Warangal Crime : ఆడ గొంతుతో మాట్లాడి,పెళ్లి పేరుతో రప్పించి దోచేశారు..! ఇది మాములు ట్రాప్ కాదు
సులభంగా డబ్బులు సంపాదించాలని అతగాడు ప్లాన్ వేశాడు. మహిళా పేరుపై సిమ్ కార్డు తీసుకొని… ఆడ గొంతుతో మాట్లాడి ఓ వ్యక్తిని ట్రాప్ చేశాడు. ఏకంగా పెళ్లి పేరుతో హన్మకొండకు రప్పించి.. దారి దోపిడీకి పాల్పడ్డాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు… కేసును చేధించి ముగ్గురిని అరెస్ట్ చేశారు.
ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు వ్యక్తులు సరికొత్త మోసానికి తెరలేపారు. జోడీ డాట్ కామ్ వెబ్ సైట్ లో లేడీ పేరుతో ఫేక్ ప్రొఫైల్ అప్ లోడ్ చేయడమే కాకుండా, పెళ్లి చేసుకుంటానని రప్పించి, దారి దోపిడీకి పాల్పడ్డారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... హనుమకొండ రాం నగర్ కు చెందిన గోదారి శేఖర్ ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. రోజూ ఆటో నడిపితే వచ్చే డబ్బులు కుటుంబ పోషణతో పాటు జల్సాలకు సరిపోకపోవడంతో ఈజీగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ వద్ద పరకాలకు చెందిన లక్ష్మి అనే మహిళ గోదారి శేఖర్ కు పరిచయం కాగా.. ఆమెకు రూ.వెయ్యి ఇచ్చి ఆమె ఐడీ ప్రూప్ తో ఒక ఎయిర్టెల్ సిమ్, ఒక జియో సిమ్ కొనుగోలు చేశాడు. అంతేగాకుండా జోడీ డాట్ కామ్ అనే వెబ్ సైట్ లో లక్ష్మీ అనే పేరుతో ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి అప్ లోడ్ చేశాడు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
యాదాద్రి భూవనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామానికి చెందిన దేవులపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి జోడీ డాట్ కామ్ లో లక్ష్మీ పేరున ఉన్న ప్రొఫైల్ చూశాడు. అనంతరం వారి టచ్ లోకి వెళ్లిన శ్రీనివాస్ తనకు భార్య లేదని, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. తనకంటూ ఒక తోడు కావాలనుకుంటున్నట్లు వాట్సాప్ లో మెసేజ్ లు కూడా పంపించాడు. కాగా శ్రీనివాస్ ను ఎలాగైన ముగ్గులోకి దించాలనుకున్న శేఖర్.. లక్ష్మీ పేరుతో ఆడ గొంతుతో మాట్లాడటం మొదలుపెట్టాడు. తన పేరు లక్ష్మీ అని… తనది ములుగు గ్రామమని తాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని నమ్మించాడు. దీంతో పెళ్లి చేసుకోవడానికి ఒకరికొకరు సరేననని ఒప్పుకున్నారు.
హనుమకొండ రప్పించి దారి దోపిడీ
శ్రీనివాస్ ను ట్రాప్ చేసిన శేఖర్ విషయాన్ని తన మిత్రులైన రాజయ్య, లక్ష్మయ్యలకు చెప్పాడు. ఎలాగైనా తన నుంచి డబ్బులు గుంజాలని నిర్ణయించుకున్నారు. అక్టోబరు 25న పథకం ప్రకారం దేవులపల్లి శ్రీనివాస్ ను హనుమకొండ బస్టాండుకు రప్పించారు. అనంతరం తమ ప్లాన్ లో భాగంగా శ్రీనివాస్ ను వరంగల్ రింగ్ రోడ్డు సమీపంలోని కోమటిపల్లి రైల్వే ట్రాక్ దగ్గర్లో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు.
అనంతరం అతడిపై దాడి చేసి, అతని వద్ద ఉన్న డబ్బులు తీసుకున్నారు. అంతటితో ఆగకుండా ఫోన్ పేలో ఉన్న మరో రూ.24 వేలను రెండు పెట్రోల్ బంకుల వద్ద డ్రా చేసుకున్నారు. అనంతరం శ్రీనివాస్ సెల్ ఫోన్ లాక్కొని ముగ్గురు కలిసి శ్రీనివాస్ ను ఆటోలో ఎక్కించుకొని దేవన్నపేట క్రాస్ రోడ్డు వద్ద దింపేశారు. విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరింపులకు గురి చేశారు. అనంతరం వారి వద్ద ఉన్న రెండు సిమ్ కార్డులను చింతగట్టు కెనాల్ లో పడేసి… శ్రీనివాస్ నుంచి లాక్కున్న రూ.24వేలను ముగ్గురూ పంచుకుని ఇంటికి వెళ్లిపోయారు.
స్పెషల్ టీమ్స్ తో ఇన్వెస్టిగేషన్
తనకు జరిగిన అన్యాయాన్ని శ్రీనివాస్ అక్టోబర్ 20న కేయూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేయూ సీఐ రవికుమార్ కేసు నమోదు చేసుకొని ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. తమవద్ద ఉన్న సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు.
ఈ క్రమంలో శనివారం సాయంత్రం గోపాల్ పూర్ జంక్షన్ వద్ద కేయూ సీఐ రవి కుమార్ తన సిబ్బందితో తనిఖీలు చేపట్టి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.24 వేల నగదు, ఆటో, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న పరకాలకు చెందిన లక్ష్మి కోసం గాలిస్తున్నట్లు ఏసీపీ దేవేందర్ రెడ్డి తెలిపారు. సమావేశంలో కేయూ ఎస్సైలు ప్రవీణ్ కుమార్, రవీందర్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.