రక్షణకు, సరిహద్దు దాటేవరకు చర్యలు
జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి మహారాష్ట్ర సరిహద్దు దాటేవరకు రక్షణ చర్యలు చేపడుతు న్నట్లు డీఎఫ్ఓ నాగిని భాను పేర్కొన్నారు. బుధవారం మండలంలోని అంబుగామ అటవీ ప్రాం తంలో సిబ్బందితో కలిసి పులి రక్షణ చర్యలు పరిశీలించారు. పులి పాద ముద్రలు గుర్తించినట్లు ఆమె వెల్లడించారు.
అటవీ ప్రాంతంలో తిరగరాదు
పెద్దపులి సంచారం కొనసాగుతున్న నేపథ్యంలో పశువుల కాపారులు, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు ఉదయం 9 గంటల వెళ్లి 4 గంటల లోపు పనులు ముగించుకోవాలని సూచించారు. కర్రకు గజ్జెలు కట్టి శబ్దం, అరుపులు చేస్తూ వెళ్లాలని కోరారు. అటవీ ప్రాంతానికి అరకిలోమీటరకు మించి వెళ్లరాదని, పంటల రక్షణకు కంచెలు ఏర్పాటు చేయవద్దని కోరారు. పులి సరిహద్దు దాటే వరకు పశువులను మేత కోసం అడవిలోకి తీసుకెళ్లద్దని సూచించారు.
ఆవుల మందపై దాడి... మూడు ఆవుల మృతి
పెద్దపులి దాడిలో మూడు ఆవులపై దాడి చేసిన ఘటన మంచిర్యాల పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. ముత్యంపల్లి సెక్షన్ మామిడిగూడలోని గోండుగూడ ప్రాంతంలోని గిరిజన రైతుకి చెందిన ఆవుల మందపై దాడి చేసి మూడు ఆవులపై దాడి చేసినట్లు అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు. ఇక్కడ సంచరిస్తున్నది ఎస్ 12 మగ పులిగా భావిస్తున్నట్లు తెలి పారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన పులి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ అడవుల నుంచి కవ్వాల్ టైగర్ జోన్లోని ఖానాపూర్, పెంబి, హాజీపూర్ అటవీ ప్రాంతానికి వచ్చినట్లు పేర్కొన్నారు. సమీప గ్రామాల ప్రజలు, పశువుల కాపర్లు అడవిలోకి వెళ్లవద్దనిఅటవీ అధికారులు సూచించారు.
పులి సంచారం నిజమే
ఇదిలా ఉంటే సారంగాపూర్ డిప్యూటీ రేంజ్ అధికారి నజీర్ ఖాన్ మాట్లాడుతూ పులి సంచార విషయం నిజమే అని ధ్రువీకరించారు. పశువులు మేత కు మైదాన ప్రాంతం లోనే మేత కు తీసుకెళ్లాలని తెలిపారు. కొన్ని రోజుల్లో పులి ప్రాంతం వదిలి వెళ్తుంది అని అన్నారు. ప్రజల ప్రాణాలు ముఖ్యమని జాగ్రత్త వహించాలని కోరారు.
రిపోర్టింగ్ : కామోజీ వేణుగోపాల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందూస్తాన్ టైమ్స్, తెలుగు.