Karimnagar Tourism: సెలవుల్లో చూసొద్దాం రండి... ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూడదగ్గ ప్రదేశాలు ఇవే
Karimnagar Tourism: ఉమ్మడి కరీంనగర్ జిల్లా చారిత్రక వైభవానికి, ప్రాచీన కళా సంపదకు వేదికగా భాసిల్లుతోంది. అరుదైన కట్టడాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. గోదావరి గలగలలు, మానేర్ సవ్వడులకు తోడు చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. సంక్రాంతి సెలవుల్లో వీటిని చూసి ఎంజాయ్ చేయండి…
Karimnagar Tourism: ఈనెల 11న పాఠశాలలకు సంక్రాంతి సెలవులు మొదలు కానున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో చూడదగ్గ పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించి పర్యాటక వినోదం ఆస్వాదించి విజ్ఞానాన్ని పెంపొందించుకోండి.
ఎలగందుల ఖిల్లా..
కరీంనగర్ కు పడమర వైపు సిరిసిల్ల మార్గంలో దాదాపు 10 కి.మీ. దూరంలో ఉన్న ప్రాచీన గ్రామం ఎలగందుల. ఇక్కడి ఖిల్లా కాకతీయుల కళాసంపదకు, ఆరుదైన కట్టడానికి చిహ్నం. చుట్టూ ఏర్పాటు చేసిన మ్యూజికల్ లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
లోయర్ మానేర్ డ్యామ్ కరీంనగర్ నగరానికి మకుటంగా వెలుగొందుతోంది. జలాశయంలో ఏర్పాటు చేసిన పడవలో విహరించవచ్చు. పక్కన ఉజ్వల పార్కు, జింకల పార్కులు సందర్శకులకు ఆహ్లాదం పంచుతున్నాయి. తీగల వంతెన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ప్రకృతి రమణీయత....
గంభీరావుపేట మండలం భీమునిమల్లారెడ్డిపేటలో చుట్టూ గుట్టలు, పచ్చని చెట్ల మధ్య ఆంజనేయస్వామి పూజలందుకుంటున్నాడు. గుట్టల పై నుంచి పడే జలపాతాలు అదనపు ఆకర్షణ. ఇక్కడి కోనేరు ఎప్పుడూ ఎండిపోదు. సిరిసిల్ల నుంచి 25 కి. మీ. దూరంలో ఉంటుంది. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి, కోరుట్లపేట మీదుగా చేరుకోవచ్చు.
వరదవెల్లిలో దత్తాత్రేయ ద్వీపం..
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వరదవెల్లిలో విశాలమైన గుట్టపై స్వయంభూరాహుశన దత్తాత్రేయుడు వెలిశాడు. మధ్యమానేరు జలాశయంలోని ఈ ఆలయం ద్వీపంగా కనిపిస్తోంది. ఇటీవలే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సందర్శించి ఆలయం వద్దకు బోటు సౌకర్యం కల్పించారు. కరీంనగర్ నుంచి 25 కి. మీ. దూరంలో కొదురుపాక వంతెన పక్కన నుంచి వెళ్లాలి.
బొమ్మలమ్మ గుట్టలో శిలలపై పద్యాలు..
గంగాధర మండలం కురిక్యాలలోని బొమ్మలమ్మగుట్ట వెయ్యేళ్ల కిందటే తొలి తెలుగు కంద పద్యానికి వేదికగా నిలిచింది. నన్నయ్యకు పదేళ్ల ముందే ఇక్కడ మహాకవి పంపన నాలుగు తెలుగు పద్యాలు రాసినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. రాతి శిలలపై తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లోని పద్యాలు ఆకట్టు కుంటున్నాయి. పంప మహాకవి సోదరుడు. జైన పండితుడైన జినవల్లభుడు ఈ గుట్టపై శిలాశాసనం వేయించాడు. కరీంనగర్ కు 18 కి.మీ.ల దూరంలో ఉంటుంది.
మొలంగూర్ దూద్ బావి..
శంకరపట్నం మండలం మొలంగూర్ లో కాకతీయ ప్రతాపరుద్రుడి కాలంలో ఖిల్లా నిర్మితమైంది. కొండ కింద ఉన్న దూద్ బావి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. బావి నీరు సర్వరోగ నివారిణిగా విశ్వసిస్తారు. కరీంనగర్ నుంచి హుజురాబాద్ రూట్ లో ఖిల్లా ఉంటుంది.
ఔషధ మూలికల రామగిరి ఖిల్లా...
ప్రకృతి రమణీయతకు, అరుదైన కట్టడాలకు, శత్రుదుర్భేద్యమైన నిర్మాణ కౌశలానికి ప్రతీక రామగిరి ఖిల్లా. ఇక్కడి శిల్ప కళ ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు ఆహ్లాదం పంచుతోంది. ఆధ్యాత్మిక క్షేత్రం, ఔషధ ఖిల్లాగా పేరొందింది. పెద్దపల్లి-మంథని మార్గంలో బేగంపేట క్రాస్ నుంచి 5 కి.మీ. దూరంలో ఉంటుంది.
మొసళ్ల కేంద్రం ఎల్ మడుగు
వన్యప్రాణుల సంరక్షణ(మొసళ్ల పెంపక) మంథని మండలం ఖానాపూర్ సమీపంలో గోదావరి తీరంలో ఎల్ మడుగు కేంద్రం ఉంది. ఇక్కడ నది 40 అడుగుల లోతుండగా ఏ కాలంలోనూ ఎండిపోదు. మంచిర్యాల జిల్లా శివ్వారం తీరం నుంచి బోటులో విహరించవచ్చు. వాచ్ టవర్ ఎక్కి ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. మంథనికి 7 కి.మీ. దూరంలో ఉంటుంది.
దేవుడు లేని మందిరం
పెద్దపల్లి మండలం ధర్మాబాద్ వద్ద సుమారు 300 ఏళ్ల క్రితం నిర్మించిన ఆండాళమ్మ ఆలయం దేవుడు లేని మందిరంగా ప్రత్యేకత సంతరించుకుంది. ఆలయ గోడలపై శిల్ప కళా సంపద ఆకట్టుకుంటుంది. త్రికూట పద్ధతిలో గోపురాలు, కల్యాణ వైభవాన్ని దాటే శిల్పాలతో గోడలను తీర్చిదిద్దారు. పెద్దపల్లి పట్టణానికి 7 కి.మీ. దూరంలో మంథని మార్గంలో ఉంటుంది.
శాతవాహనుల కోటిలింగాల
వెల్గటూర్ మండలం కోటిలింగాల క్షేత్రం గోదావరి తీరంలో శాతవాహనుల కాలంలో నిర్మితమైంది. ఆలయంలో శివుడిని కోటేశ్వరస్వామిగా పిలుస్తారు. శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టు నిలువ నీటితో ఇక్కడ గోదావరి నిండు కుండను తలపిస్తోంది. సైకత లింగం ప్రత్యేక ఆకర్షణ. బోటులో షికారు చేయొచ్చు. కరీంనగర్ నుంచి రాయపట్నం మార్గంలో 55 కి.మీ.ల దూరం వెళ్తే అక్కడికి చేరుకోవచ్చు.
నాంపల్లి గుట్ట....
వేములవాడ సమీపంలో నాంపల్లి గుట్టపై లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉంటుంది. గుట్టపైకి ఘాట్ రోడ్డు లో పడగవిప్పిన నాగుపాము విగ్రహం స్వాగతం పలుకుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.మంచి టూరిస్ట్ స్పాట్ గా మారింది. ఇక కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం, ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటాయి. ఆలయాలను సందర్శించి పర్యాటక వినోదంతో పాటు భక్తి భావాన్ని సైతం చాటుకోవచ్చు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)