Hyd Suicide: ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత ఆస్తిలో వాటా ఇవ్వాలని, అడిగిన డబ్బు ఇవ్వకపోతే హత్య చేయిస్తానంటూ బెదిరింపులకు పాల్పడటంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడటం సంచలనం సృష్టించింది. మృతుడి తల్లి ఫిర్యాదుతో భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాబాద్ లక్ష్మీ నర్సింహ నగర్‌లో బుధవారం జరిగిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన మహ్మద్ నవాజ్ సినీ పరిశ్రమలో కెమెరా మెన్‌గా పనిచేస్తున్నాడు. నవాజ్ 2020లో శ్వేతారెడ్డి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులు వీరి కాపురం సజావుగానే సాగింది.
ఆ తర్వాత కాలంలో శ్వేతారెడ్డి ఆస్తి కోసం నవాజ్‌ను వేధించడం మొదలు పెట్టింది. ఇద్దరి మధ్య డబ్బు విషయంలో గొడవలు ముదిరాయి. ఈ క్రమంలో భర్తను వేధించడానికి శ్వేతారెడ్డి అతనిపై బాన్సువాడ, కరీంనగర్, బాలానగర్ పోలీసుస్టేషన్లలో కేసులు పెట్టింది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఆరు నెలల క్రితం హైదరాబాద్ లక్ష్మీన ర్సింహనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. హైదరాబాద్ మారిన తర్వాత కూడా పలు మార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని స్థానికులు తెలిపారు.
ఈ క్రమంలో ఈ నెల 16న ఆస్తిలో వాటాతో పాటు రూ.30 లక్షలు ఇవ్వాలని భార్య తనను వేధిస్తోందని నవాజ్ తన తల్లి సబేరా బేగంకు ఫోన్ చేసి చెప్పాడు. ఇంట్లో భోజనం పెట్టకుండా, నిద్ర లేకుండా హింసిస్తోందని వాపోయాడు. దీంతో నవాజ్ తల్లి సబేరా కోడలు శ్వేతారెడ్డికి ఫోన్ చేసి అడగడంతో తనకు కావాల్సింది ఇవ్వక పోతే కిరాయి మనుషులతో హత్య చేయిస్తానంటూ బెదిరించింది.
మరుసటి రోజు ఇద్దరి మధ్య మరో సారి గొడవ జరగడంతో నవాజ్ తన తల్లికి తాను బతకలేనంటూ వాపోయాడు. కొద్ది సేపటికి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై నవాజ్ తల్లి సబేరా ఫిర్యాదు మేరకు శ్వేతారెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు
.
సంబంధిత కథనం