Hyderabad : దేవాలయం హుండీలో డబ్బులు కొట్టేసేందుకు ప్లాన్.. అంతలోనే ఊహించని ట్విస్ట్!
Hyderabad : ఆలయంలోని హుండీపై ఓ దొంగ కన్ను పడింది. హుండీలోని డబ్బులను కొట్టేసేందుకు పక్కా ప్లాన్‌తో వెళ్లాడు. హుండీ లాకర్‌ను కట్ చేస్తుండగా.. సడెన్‌గా ఓ వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో దొంగ పరుగో పరుగు అంటూ పారిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
హైదరాబాద్ ఉప్పల్‌లోని వెల్లిగుట్టలో శ్రీ మల్లికార్జున భ్రమరాంబ దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో హుండీలోని డబ్బులు దొంగిలిచేందుకు ఓ దుండగడు ప్రయత్నించాడు. కటింగ్ ప్లేయర్‌తో విఫలయత్నం చేశాడు. హుండీ లాకర్ ఓపెన్ చేస్తుండగా.. అప్పుడే టెంపుల్ వాచ్‌మెన్ అక్కడి వచ్చారు. దీంతో దొంగ అతన్ని చూసి పరారయ్యాడు. ఆలయ ఛైర్మన్ ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. హుండీలోని డబ్బులును కొట్టేయడానికి వచ్చింది స్థానికుడే అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆలయం గురించి తెలిసిన వ్యక్తే.. దొంగతనానికి వచ్చి ఉంటారని భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల సికింద్రాబాద్ మోండా మార్కెట్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. రాత్రి ఆలయంలో శబ్దం రావడంతో మేల్కొన్న స్థానికులు.. ముగ్గురిలో ఒకరిని పట్టుకుని దేహశుద్ధిచేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నాంపల్లిలో..
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ విగ్రహాన్ని 11వ తేదీన ధ్వంసం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న బేగంబజార్ పోలీసులు.. విచారణ చేపట్టారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం అమ్మవారి విగ్రహాన్ని ఎగ్జిబిషన్ సొసైటీ, సిబ్బంది ఆధ్వర్యంలో ప్రతిష్టిస్తారు.
పాతబస్తీలో..
ఆగస్టు 27న కూడా పాతబస్తీలో ఇలాంటి ఘటనే జరిగింది. హైదరాబాద్ పాతబస్తీలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు భూలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం చేశారు. విగ్రహాలను పగులగొట్టారు. అక్కడి పూజా సామాగ్రి, పీట, ఇతర వస్తువులను చిందర వందర చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమ్మవారి విగ్రహంపైన ఉండే కిరీటం కిందపడి ఉండటం, అక్కడే రాళ్లు పడి ఉండటం ఈ వీడియోల్లో స్పష్టంగా రికార్డయింది.