తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం ఉంది. గత రెండు మూడు రోజులుగా ఓవైపు ఎండలతో పాటు మరోవైపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో… తీవ్రస్థాయిలో పంట నష్టం వాట్లిలింది. ఇక ఇవాళ, రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉత్తర - దక్షిణ ద్రోణి ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిమీ ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఛత్తీస్ ఘడ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక, తెలంగాణతో పాటు ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిమీ ఎత్తులో ఉపరితల ద్రోణి బలహీనపడినట్లు పేర్కొంది. ద్రోణి ప్రభావంతో... ఏపీ, తెలంగాణలో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
తెలంగాణలో చూస్తే ఇవాళ కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.
రేపు కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులు ఈదురు గాలులు(గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత పూర్తిగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది.
రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ(మార్చి 23) రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమై ఉండి పలుచోట్ల ఉరుములు,పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు చెట్లు పోల్స్ క్రింద,బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని స్పష్టం చేసింది.
మరోవైపు ఇవాళ మన్యం జిల్లాలోని పాలకొండ, సీతంపేట,అల్లూరి జిల్లాలోని చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు మండలాల్లో(6) వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
శనివారం కర్నూలు జిల్లాలోని ఆస్పరి,శ్రీ సత్యసాయి జిల్లాలోని తొగరకుంటలో 40.3°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీసత్యసాయి జిల్లా ఒరవోయ్ లో 34 మిమీ, వైఎస్సార్ జిల్లా నల్లచెరువుపల్లి 27మిమీ, ముద్దనూరు లో 19.7మిమీ, కర్నూలు జిల్లా వెల్దుర్తిలో 18.7మిమీ వర్షపాతం, 17 ప్రాంతాల్లో 10మిమీ కు పైగా వర్షపాతం నమోదైనట్లు చెప్పింది.