Adilabad : పులి వస్తోంది జాగ్రత్తగా ఉండండి.. అటవీశాఖ అధికారుల హెచ్చరిక
Adilabad : ఆదిలాబాద్ అడవుల్లో పెద్ద పులి సంచరిస్తోంది. ముఖ్యంగా ఉట్నూర్ ఫారెస్ట్‌లో పులి కదలికలను అధికారులు గుర్తించారు. ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటు కవ్వాల్ అడవుల్లోకి మగ పులి ప్రవేశించింది. ఆ ప్రాంత ప్రజలు కూడా అలర్ట్‌గా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు.
ఉట్నూర్ మండలంలో టైగర్ అలర్ట్ జారీ జారీ అయ్యింది. మండలంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. ఉట్నూర్ మండలం చీమ్యానాయక్ తండాలో పులుల పాదముద్రలు కనిపించడంతో అటవీశాఖ అధికారులు పులి హెచ్చరిక జారీ చేశారు. రైతులు ఒంటరిగా పత్తి పొలాల్లోకి వెళ్లవద్దని, పశువులను జాగ్రత్తగా చూసుకోవాలని స్పష్టం చేశారు.
పులులకు ఎవరూ హాని కలిగించవద్దని ఫారెస్ట్ అధికారులు స్పష్టం చేశారు. పులికి కరెంట్ షాక్ పెట్టే ప్రయత్నం చేస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పులుల సంచారం నేపథ్యంలో.. అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు మహారాష్ట్రలోని కిన్వాట్‌కు చెందిన ఆరు నుంచి ఎనిమిదేళ్ల మధ్య వయసున్న మగ పులి.. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలోని కవాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్)లోని కోర్ ఏరియాలోకి ప్రవేశించింది. దీంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. తన సహచర పులి కోసం వెతుకుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ పులి గత నెల రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రత్యక్షమైందని అధికారులు చెబుతున్నారు.
మొదటగా అక్టోబర్‌లో బోథ్ మండల అడవుల్లో కనిపించిన ఈ పులి.. తర్వాత కుంటాల, సారంగాపూర్ మండలాల్లోని అడవుల్లోకి వెళ్లింది. తాజాగా హైదరాబాద్- నాగ్‌పూర్ NH-44 హైవే మీద కనిపించింది. మళ్లీ కవాల్ టైగర్ రిజర్వ్‌లో కనిపించింది. ప్రస్తుతం పులి రిజర్వ్‌లోని తిర్యాని ప్రాంతం వైపు కదులుతున్నట్లు వైల్డ్ లైఫ్ అధికారులు వివరిస్తున్నారు.
పులి సంచారం గురించి ఎలాంటి సమాచారం ఉన్న తమకు తెలియజేయాలని అధికారులు సూచిస్తున్నారు. భయపడి పులులకు ఎలాంటి హాని కలిగించొద్దని స్పష్టం చేస్తున్నారు. తమ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఉన్నతాధికారులు వివరించారు. రైతులు వీలైనంత వరకు ఒంటరిగా పంట పొలాలకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.