జూబ్లీహిల్స్ బైపోల్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ మాత్రం అభ్యర్థిని ప్రకటించింది. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. తర్జన భర్జనలు పడుతున్నట్టుగా కనిపిస్తుంది. నగరం నడిబొడ్డున ఉన్న సీటు కావడంతో ఆశావాహులు కూడా ఎక్కువే ఉన్నారు.
నవంబర్ 11న జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి 25,000 కంటే ఎక్కువ ఓట్ల మెజారిటీ సాధించడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక లక్ష్యమని సమాచారం. రాబోయే రెండు లేదా మూడు రోజుల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని పార్టీ నాయకులకు సీఎం తెలియజేసినట్లు అంటున్నారు. ఫైనల్ డెసిషన్ కోసం కోసం నలుగురు పేర్లతో కూడిన ప్యానెల్‌ను పార్టీ హైకమాండ్‌కు పంపినట్టుగా తెలుస్తోంది.
లిస్ట్ ఫైనల్ చేసే ముందు ప్రతి అభ్యర్థి ఎన్నికల బలాలు, క్షేత్రస్థాయి మద్దతును వ్యక్తిగతంగా అంచనా వేశారు. పార్టీ అభ్యర్థిని ఖరారు చేయడానికి, సన్నాహాలను సమీక్షించడానికి రేవంత్ రెడ్డి మంగళవారం ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌లతో వ్యూహాత్మక సమావేశం నిర్వహించారు. షార్ట్‌లిస్ట్ చేసిన నలుగురు అభ్యర్థులలో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్, సీఎన్ రెడ్డి ఉన్నారు.
నవీన్ యాదవ్ గతంలో జూబ్లీ హిల్స్ నుండి రెండుసార్లు పోటీ చేశారు. 2014లో ఏఐఎంఐఎం టికెట్‌పై రెండో స్థానంలో నిలిచారు. 2018లో స్వతంత్ర అభ్యర్థిగా మూడో స్థానంలో నిలిచారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన నవంబర్ 2023లో కాంగ్రెస్‌లో చేరారు. 2016, 2021 మధ్య జీహెచ్ఎంసీ మేయర్ అయిన రామ్మోహన్, ఫిబ్రవరి 2024లో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌కు మారారు. ఆయనకు నగరంలో పేరు ఉంది. 2020లో రహమత్ నగర్ నుంచి ఎన్నికైన మాజీ బీఆర్ఎస్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి కూడా నవంబర్ 2023లో కాంగ్రెస్‌లో చేరారు.
2004, 2009లో సికింద్రాబాద్ నుండి ఎంపీగా పనిచేసిన సీనియర్ నాయకుడు ఎం.అంజన్ కుమార్ యాదవ్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నుండి ఓడిపోయారు, ఆయన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ తరువాత ఏప్రిల్ 2024లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్, రామ్మోహన్, సీఎన్ రెడ్డిలను ప్రధాన పోటీదారులుగా ఎంచుకున్నారని, అంజన్ కుమార్ యాదవ్‌ను నాల్గో ఆప్షన్‌గా పెట్టుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు అధిష్టానానికి పేర్లను పంపించారు.
గత ఎన్నికల డేటాపైనా రేవంత్ రెడ్డి పరిశీలించినట్టుగా తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ నాయకుడు మాగంటి గోపీనాథ్ 2014లో 9,242 ఓట్ల ఆధిక్యంతో, 2018లో 16,004 ఓట్ల ఆధిక్యంతో, 2023లో 16,337 ఓట్ల ఆధిక్యంతో ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓటు అధికార పార్టీ వైపు మళ్లే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ ఆ గణాంకాలను దాటాలని, రేవంత్ రెడ్డి 25 వేల మెజారిటీని స్పెషల్ టార్గెట్‌గా పెట్టుకున్నట్టుగా సమాచారం.