తెలంగాణ కేబినెట్ విస్తరణ - కొత్తగా ఆ ముగ్గురికి ఛాన్స్...! ఇవాళే ముహుర్తం-three more mla to be inducted into telangana cabinet expansion ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  తెలంగాణ కేబినెట్ విస్తరణ - కొత్తగా ఆ ముగ్గురికి ఛాన్స్...! ఇవాళే ముహుర్తం

తెలంగాణ కేబినెట్ విస్తరణ - కొత్తగా ఆ ముగ్గురికి ఛాన్స్...! ఇవాళే ముహుర్తం

తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఇవాళ మధ్యాహ్నం ముగ్గురు ఎమ్మెల్యేలు… మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.

తెలంగాణ కేబినెట్ విస్తరణ

తెలంగాణ కేబినెట్ విస్తరణకు వేళైంది. సుదీర్ఘ కసరత్తు తర్వాత… విస్తరణకు ఆ పార్టీ అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ మధ్యాహ్నం(12:19 గంటలకు) రాజ్ భవన్ లో కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.

ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇందులో మూడింటిని భర్తీ చేయనున్నారు. మిగిలిన మూడింటిని త్వరలోనే భర్తీ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత కేబినెట్ విస్తరణలో ఎస్సీలకు రెండు, బీసీ సామాజికవర్గానికి మరో బెర్త్ ను ఖరారు చేశారు.

ముగ్గురికి మంత్రులుగా చోటు…

విస్తరణలో భాగంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి కేబినెట్ లో బెర్త్ ఖరారైనట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి ఈ ముగ్గురికి ఇప్పటికే సమాచారం రాగా… ప్రమాణస్వీకారానికి సిద్ధమైనట్లు సమాచారం. మరోవైపు డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికపై కూడా కసరత్తు జరుగుతోంది. ఇందుకు ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికకు రేపోమాపో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఈసారి విస్తరణలో ఎస్సీ, బీసీ సామాజికవర్గాలకు చోటు దక్కినట్లు అయింది. ఎమ్మెల్యే వివేక్ ఎస్సీ మాల సామాజికవర్గానికి చెందిన వారు కాగా… లక్ష్మణ్ మాదిగ సామాజికవర్గానికి చెందిన వారుగా ఉన్నారు. ఇక ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన శ్రీహరికి బీసీల కోటాలో ఛాన్స్ దక్కినట్లు అయింది.

చోటు కోసం నేతల ప్రయత్నాలు…!

మంత్రివర్గ విస్తరణలో చోటు కోసం చాలా మంది ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరు స్థానాలు మాత్రమే ఖాళీ ఉండగా… వీటి కోసం చాలా మంది నేతలు రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో… బెర్తుల ఖరారు కోసం పార్టీ అధినాయకత్వం చాలారోజులుగా కసరత్తు చేస్తూనే వస్తోంది. ఎట్టకేలకు మూడు బెర్తులను ఖరారు చేయటంతో… మరో మూడు కూడా త్వరలోనే చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుత కేబినెట్ లో ఉమ్మడి నిజామాబాద్ నుంచి ఎవరికీ అవకాశం దక్కలేదు. ఇక్కడ్నుంచి పార్టీ సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి పేరు రేసులో ఉన్నారు.ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పరిగి ఎమ్మెల్యేతో పాటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలంగాణ కేబినెట్ లో మైనారీవర్గాలకు చెందిన మంత్రి లేరు. విస్తరణలో తప్పకుండా మైనార్టీ కోటా నుంచి ఒకరికి ఛాన్స్ ఇవ్వాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనే దానిపై పార్టీ అధినాయకత్వం లోతుగా కసరత్తు చేయాల్సి వస్తోంది. ఇప్పటికే పలుమార్లు పరిశీలించిన హైకమాండ్…. ప్రస్తుతానికి మూడింటిని మాత్రమే భర్తీ చేయనుంది. మరోసారి జరిగే విస్తరణలో మరో ముగ్గురికి అవకాశం ఇవ్వనుంది..!

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.