Karimnagar Accident: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని అహల్యానగర్ వద్ద రన్నింగ్ లో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ కాలిపోయింది. ముగ్గురు యువకులు బైక్ పై ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా పొగ రావడంతో బైక్ ను ఆపేశారు. క్షణాల్లో మంటలు చెలరేగడంతో ఎలక్ట్రిక్ బైక్ కావడంతో పేలుతుందని భయపడి ముగ్గురు యువకులు బైక్ ను వదిలేసి పారిపోయారు.
హుజురాబాద్ అహల్య నగర్ రోడ్డుపై చూస్తుండగానే మంటల్లో బైక్ కాలిపోయింది. భయాందోళనకు గురైన స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించగా అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేలోగా బైక్ కాలిబూడిదయ్యింది. బైక్ లో మంటలు వస్తున్న విషయం గమనించిన ముగ్గురు యువకులు బైక్ ను వదిలిపెట్టి పారిపోయారని స్థానికులు తెలిపారు. ఆ ముగ్గురు ఎవరు ఎక్కడి వారనేది తెలియాల్సి ఉంది.
రన్నింగ్ లో ఉన్న ఈ బైక్ దగ్దం కావడంతో పలు రకాల చర్చసాగుతుంది. మండే ఎండలతో ఈ బైక్ హీట్ కావడానికి కారణాలు ఏమిటనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ బైక్ లను ప్రభుత్వం ప్రోత్సహిస్తుండగా ఎండలకే కాలిపోతే ఏలా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. బైక్ దగ్దానికి కారణాలను అన్వేషించే పనిలో పోలీసులతోపాటు ఆర్టీవో అధికారులు నిమగ్నమయ్యారు.
మరో వైపు జమ్మికుంట ప్లై ఓవర్ పై ఘొర ప్రమాదం జరిగింది. ఈ- బైక్ పై జమ్మికుంటకు చెందిన ప్రైవేట్ ఎలక్ట్రిషన్ తిరుపతి వెళ్తుండగా ప్లై ఓవర్ పై డీసిఎం వ్యాన్ ఢీ కొట్టింది. ఈ బైక్ పై ఉన్న తిరుపతి తల నుజ్జునుజ్జై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైక్ ను డిసిఎం వ్యాన్ ఢీ కొట్టిన సమయంలో మంటలు చెలరేగితే పెద్ద ప్రమాదమే జరిగేదని స్థానికులు తెలిపారు. హుజురాబాద్ లో ఈ బైక్ దగ్దం కావడం, జమ్మికుంటలో ఈ బైక్ ప్రమాదానికి గురికావడంతో స్థానికంగా కలకలం సృష్టిస్తుంది.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం