MP DK Aruna House : బీజేపీ ఎంపీ ఇంట్లో చొరబడిన దుండగుడు, గంటన్నర పాటు కిచెన్ లోనే - సీసీ కెమెరాలో రికార్డ్
Robber Enters MP DK Aruna House : బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి దుండగుడు చోరబడ్డాడు. గంటన్నరపాటు ఇంట్లో తిరిగినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఎంపీ గది వరకూ వెళ్లాడు. అయితే ఆ సమయంలో ఎంపీ ఇంట్లో లేరు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Robber Enters MP DK Aruna House : సాధారణంగా దుండగులు...తాళాలు వేసి ఉన్న ఇండ్లు, భద్రత తక్కువగా ఉండే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతుంటారు. కానీ ఇటీవల చోటుచేసుకుంటున్న ఘటనలు చూస్తుంటే భద్రత ఎక్కువ ఉన్న ఇండ్లలో కూడా దుండగులు చోరీలకు యత్నిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లో చోరబడిన దుండగుడు ఆయనపై కత్తితో దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. తాజాగా తెలంగాణ బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో ఆగంతకుడు హల్ చల్ చేశారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఎంపీ డీకే అరుణ ఇంట్లో ఆగంతకుడు చొరబడడం చర్చనీయాంశమైంది. బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 56లో నివాసం ఉంటున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో దుండగుడు చేతులకు గ్లౌజులు వేసుకొని, ముఖానికి మాస్క్ కట్టుకుని ఎంపీ ఇంట్లోకి చొరబడ్డాడు. దాదాపు గంటన్నర పాటు ఇంట్లో సంచరించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కిచెన్ లో గంటన్నర, ఎంపీ గది వరకూ
"ఇవాళ తెల్లవారు జామున 3 గంటలకు ఇంట్లో శబ్దం వచ్చింది. కానీ ఇంట్లో ఎవరూ కనిపించలేదు. కిచెన్‌లో అడుగులు ఉన్నాయి. సీసీ కెమెరాలో చూస్తే ఓ వ్యక్తి వంటగది వైపు ఉన్న కిటికీ నుంచి ఇంట్లోకి వచ్చినట్టు కనిపించింది. ముఖానికి మాస్క్, గ్లౌజులు వేసుకున్న వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ సమయంలో ఎంపీ డీకే అరుణ ఇంట్లో లేరు. ఆమె మీటింగ్ కోసం నిన్న మహబూబ్‌నగర్ కు వెళ్లారు. ఆగంతకుడు గంటన్నర పాటు కిచెన్‌లోనే ఉన్నాడు. అనంతరం ఎంపీ గది వరకు వెళ్లాడు. అయితే ఇంట్లో ఎలాంటి వస్తువులు పోలేదు. ఒక్కడే వచ్చినట్టు సీసీ కెమెరాలో కనిపించింది. ఈ విషయంపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాం" అని ఎంపీ డీకే అరుణ డ్రైవర్ మీడియాతో తెలిపారు.
ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. మాస్క్, గ్లౌజులు ధరించి వచ్చిన దొంగ ఇంట్లోకి చొరబడి కిచెన్, హాలు సీసీ కెమెరాలు ఆఫ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎంపీ డీకే అరుణ స్పందించారు. ఇందులో కచ్చితంగా ఏదో కుట్రకోణం ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. తనకు భద్రత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సంబంధిత కథనం