Tourism Places | డెస్టినేషన్ వికారాబాద్.. అనంతగిరి అందాలు, కోట్‌పల్లి బోటింగ్
ఈ మధ్యకాలంలో నగరవాసులకు మంచి వీకెండ్ స్పాట్‌గా మారిందీ అనంతగిరి. దీంతోపాటు బుగ్గ రామేశ్వరాలయం, కోట్‌పల్లి ప్రాజెక్ట్, సర్పన్‌పల్లి, లక్నాపూర్ చెరువులు, మరెన్నో రిసార్ట్‌లు ఈ కొండ చుట్టూ ఉన్నాయి. రానున్న రోజుల్లో రూ.150 కోట్ల ఖర్చుతో ఇక్కడ అడ్వెంచర్ టూరిజాన్ని కూడా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
Tourism Places.. తెలంగాణలో, అందులోనూ రాజధాని హైదరాబాద్ నగరానికి అతి దగ్గరలో, తెలంగాణ ఊటీగా పేరుగాంచిన అనంతగిరి అందాలు చూడాలంటే వికారాబాద్ వెళ్లాల్సిందే. హైదరాబాద్ నుంచి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉందీ వికారాబాద్. పట్టణం నుంచి తాండూరువైపు ఆరు కిలోమీటర్లు వెళ్తే అనంతగిరి ఆలయానికి చేరుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ అనంతగరితోపాటు వికారాబాద్ జిల్లాలో ఉన్న టూరిజం ప్లేస్‌లేంటో ఓసారి చూద్దాం.
అనంతగిరి హిల్స్
పచ్చని అడవి అందాలు చూడాలన్నా, ట్రెక్కింగ్, అడ్వెంచర్ ఇష్టపడే వాళ్లయినా, మూసీ నది జన్మస్థానాన్ని దర్శించుకోవాలన్నా ఈ అనంతగిరి హిల్స్‌కు రావాల్సిందే. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి ఓ వీకెండ్‌లో ఇలా వచ్చి అలా వెళ్లాలన్నా ఇంతకుమించిన హాలిడే డెస్టినేషన్ మరొకటి ఉండదు. అనంత పద్మనాభ స్వామివారు కొలువై ఉన్న ఈ కొండ చుట్టూ ఎన్నో పచ్చందాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.
ఆలయమే కాకుండా గుహలు, కోటలాంటి నిర్మాణాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ రాత్రి పూట బస చేయాలంటే తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హరిత రిసార్ట్స్‌తోపాటు అటవీ శాఖకు చెందిన హట్స్, మరెన్నో ప్రైవేటు రిసార్టులు ఉన్నాయి.
నిజాం కట్టించిన గుడి
ఏడాదిలో జులై నుంచి జనవరి మధ్య కాలంలో అనంతగిరి అందాలు చూడటానికి రెండు కళ్లూ చాలవు. తిరుమల శేషాచల కొండలకు తోకభాగంగా ఈ అనంతగిరిని వర్ణిస్తారు. స్కంద పురాణం ప్రకారం.. ద్వాపర యుగంలో మార్కండేయ రుషి ఇక్కడి పద్మనాభ స్వామి ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. ఇక ఇప్పుడున్న ఆలయాన్ని నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిర్మించారు.
నిజాం నవాబులు అప్పట్లో ఇక్కడకు వేటకు వచ్చేవారు. ఈ క్రమంలో ఉస్మాన్ అలీఖాన్ కలలోకి అనంత పద్మనాభ స్వామి వారు వచ్చి ఆలయం నిర్మించాల్సింది అడిగినట్లు చెబుతారు. చిన్న చిన్న కొండలకు నెలవైన అనంతగిరిలో ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ వంటివి చేయొచ్చు. ఇక అడవి అందాలను ఫొటోలు తీయాలంటే మీ ఫోన్ కెమెరాలకు క్షణం తీరిక కూడా ఉండదు.
బుగ్గ రామేశ్వరాలయం - అనంతగిరి హిల్స్
అనంత పద్మనాభ స్వామి ఆలయానికి దగ్గర్లోనే మరో ప్రముఖ క్షేత్రం ఈ బుగ్గ రామేశ్వరాలయం. ఇక్కడ ఉన్న పుష్కరిణిలో 365 రోజులూ నీటి ధార వస్తూనే ఉండటం ఈ ప్రాంత ప్రత్యేకత. వికారాబాద్‌కు కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. మహా శివరాత్రి వేడుకల ఇక్కడ ఘనంగా జరుగుతాయి.
కోట్‌పల్లి ప్రాజెక్ట్.. బోటింగ్ డెస్టినేషన్
ఇక అనంతగిరి హిల్స్ తర్వాత వికారాబాద్‌లో మరో పాపులర్ డెస్టినేషన్ కోట్‌పల్లి ప్రాజెక్ట్. వికారాబాద్ జిల్లాలో అతిపెద్ద చెరువు ఇదే. దీనికింది కొన్ని వేల ఎకరాల భూమి సాగవుతుంది. వీకెండ్ వస్తే చాలు ఈ మధ్య కాలంలో కోట్‌పల్లి ప్రాజెక్ట్ పర్యాటకులతో నిండిపోతోంది. ఇక్కడి జలాశయంలో బోటింగ్ ప్రత్యేక ఆకర్షణ. ఒకరు లేదంటే ఇద్దరు వెళ్లగలిగే కయాకింగ్ బోటింగ్ ఇక్కడ చేయొచ్చు.
వర్షాకాలంలో అయితే ఈ చెరువు అలుగు పారుతూ పర్యాటకులను మరింత ఆకట్టుకుంటుంది. ఇక కోట్‌పల్లి మాత్రమే కాకుండా సర్పన్‌పల్లి, లక్నాపూర్ వంటి చెరువులు కూడా అనంతగిరి కొండలకు చేరువగా ఉన్నాయి. క్రమంగా వీటికి కూడా పర్యాటకుల తాకిడి పెరుగుతోంది.
వికారాబాద్ చేరుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. బస్సులు, రైళ్లలో కాకుండా ప్రైవేట్ వెహికిల్స్‌లోనూ రావచ్చు. హైదరాబాద్ నుంచి కేవలం 70 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండటంతో.. ప్రైవేటు వాహనాల్లో అయితే గంటన్నరలోపే ఇక్కడికి చేరుకోవచ్చు.
సంబంధిత కథనం