TG Indiramma Housing Scheme : ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి ప్ర‌త్యేక అధికారి..! ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ తాజా అప్డేట్స్ ఇవే-there will be a special officer for each constituency for the indiramma housing scheme ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Indiramma Housing Scheme : ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి ప్ర‌త్యేక అధికారి..! ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ తాజా అప్డేట్స్ ఇవే

TG Indiramma Housing Scheme : ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి ప్ర‌త్యేక అధికారి..! ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ తాజా అప్డేట్స్ ఇవే

TG Indiramma Housing Scheme Updates: ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఇకపై ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారి ఉండనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రత్యేక అధికారి స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ఉంటార‌ని వెల్లడించారు.

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అప్డేట్స్

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి విడతలో ఖరారైన వారిలో పలువురు ఇంటి నిర్మాణాలు కూడా చేపట్టారు. ఇక రెండో విడత లబ్ధిదారుల గుర్తింపుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ నెలాఖారులోపు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది.

నియోజకవర్గానికి స్పెషల్ ఆఫీసర్..!

ఇదిలా ఉంటే ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. గ్రామ స్థాయిలో ఇందిర‌మ్మ ఇండ్ల క‌మిటీలు ఆమోదం పొందిన జాబితాను మండ‌ల స్థాయి క‌మిటీలు ప‌రిశీలించాల‌ని సూచించారు. ఆ క‌మిటీల ప‌రిశీల‌న అనంత‌రం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రికి పంపాల‌ని.. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆమోదించాకే ఇండ్ల జాబితా ఖ‌రార‌వుతుంద‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు.

ఈ వ్య‌వ‌హారం స‌క్ర‌మ ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి ప్ర‌త్యేక అధికారిని నియ‌మించాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ ప్ర‌త్యేకాధికారి ఇందిర‌మ్మ క‌మిటీలు, మండ‌ల క‌మిటీలు, క‌లెక్ట‌ర్లు, ఇన్‌ఛార్జి మంత్రి మ‌ధ్య స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ఉంటార‌ని వెల్లడించారు.

పకడ్బందీగా అమలు…

ఇక రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సీఎం సూచించారు. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రత్యేక కార్యాచరణతో కూడిన ప్రణాళికను అమలు చేయాలని... మే 1 నాటికి గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అర్హుల జాబితాలను ప్రదర్శించాలని నిర్ణయించారు.

చర్యలకు సిద్ధమైన సర్కార్…

ఒకవేళ అనర్హులకు ఇండ్లు కేటాయించబడినట్లు తేలితే అలాంటి వారి ప్రోసిడింగ్స్ రద్దు చేయాలని కూడా ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది. ఆ స్థానంలో అర్హులైన వారికి గృహం మంజూరు చేయనుంది. ఈ స్కీమ్ పేరుతో దందాలకు పాల్పడే వారిపై తక్షణమే కేసులు నమోదు చేయనుంది. అనర్హులు ఇండ్లు నిర్మించుకున్నట్లు తేలితే చట్టపరమైన చర్యలతో పాటు, వారు పొందిన నిధులను వసూలు చేసేందుకు కూడా సర్కార్ సిద్ధమైంది.

స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించాలని సర్కార్ భావిస్తోంది.  స్థానిక సంస్థల ఎన్నికలలోపే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించి… ప్రోసిడింగ్స్ ఇవ్వాలని సర్కార్ చూస్తోంది. అంతేకాదు కనీసం పునాది, పిల్లర్ల వరకు నిర్మాణాలు పూర్తిచేసి సంబంధిత సొమ్ము లబ్ధిదారుడికి అందజేయాలని చూస్తోంది.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.