Sircilla Land Scam : సర్కార్ భూమి హాంఫట్..! సిరిసిల్లలో వెయ్యి ఎకరాలకు పైగా భూకబ్జా, కదులుతున్న డొంక
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెయ్యికి పైగా ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురయ్యింది. ఇప్పటికే 250 ఎకరాలను అధికారులు గుర్తించారు. ఐదు కేసులు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. మరో 12 మందిపై పిర్యాదులు అందగా అక్రమంగా పొందిన భూమిని ఇద్దరు స్వచ్చంధంగా ప్రభుత్వానికి సరెండర్ చేశారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకున్నారు. అధికారులను మభ్యపెట్టారు…! పైరవీకారుల అండదండలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూ అక్రమ దందాకు తెర లేపారు. ఒకటి కాదు రెండు కాదు వెయ్యికి పైగా ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేశారు. రైతుబంధుతో సర్కార్ సొమ్మును దొబ్బితిన్నారు. పాలకులు మారడంతో అక్రమాల పుట్టకదిలి కబ్జాదారుల చిట్టా బయటపడింది. ఇప్పటికే ఐదుగురు కటకటాలు లెక్కిస్తుండగా కబ్జాదారులు భయాందోళన చెందుతున్నారు. అక్రమంగా పొందిన భూమిని సర్కార్ కు సరెండర్ చేస్తున్నారు.
ఇప్పటికే 250 ఎకరాలు గుర్తింపు...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూమాఫియా రెచ్చిపోయింది. ప్రభుత్వం భూమిని కాజేశారు. తంగళ్ళపల్లి, ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల మండలాల పరిధిలో వెయ్యి ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకుని పట్టాదారులుగా మారారు. సిరిసిల్ల మండలంలో సర్దాపూర్, పెద్దూరు, ఎల్లారెడ్డిపేట మండలంలో వెంకటాపూర్, తంగళ్లపల్లి మండలంలో గోపాల్ రావుపల్లి, లక్ష్మీపూర్, తాడూరు, అంకుసాపూర్, పాపయ్యపల్లి గ్రామాల్లో 250 ఎకరాలకు పైగా కొల్లగొట్టారు.
ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 100 మందికి దొడ్డిదారిన పట్టాలు జారీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడ భూముల విలువ ఎకరా 50 లక్షల వరకు పలుకుతోంది. అంటే 125 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి పరులపాలైందన్న మాట. దీంతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐదేళ్లలో అందించిన పెట్టుబడి సహాయ 2 కోట్లకు పైగా ప్రజాధనం అనర్హుల ఖాతాల్లో జమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున భూముల ఆక్రమణ చోటుచేసుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
చిట్టా విప్పుతున్న సర్కార్...
సిరిసిల్ల మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ లో 545 సర్వే నంబర్ లో 1,650 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి సరిహద్దును పంచుకుంటూ నాలుగు పల్లెలు ఉన్నాయి. దీనిలో 40 మంది అక్రమంగా పట్టాలు పొందారు. భూ దస్త్రాల ప్రక్షాళన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ అండ చూసుకుని స్థానిక నాయకులు పెద్దఎత్తున డబ్బు వసూలు చేసి కబ్జాదారులతో దరఖాస్తులు పెట్టించి పట్టాలు జారీ అయ్యేలా చూశారు.
రెవెన్యూ అధికారులు సైతం నిబంధనలు పాటించకుండానే పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేశారు. గత ప్రభుత్వం సాగు భూములకు పెట్టుబడి సాయం 'రైతుబంధు' అందించేందుకు 2017-19 మధ్య చేపట్టిన భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమాన్ని కబ్జాదారులు సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ భూములను ఆక్రమించి పట్టాలు పొందారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారులు భూకబ్జాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో అక్రమ దందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన భూకబ్జాలు కేవలం పావు మాత్రమేనని, సిరిసిల్లలో బిఆర్ఎస్ నిర్మించిన తెలంగాణ భవనం సైతం ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కట్టిందేనని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. కబ్జాదారులు ఎవరైనా చర్యలు తీసుకోక తప్పదని స్పష్టం చేశారు.
మాజీ సర్పంచ్ తో పాటు మరొకరు సరెండర్..
భూ అక్రమ దందాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించడంతో అక్రమంగా పొందిన ప్రభుత్వం భూమి మాకొద్దని సర్కార్ కు సరెండర్ చేస్తున్నారు. లక్ష్మీపూర్ మాజీ సర్పంచ్ మిట్టపల్లి పద్మ తాను పొందిన రెండెకరాల ప్రభుత్వ భూమిని తిరిగి వెనక్కు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు.
కలెక్టరేట్ లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ కు అక్రమంగా పొందిన భూ పత్రాలను లక్ష్మీ అందజేశారు. అదే విధంగా సారంపల్లిలో గత కొన్ని సంవత్సరాలుగా 3 ఎకరాల అసైన్డ్ భూమిని తన కబ్జాలో ఉందని కుమారస్వామి అనే వ్యక్తి కలెక్టర్, ఎస్పీల సమక్షంలో ప్రభుత్వానికి ఆ భూమి పత్రాలు అప్పగించారు. ఆ భూములను నిరుపేదలకు, ఇళ్ల స్థలాల కోసం వినియోగిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇంకా ఎవరైనా అక్రమంగా ప్రభుత్వ భూమిని పొందుతే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు.
ఐదు కేసులు - పలువురు అరెస్ట్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తవ్వినాకొద్ది భూ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఐదు కేసులు నమోదు చేసి బిఆర్ఎస్ కు చెందిన బొల్లి రాంమోహన్, వొజ్జల అగ్గిరాములు, జిందం దేవదాస్, కోడూరి భాస్కర్, సురభి నవీన్ రావులను అరెస్టు చేశారు. మరో 12 మంది పై ఫిర్యాదులు అందాయని వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
కబ్జాదారుల్లో కాంగ్రెస్ నేతలు...
ప్రభుత్వ భూమిని అక్రమంగా పొందిన వారిలో కాంగ్రెస్ నాయకులు సైతం ఉన్నారని బిఆర్ఎస్ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న 2004 నుంచి 2014 వరకు పదేళ్లలో ప్రభుత్వ అసైన్ ల్యాండ్ ను పట్టాలుగా కాంగ్రెస్ నాయకులు పొందాలని బిఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అందుకు సంబంధించిన వివరాలను అధికారులకు అందజేశారు. వారిపై సైతం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధికారులు సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ భూమిని అక్రమంగా పొందిన వారి వివరాలు సేకరించి స్వాధీనం చేసుకునే పనిలో నిమగ్నయ్యారు.
సాగుకు ఏ మాత్రం పనికిరాని గుట్టలు, రాళ్లు రప్పలు తప్ప విత్తు మొలకెత్తని పోడు భూములు, అడవులకు కూడా అప్పట్లో కొత్తగా పాసుపుస్తకాలు జారీ అయ్యాయి. అప్పట్లో పట్టా పాసుపుస్తకం ఉంటే చాలు క్షేత్రస్థాయిలో భూమి పరిశీలన లేకుండానే పెట్టుబడి సాయం అందించడం అక్రమార్కులకు కలిసి వచ్చింది. ప్రభుత్వ ఎసెన్స్ లావుణి, అటవీ భూములకు దొడ్డిదారిన పట్టాలు పొందారు.
రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రజాప్రతినిధుల సిఫార్సులు కూడా ఉండటంతో నిబంధనలు విరుద్ధమైనా కొన్ని చోట్ల రెవెన్యూ అధికారులు నాడు హక్కులు కల్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూమి కబ్జాలో ఉండి రైతుబంధు పొందిన వారికి డిమాండ్ నోటీసులు ఇచ్చి రైతుబంధు నిధులను రికవరీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.