ఎండలు మండుతున్న వేళ తెలంగాణకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ద్రోణి ప్రభావంతో… రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి నాలుగైదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ లో వెల్లడించింది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ వివరాల ప్రకారం… ఇవాళ( మార్చి 20రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో మాత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
మార్చి 21వ తేదీన పలుచోట్ల తేలికపాటి వర్ష సూచన ఉండగా... ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల వడగళ్లు కూడా పడుతాయి. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను ఇచ్చారు.
మార్చి 22వ తేదీన కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి,భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతారవణ కేంద్రం అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.
మార్చి 23వ తేదీన పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. మార్చి 24వ తేదీ నుంచి మళ్లీ పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఓవైపు ఎండలు…. మరోవైపు వర్ష సూచన ఉండటంతో తెలంగాణలో భిన్న వాతావరణం కనిపించే అవకాశం ఉంది. తేలికపాటి వర్షాలు కురిస్తే కాస్త ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. వర్షాలు కురిస్తే… ఎండల నుంచి జనాలకు తాత్కాలికంగా ఉపశమనం దొరికినట్లే అవుతుంది…!