Jangaon Accident : జనగామ జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. ముగ్గురు ప్రయాణికులు మృతి
Jangaon Accident : ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ముగ్గురు ప్రయాణికుల ప్రాణం తీసింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు స్పాట్ లోనే చనిపోగా.. మరొకరు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ప్రాణం విడిచారు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం సమీపంలో మంగళవారం ఉదయం జరిగింది.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డిపోకు చెందిన టీఎస్ 24 టీ 0152 నెంబర్ పల్లె వెలుగు బస్సు.. మంగళవారం ఉదయం పాలకుర్తి మండలం నుంచి తొర్రూరుకు 18 మంది ప్రయాణికులతో వెళ్తోంది. మల్లంపల్లి స్టేజీ దాటి.. వావిలాల గ్రామ శివారుకు ఎంటరైంది. ఈ క్రమంలోనే స్థానిక సబ్ స్టేషన్ పరిధిలోని మూల మలుపు వద్ద.. వైజాగ్ నుంచి బొగ్గు లోడ్‌తో వస్తున్న లారీ.. ఎదురుగా వచ్చి బస్సు కుడి భాగాన్ని బలంగా ఢీ కొట్టింది.
ఇద్దరు స్పాట్‌లోనే..
ఈ ప్రమాదంలో.. పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన ఎండీ నసీమా( 48 ), మహబూబాబాద్ జిల్లా వెలికట్ట గ్రామం టీక్యా తండాకు చెందిన జాటోతు హేమాని ( 55 ) ఘటనా స్థలంలోనే చనిపోయారు. తీవ్రంగా గాయపడ్డ హెమాని భార్య బుజ్జి (50 )ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే చనిపోయింది. బస్సులో ఉన్న మరో నలుగురు.. ఇల్లందు గ్రామానికి కోలపల్లి భూలక్ష్మి, ఎర్ర సత్యవతి, పాలకుర్తి మండలం నారబోయినగూడెంకు చెందిన తీరుపల్లి నాగమ్మ, తొర్రూరు మండలం వెలికట్టే గ్రామానికి చెందిన జాటోతు బాలాజీకి గాయాలు అయ్యాయి. వారిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
నిద్రమత్తే కారణం...?
ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో.. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని స్థానికులు, పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మూల మలుపు ఉన్న ప్రదేశంలో ఎదురుగా వస్తున్న వాహనాలు దూరం నుంచే కనిపించే అవకాశం ఉంది. కానీ బస్సు వస్తున్న విషయాన్ని గమనించాల్సిన లారీ డ్రైవర్.. నిద్రమత్తులో ఉండటం వల్ల నేరుగా వచ్చి బస్సును ఢీ కొట్టాడని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఘటనలో బస్సులో కుడి వైపు కూర్చుని ఉన్న ప్రయాణికులు చనిపోగా.. అవతలి వైపు ఉన్న వారు గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి కారణం లారీ డ్రైవర్ నిద్ర మత్తే కారణమని పోలీసులు చెబుతున్నారు.
ఆసుపత్రి సిబ్బందిపై ఎమ్మెల్యే సీరియస్..
ప్రమాదం గురించి తెలుసుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్డ్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను స్థానికులు, పోలీసులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదంలో గాయపడి పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఎమ్మెల్యే ఆసుపత్రిని సందర్శించిన సమయంలో.. సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుబాటులో ఉండని సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)