Korutla Murder: చంపుతానని బెదిరింపులు…చివరకు ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురైన యువకుడు
Korutla Murder: విభేదాల నేపథ్యంలో ఓ వ్యక్తిని చంపుతానని బెదిరించిన యువకుడే హత్యకు గురయ్యాడు. సర్ధి చెప్పడానికి వచ్చిన వారిని కూడా చంపుతానని బెదిరించడంతో అతని నుంచి ముప్పు ఉంటుందని భయపడి ప్రత్యర్థులు దారుణంగా హతమార్చిన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది.
Korutla Murder: చంపుతానని బెదిరించి చివరకు తానే హత్యకు గురైన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది. ఈ హత్య కేసులో కోరుట్ల పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసి ఒక కత్తి రెండు బైక్ లు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ హత్యకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోరుట్ల పట్టణంలోని ప్రకాశం రోడ్ కు చెందిన పంబాల మధు, ఇప్పకాయల నరేష్ అనే వారితో సాగర్ గొడవ పడ్డాడు. గొడవల నేపథ్యంలో వారిద్దరిని చంపుతానని సాగర్ బెదిరించాడు. భయపడ్డ ఇద్దరు గుద్దేటి వెంకటేష్ విషయం చేప్పగా రాజీకుదుర్చేందుకు ప్రయత్నించాడు.
సాగర్ అందుకు ససేమిరా అంటూ ఎప్పటికైనా మధు, నరేష్ లను చంపుతానని అనడంతో ఈనెల 14న రాత్రి 10 గంటల సమయంలో తన అనుచరులతో కలిసి పంబాల నాగరాజు ఇంటికి వెళ్లి అతనితో గొడవ పడి నానా హంగామా సృష్టించాడు. వెంటనే గుద్దేటి వెంకటేష్, గుద్దేటి విజయ్, రాకేష్ లు నాగరాజు ఇంటికి వెళ్లి అక్కడ నాగరాజు తో గొడవ పడుతున్న సాగర్ ను నాలుగు రోడ్ల కూడలి వద్దకు లాక్కొచ్చి కత్తితో గొంతు కోసి చంపేశారు.
చంపుతానని బెదిరించి చివరకు తానే హత్యకు గురికావడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆరుగురిలో ఐదుగురిని అరెస్టు చేశారు. అందులో పంబాల నాగరాజు పరారీలో ఉన్నాడని మెట్ పల్లి డిఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. అరెస్టు అయిన వారిలో గుండేటి వెంకటేష్, విజయ్ ఇద్దరు అన్నదమ్ములు, ఇప్పకాయల నరేష్, రాకేష్ ఇద్దరు అన్నదమ్ములు, పంబాల నాగరాజు ఉన్నారు.
ఫేక్ గాళ్ళపై కేసులు…
సోషల్ మీడియాలో ఫేక్ ఐడి లతో ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ అకౌంట్ లు క్రియేట్ చేసి లేదా మహిళల సోషల్ మీడియా అకౌంట్స్ ని హ్యాక్ చేసి అసభ్యకర వీడియోలు, ఫోటోలు పంపే వారి ఆటపట్టించారు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు. విద్యార్థినుల పేరుతో ఇంస్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి వేధింపులకు పాల్పడుతున్న ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
సోషల్ మీడియా వేదికగా మహిళలు, విద్యార్థినులను వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. మహిళలకు, విద్యార్థినులకు షీ టీమ్ అండగా నిలుస్తుందన్నారు. మహిళలు, విద్యార్థినులు వేధింపులకు గురైతే నిర్భయంగా జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 కు పిర్యాదు చేయాలని కోరారు.
మహిళలు, విద్యార్థినిలు వేధింపులకు గురి అవుతున్న పిర్యాదులు ఎక్కవ వస్తున్నాయని, వేధింపులకు పాల్పడే పోకిరిల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఆడపిల్లలను, మహిళలను వేధించినా, అసభ్యంకర ఫొటోలు, వీడియోలు పంపిన, సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేసినా, మిత్రులకు షేర్ చేసినా తీవ్రమైన నేరంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు
సోషల్ మీడియా పై పోలీస్ నిఘా ఉంటుందని ఏదైనా సమస్య ఉంటే వెంటనే మహిళలు, విద్యార్థినులు నిర్భయంగా జిల్లా షీ టీమ్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. వేధింపులకు గురైనట్లయితే వెంటనే డయల్ 100, లేదా షీ టీం నెంబర్ 87126 56425 కి పిర్యాదు చేసినచో వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
సిరిసిల్లలో ATM దొంగ అరెస్టు…
సిరిసిల్ల లోని సంజీవయ్య నగర్ లో గల SBI ATM లో చోరీకి యత్నించిన ఆకుబత్తిని శ్రీకాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన శ్రీకాంత్ ప్రస్తుతం సిరిసిల్ల ధోబిగల్లిలో నివాసం ఉంటూ సుత్తెతో ATMను పగలగొట్టి చోరీకి యత్నించాడని టౌన్ ఇన్స్పెక్టర్ కృష్ణ తెలిపారు. ATM నుండి డబ్బులు రాకపోవడంతో ఏటీఎం రూములో గల సీసీ కెమెరాలను సీలింగును సుత్తితో ధ్వంసం చేశాడని చెప్పారు.
సీసీ కెమెరాల సహాయంతో ఐదు గంటల వ్యవధిలోనే పట్టుకొని రిమాండ్ కు తరలించామని ప్రకటించారు. నేరాల నియంత్రణలో నిందుతులకు శిక్షలు పడటంలో సీసీ కెమెరాలది కీలక పాత్ర అని ప్రజల, వ్యాపారస్తులు స్వచ్చందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సిఐ కృష్ణా కోరారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)