Warangal MGM : సూసైడ్ అటెంప్ట్ చేసిన కుటుంబంలో ముగ్గురు మృతి - ప్రాణాపాయ స్థితిలో మరొకరు
మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ కుటుంబం సూసైడ్ అటెంప్ట్ చేసిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు వరంగల్ ఏంజీఏం వైద్యులు చెప్పారు. వరంగల్ ఎంజీఎం డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు.
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసీపేటలో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కుటుంబంలోని నలుగురిలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టి లాస్ కావడం, అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు ఎక్కువవడంతో కాసీపేటకు చెందిన సముద్రాల మొండయ్య కుటుంబం సూసైడ్ అటెంప్ట్ చేసిన విషయం తెలిసిందే.
కాగా మంగళవారం ఉదయం వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో అడ్మిట్ చేయగా.. అక్కడ వారికి డాక్టర్లు ట్రీట్మెంట్ ప్రారంభించారు. కానీ గడ్డి మందు ప్రభావంతో చికిత్స పొందుతున్న సముద్రాల మొండయ్య(60), సముద్రాల శ్రీదేవి(50), వారి కూతురు చైతన్య(30) బుధవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయారు. కాగా మొండయ్య కుమారుడు సముద్రాల శివప్రసాద్ పరిస్థితి విషమించగా.. డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
అసలేం జరిగింది..?
మంచిర్యాల జిల్లా కాసీపేట గ్రామానికి చెందిన సముద్రాల మొండయ్య(60)కు భార్య శ్రీదేవి(50), కూతురు చైతన్య(30), కొడుకు శివప్రసాద్(26) ఉన్నారు. కాగా కొంతకాలంగా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులకు ఆకర్షితుడైన శివ ప్రసాద్ పెద్ద మొత్తంలో అప్పుల పాలయ్యాడు. పెట్టుబడుల కోసం స్నేహితులు, బంధువుల నుంచి అప్పులు తీసుకురాగా.. లాభాలు రాకపోవడంతో అప్పులు తీర్చేందుకు లోన్ యాప్ లను ఆశ్రయించాడు. అయినా లోన్లు తీర్చే పరిస్థితి లేకపోవడం, అప్పు ఇచ్చిన వారు డబ్బుల కోసం ఒత్తిడి పెంచడంతో కుటుంబం మొత్తం తీవ్ర మనో వేదనకు గురైంది.
దీంతో తప్పని సరి పరిస్థితుల్లో మొండయ్య కుటుంబ సభ్యులంతా కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. తమ ప్లాన్ లో భాగంగానే మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మొండయ్య, శ్రీదేవి, చైతన్య, శివ ప్రసాద్ అంతా కలిసి గడ్డి మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. అనంతరం మొండయ్య జరిగిన విషయాన్ని తన బావమరిది అయిన రమేష్ కు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో వాళ్లు వెంటనే మొండయ్య ఇంటికి చేరుకుని, వారిని 108 వాహనంలో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వెంటనే మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ వారి పరిస్థితి విషమించడంతో అక్కడి డాక్టర్ల సిఫారస్ మేరకు నలుగురినీ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
ముగ్గురు మృతి.. ఒకరి పరిస్థితి విషమం
మొండయ్య, శ్రీదేవి, చైతన్య, శివ ప్రసాద్ గడ్డి మందు తాగి ఆసుపత్రిలో అడ్మిట్ కాగా.. మంగళవారం ఉదయం నుంచి ఎంజీఎం డాక్టర్లు వారికి ట్రీట్మెంట్ అందించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో మొండయ్య, శ్రీదేవి, చైతన్య బుధవారం ఉదయం ప్రాణాలు కోల్పోయారు.
శివ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉండటంతో ఆయనకు చికిత్స కొనసాగిస్తున్నారు. కాగా వరంగల్ ఎంజీఎం డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులకు ఎమర్జెన్సీ వార్డుకు బదులు జనరల్ మెడికల్ వార్డులోనే చికిత్స అందించారని, అందుకే సరైన వైద్యం అందక ముగ్గురు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్న శివప్రసాద్ కు కూడా జనరల్ వార్డులోనే చికిత్స అందిస్తున్నారని, ఆయనకైనా మెరుగైన వైద్యం అందించేందుకు డాక్టర్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.