Medak Crime : వదినతో అక్రమ సంబంధం...! అన్నకు కరెంట్ షాక్ ఇచ్చి చంపిన తమ్ముడు
మెదక్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. కరెంట్ షాక్ పెట్టి సొంత అన్ననే తమ్ముడు చంపేశాడు. వదినతో అక్రమ సంబంధమే ఇందుకు కారణమని పోలీసుల విచారణలో తేలిపింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా… రిమాండ్ కు తరలించారు.
తోడబుట్టిన అన్నను కరెంటు షాక్ పెట్టి కడతేర్చిన సంచలన సంఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని నాను తండాలో శనివారం తెల్లవారుజామున జరిగింది. అన్న తేజావత్ శంకర్ (28)ని చంపి పారిపోయిన గోపాల్ ని గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి.

కరెంట్ వైర్ చుట్టి.......
శుక్రవారం రాత్రి అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒకే రూంలో పడుకున్నారు. అయితే, అంతకు ముందే శంకర్ ని చంపాలని గోపాల్ నిర్ణయించుకున్నాడు. తెల్లవారుజామున అందరికంటే ముందే నిద్ర లేసి అన్న కాలుకు, చేయికి కరెంట్ వైర్ చుట్టి దాన్ని దగ్గర్లోని ప్లగ్ లో పెట్టాడు. ఒక్కసారి కరెంట్ షాక్ కొట్టడంతో, నిద్రలోనే గట్టిగా అరిచాడు శంకర్. తన అరుపులు విని పక్క రూమ్ లో పడుకున్న వారి తండ్రి చందర్ రూంలోకి పరిగెత్తుకొచ్చి చూడగా…. గోపాల్ రూమ్ లో నుంచి పారిపోతూ కనపడ్డాడు.
రూమ్ లోపలికి వెళ్లి చూసిన తండ్రికి…. శంకర్ నిర్జీవిగా కనపడటంతో ఒక్కసారిగా గొల్లుమన్నాడు. చందర్ ఏడ్పులు విని, చుట్టుపక్కల వారంతా పరిగెత్తుకొంటూ వచ్చారు. విషయం తెలుసుకొని వారు వెంటనే శివ్వంపేట పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు, తండ్రిని, గ్రామస్తులను విచారించారు.
గంటల వ్యవధిలోనే అరెస్ట్…
గోపాల్ ని పట్టుకోవడానికి ప్రత్యేఖ టీమ్ లను ఏర్పాటు చేశారు. నాలుగు గంటల వ్యధిలోనే అతను పోలీసులకు చిక్కాడు. హత్యకు గల కారణాలను పోలీసులు వెల్లడించారు. సోదరుడి భార్యతో గోపాల్ కు అక్రమ సంబంధం ఉండటమే దీనికి కారణమని చెప్పారు. ఇదే విషయాన్ని గతంలో గోపాల్ గుర్తించి… వారిద్దరని పలుమార్లు హెచ్చరించాడని వివరించారు. “పలుమార్లు కుటుంబంలో గొడవలు కూడా జరిగాయి. శంకర్ భార్య ఇటీవలనే తన తల్లితండ్రుల వద్దకి కూడా వెళ్లింది. అయితే ఎలాగైనా అన్నను అడ్డుతొలగించుకుంటే… తమ సంబంధానికి ఎలాంటి అడ్డు ఉండదని గోపాల్ భావించాడు. ఈ కోణంలోనే సోదరుడిని కరెంట్ షాక్ ఇచ్చి చంపాలని నిర్ణయం తీసుకున్నాడు” అని పోలీసులు చెప్పారు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా… జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించారు.
గంజాయికి అలవాటు పడ్డ గోపాల్… ఇంతకు ముందు గంజాయి తరలిస్తూ పట్టుపడ్డాడని పోలీసులు తెలిపారు. ఆ కేసులో జైలుకి వెళ్లిన గోపాల్… రెండు నెలల కిందనే జైలు వెళ్లి తిరిగివచ్చినట్టు ఇన్స్పెక్టర్ రంగాకృష్ణ వెల్లడించారు.
రిపోర్టింగ్ - మెదక్ జిల్లా ప్రతినిధి, HT తెలుగు.
సంబంధిత కథనం