Jagityala Tragedy: ఆస్తి తీసుకున్నారు...శవం వద్దన్నారు... అనాధగా అవ్వకు అంతిమ సంస్కారం…-they took the property they didnt want the body the last rites as orphan ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jagityala Tragedy: ఆస్తి తీసుకున్నారు...శవం వద్దన్నారు... అనాధగా అవ్వకు అంతిమ సంస్కారం…

Jagityala Tragedy: ఆస్తి తీసుకున్నారు...శవం వద్దన్నారు... అనాధగా అవ్వకు అంతిమ సంస్కారం…

HT Telugu Desk HT Telugu
Dec 26, 2024 05:44 AM IST

Jagityala Tragedy: జగిత్యాల లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆస్తిని తీసుకున్న వారు అంతిమ సంస్కారం చేయకుండా అనాధగా వదిలేశారు.‌ గంటల తరబడి రోడ్డుపై అయిన వారికోసం శవం ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. చివరకు స్థానికులు అయ్యే పాపం అంటూ పోలీసుల సమక్షంలో అంతిమ సంస్కారం నిర్వహించారు.

జగిత్యాలలో దారుణం, ఆస్తులు పంచుకుని అనాథగా వదిలేశారు
జగిత్యాలలో దారుణం, ఆస్తులు పంచుకుని అనాథగా వదిలేశారు

Jagityala Tragedy: అవ్వ ఆస్తిని కాజేసిన కఠినాత్ములు.. ఆమె మరణించాక కన్నెత్తి చూడకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. జగిత్యాల పట్టణంలో సాదుల సత్తవ్వ (85) అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.‌ సత్తవ్వ భర్త లక్ష్మణ్ 20 ఏళ్ళ క్రితం మరణించాడు. వారికి సంతానం లేకపోవడంతో సత్తవ్వ తోటి కోడలు కొడుకులు ప్రసాద్, రవి తన కొడుకులుగా భావించింది. తన ఆస్తులు వారిద్దరికి పంచి ఇచ్చింది.

yearly horoscope entry point

సొంత ఇంటితో పాటు పట్టణంలో ఉన్న భూమిని కూడా వారికి రాసిచ్చేసింది. సత్తవ్వను వాయిదాల పద్దతిలో పెంపుడు కొడుకులు ఇద్దరు నెలకొకరు చొప్పున చూసుకుంటున్నారు. అయితే ఇటీవలే అనారోగ్యం బారిన పడిన సత్తవ్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం చనిపోయింది. ఆమె మృతదేహాన్ని అంబులెన్స్ లో సొంత ఇంటికి తీసుకొచ్చినప్పటికీ ఇంటికి తాళం వేసి ఉండడంతో కొన్ని గంటల పాటు శవం రోడ్డు పై అంబులెన్స్ లోనే ఉండిపోయింది.

పెంపుడు కొడుకులు ఇద్దరు అటు వైపు కన్నెత్తి చూడకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.‌ పోలీసులు అక్కడకు చేరుకుని ఇంటికి వేసిన తాళం పగల గొట్టించి సత్తవ్వ శవాన్ని ఇంట్లో ఉంచారు. రాత్రంతా ఒంటరిగానే శవం ఇంట్లో ఉండిపోయింది.

అనాధగా మారిన అవ్వ శవం...

రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలు కాకున్నా కంటికి రెప్పలా చూసుకుంటారని కలలు కన్న ఆ తల్లి... కాలం చేసిన తర్వాత కన్న తల్లిలా అంత్యక్రియలు చేస్తారని భావించింది. అంతిమ ఘడియల్లో ఎలాంటి జీవనం సాగించిందో.. ఏమో కానీ, చివరకు అయిన వారితో అంత్యక్రియలకు నోచుకోలేకపోయింది. ఆస్తిపాస్తులు పంచుకునే వరకు బాగానే ఉన్నా అవసాన దశకు చేరుకున్న సత్తవ్వ పై పెంచుకున్న కొడుకులు చూపిన వివక్ష స్థానికులను కలిచి వేసింది.

ఆస్తులు సగం సగం పంచుకున్న ఇద్దరు నెలకొకరు చొప్పున అవ్వకు ఇంత బువ్వ పెట్టారు కానీ, అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువు ఒడిలో చేరిన ఆమె శవాన్ని కడసారి చూడకుండా స్వంత ఇంటిలోకి తీసుకెళ్లేందుకు ముందుకు రాక, అటు వైపు రాకుండా పోయారు. గంటల తరబడి చూసినా ఎవరు కనికరించలేదు. ఆస్తి విషయంలో రాజీ పడకుండా వాటా తీసుకున్న పెంపుడు కొడుకులు కనీసం ఆమెను చివరి చూపు చూసేందుకు కూడా రాకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్పందించని కొడుకులపై కేసు నమోదు..

అనాధగా మారిన అవ్వ శవం స్థానికులను ఆందోళనకు గురి చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న మహిళా ఎస్సై గీతారెడ్డి సత్తవ్వ పెంచుకున్న కుమారునికి ఫోన్ చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. సత్తవ్వ మృతదేహం వద్దకు రావడానికి నిరాకరించాడు. పెంచుకున్న తల్లి చనిపోతే ఇలా వ్యవహరించడం ఏంటని ఎస్సై మందలించిన అతనిలో మార్పు రాలేదు. చనిపోయిన శవాన్ని ఇలా వదిలేసి వెళ్ళడం సమంజసం కాదని, భవిష్యత్తు తరాలకు ఇచ్చే సందేశం ఇదేనా అని వ్యాఖ్యానించినప్పటికి ఆయన మాత్రం స్పందించలేదు. సత్తవ్వ ఆస్తులను పంచుకుని ఆమెను పట్టించుకోకపోవడంపై ఆగ్రహించిన ఎస్సై ఆమె ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారులకు సిఫార్సు చేస్తానని హెచ్చరించారు. అయినా వారిలో చలనం లేకపోవడంతో సుమోటోగా ఇద్దరు కొడుకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అనాధగా అంతిమ సంస్కారం...

అయితే ఓ పెంపుడు కొడుకు ఇంట్లో నెల రోజుల్లో వివాహం ఉన్న కారణంగా తన ఇంటికి తీసుకెళ్లలేకపోతున్నానని వివరించగా, మరో కొడుకు అటువైపు కనీసం కన్నెత్తి చూడకపోవడం స్థానికుల హృదయాలను ద్రవింపజేసింది. ఎవ్వరు రాకపోవడంతో చివరకు పోలీసుల జోక్యంతో స్థానికులు అనాధగా మారిన అవ్వ శవానికి అంతిమ సంస్కారం నిర్వహించారు. సత్తవ్వ ఆస్తిని పంచుకున్న పెంపకం కొడుకులు ఇద్దరు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం, అంత్యక్రియలు నిర్వహించకపోవడంపై స్థానికులు కన్నీటిపర్యంతమై శాపనార్థాలు పెట్టారు. ఆస్థిని తీసుకుని అంత్యక్రియలు చేయని కొడుకుల పై కఠిన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner