Karimnagar Crime: కరీంనగర్‌లో వరుస చోరీలు ప్రజల్ని హడలెత్తించాయి. బంగారు దుకాణంలో చోరీకి పాల్పడిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళను నుంచి పోలీసులు 100 గ్రాముల బంగారు ఆభరణాలు, 28వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. 24 గంటల వ్యవధిలో 14 చోట్ల చోరీలు జరిగాయి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం లింగాపూర్ లో తాళం వేసిన 8 ఇళ్ళలో, మానకొండూర్ మండలం అన్నారంలో నాలుగు ఇళ్ళలో తిమ్మాపూర్ మండలం కేంద్రంలోని మిర్చి యార్డులో చోరీ లు జరిగాయి. నగలు నగదు దొంగలు ఎత్తుకెళ్లారు. తిమ్మాపూర్ లో చోరీ విజువల్స్ సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇద్దరు దొంగలు చొరబడి 80 వేల నగదు ఎత్తుకెళ్ళడంతో సీసీ పుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.
పెద్దపల్లిలోని పైడబజార్‌లో బంగారు షాప్ లో మహిళ చోరీకి పాల్పడింది. 24 గంటల వ్యవధిలో సిసి పుటెజ్ ఆధారంగా మహిళా దొంగను పోలీసులు పట్టుకున్నారు. పెద్దపల్లి డీసీపీ పి.కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం 24న రాత్రి పైడబజార్‌లోని దేవరకొండ కరుణాకర్ కు చెందిన బంగారం షాప్ లో గుర్తుతెలియని దుండగులు చొరబడి రూ.2.5 లక్షల విలువైన 100 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.40 వేల నగదును దొంగిలించారని, దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు పెద్దపల్లి ఎసీపీ గజ్జి కృష్ణ యాదవ్ నేతృత్వంలో సీసీ ఫుటేజ్ సాంకేతిక పరిజ్ఞానంతో విచారణ చేపట్టగా నిందితురాలు లోకిని తిరుమల (38) ను గుర్తించి పట్టుకున్నామని తెలిపారు. ఆమె నుంచి 100 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.28 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు.
పెద్దపల్లి పోలీసులకు చిక్కిన మహిళ ఆర్థిక ఇబ్బందులతో చోరీ కి పాల్పడినట్లు ఒప్పుకుందని డీసీపీ కరుణాకర్ తెలిపారు. చోరీలు నేరాలను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సిసి కెమెరాలుతో చోరీలను అరికట్టడంతోపాటు నిందితులను త్వరగా గుర్తించే అవకాశం ఉంటుందని ప్రతి గ్రామంలో వీదిలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీస్ అధికారులు కోరుతున్నారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం