Bhupalpally District : అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన దొంగలు - భర్తను కట్టేసి... భార్య గొంతు కోశారు..!
భూపాలపల్లి జిల్లాలోని బస్వాపూర్ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు.. దంపతులపై దాడి చేశారు. భర్తను కట్టేసి.. భార్య గొంతును కోశారు. ఇంట్లోని నగదుతో పాటు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి ఓ ఇంట్లోకి వెళ్లి చోరీకి పాల్పడ్డారు. భర్తను కట్టేసి… భార్య గొంతు కోశారు. లక్ష రూపాయల నగదుతో పాటు బంగారం, బైకును అపహరించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
వివరాల్లోకి వెళ్తే…. కాటారం మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. బస్పాపూర్ కి చెందిన పడాల తిరుపతి,స్వర్ణలత దంపతులు కాటారం నుంచి భూపాలపల్లి వైపు వెళ్లే రహదారికి సమీపంలో కిరాణం షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం రాత్రి తర్వాత దంపతులు ఇద్దరు మూత్ర విసర్జనకు బయటకు రాగా గుర్తుతెలియని ముగ్గురు దుండగులు వారిపై హఠాత్తుగా దాడి చేశారు. దంపతులను కట్టేసి భార్య గొంతుపై కత్తి పెట్టి చంపేస్తామని బెదిరించారు.
లక్ష రూపాయల నగదతో పాటు ఆరు తులాల బంగారం, ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లారు. గొంతుపై కత్తి పెట్టడంతో భార్య గాయపడింది. బాధితులిద్దరూ భూపాలపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పారు. 353 జాతీయ రహదారి పక్కనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
సమాచారం తెలుసుకున్న జిల్లా అడిషనల్ ఎస్పీ బోనాల కిషన్, కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి సిబ్బందితో కలిసి ఇవాళ బస్వాపూర్ గ్రామాన్ని సందర్శించారు. ఘటనాస్థలిలో వివరాలను సేకరించారు. క్లూస్ టీం,డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపి ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
టాపిక్