ముగ్గురు యువకుల అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడించారు. సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. ఖిలా వరంగల్ ప్రాంతానికి చెందిన చాపర్తి రాజేష్ ఇస్త్రీ షాపు నడిపేవాడు. దాని నుంచి వచ్చే అదాయం తన జల్సాలకు సరిపోకపోవడంతో.. సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. చైన్ స్నాచింగ్‌లకు అలవాటు పడ్డాడు.
తన ప్లాన్‌లో భాగంగానే ఈ నెల 11వ తేదీన హనుమకొండ రెడ్డి కాలనీలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. ఒంటరిగా వెళ్తున్న ఓ మహిళను టార్గెట్ చేసి ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన హనుమకొండ, వరంగల్ సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తమ వద్ద ఉన్న టెక్నాలజీని వినియోగించి నిందితుడిని గుర్తించారు.
శనివారం ఉదయం నిందితుడు పెద్దమ్మగడ్డ ప్రాంతంలో ఉన్నట్టు సమాచారం అందడంతో.. హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. విచారణ జరపగా గతంలో కూడా ఇదే తరహాలో నాలుగు చోరీలకు పాల్పడినట్టు ఒప్పుకున్నాడు. ఇందులో కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, మట్టెవాడ, ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకటి చొప్పున ఉన్నాయి. నిందితుడి నుంచి సుమారు 4 లక్షల 75 వేల విలువ గల బంగారం, పది వేల రూపాయల నగదు, ఒక బైక్, ఒక సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ఇద్దరు ఆటో డ్రైవర్లను పోలీసులు 24 గంటల్లోనే అరెస్టు చేశారు. ఐనవోలు మండల కేంద్రానికి చెందిన తాళ్లపల్లి సంపత్ కుమార్ హనుమకొండ గోకుల్‌నగర్‌లో ఉంటున్నాడు. ఆటో నడుపుతూ.. జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే సంపత్ బెట్టింగులకు అలవాటు పడి తీవ్రంగా లాస్ అయ్యాడు. ఆటో ఈఎంఐ చెల్లించడానికి కూడా ఇబ్బందులు ఎదురయ్యేవి. దీంతో సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. తన స్నేహితుడు నడికూడ గ్రామానికి చెందిన చుక్క మురళీ సలహా మేరకు ఇద్దరూ కలిసి చైన్ స్నాచింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు.
శనివారం కాజీపేట పరిధిలోని ఓ కిరాణ షాపులో బిస్కెట్ ప్యాకెట్ కొనుగోలు చేస్తున్నట్లుగా నటిస్తూ.. ఆ షాప్ లో ఉన్న మహిళ మెడలోని రోల్డ్ గోల్డ్ గొలుసును లాక్కుని అక్కడి నుంచి ఆటోలో పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కాజీపేట పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టి నేరం జరిగిన 24 గంటలోపే నిందితులను పట్టుకున్నారు. ఫాతిమా సెంటర్‌లో ఇద్దరినీ అరెస్టు చేసి.. వారి నుంచి రోల్డ్ గోల్డ్ గొలుసు, సూమారు 15 వేల రూపాయల విలువ గల 2.75 గ్రాముల బంగారం, ఒక ఆటో, ఒక సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)