ఏపీ, తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ - మరో 2 రోజులు వర్షాలు..! ఎల్లో హెచ్చరికలు జారీ-thunderstorms and lightning rains expected in ap and telangana for another 3 days ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఏపీ, తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ - మరో 2 రోజులు వర్షాలు..! ఎల్లో హెచ్చరికలు జారీ

ఏపీ, తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ - మరో 2 రోజులు వర్షాలు..! ఎల్లో హెచ్చరికలు జారీ

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం ఉంది. ఓవైపు ఎండల తీవ్రత ఉండగా… మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజులు కూడా ఏపీ,తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడనున్నాయి.

ఏపీ, తెలంగాణకు వర్ష సూచన (image from @APSDMA)

కొద్దిరోజులుగా ఏపీ, తెలంగాణలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఓవైపు ఎండ తీవ్రత కనిపిస్తుండగా… మరికొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లబడినట్లు ఉంటుంది. కొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఇదే పరిస్థితి మరో రెండు మూడు రోజుల పాటు ఉండే అవకాశం ఉంది.

బీహర్ నుంచి ఉత్తర తీర ప్రాంత ఏపీ వరకు ఉన్న ద్రోణి ప్రస్తుతం... సిక్కిం నుంచి ఉత్తర ఒడిశా వరకు జార్ఖండ్ మీదుగా సగటు సముద్రమట్టానికి 3.1 కిమీ ఎత్తులో కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అంతర్గత కర్ణాట, రాయలసీమ, తమిళనాడు మీదుగా మరో ద్రోణి కూడా విస్తరించి ఉన్నట్లు పేర్కొంది. నైరుతి బంగాళాఖాతం అనుకుని ఉన్న ఉపరితల ఆవర్తనం ఇవాళ బలహీన పడినట్లు వెల్లడించింది.

తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో మరో రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఉత్తర, దక్షిణ కోస్తాలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 40- 50 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.

మంగళవారం రాత్రి 8 గంటల నాటికి మన్యం జిల్లా పెదమేరంగిలో 47.5 మిమీ, విజయనగరం జిల్లా బాడంగిలో 44.5 మిమీ, ప్రకాశం చంద్రశేఖరపురంలో 44.2 మిమీ వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లా దొర్నిపాడులో 41.6°C, అన్నమయ్య జిల్లా కంబాలకుంటలో41.5°C ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

తెలంగాణలోని ఈ జిల్లాలకు హెచ్చరికలు:

ఇవాళ తెలంగాణలోని భూపాలప్లలి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మాల్కాజ్ గిరి, వికారాబాద్, మెదక్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లోనూ వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

రేపు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ,జనగాం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.