Dindi Lift Irrigation Project : ముందుకు కదలని 'డిండి' ఎత్తిపోతల పనులు - ఇంకెన్నాళ్లంటున్న రైతాంగం-the works of dindi lift irrigation project is pending ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Dindi Lift Irrigation Project : ముందుకు కదలని 'డిండి' ఎత్తిపోతల పనులు - ఇంకెన్నాళ్లంటున్న రైతాంగం

Dindi Lift Irrigation Project : ముందుకు కదలని 'డిండి' ఎత్తిపోతల పనులు - ఇంకెన్నాళ్లంటున్న రైతాంగం

HT Telugu Desk HT Telugu
Aug 07, 2024 04:49 PM IST

Dindi Lift Irrigation Project : డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు ముందుకు కదలటం లేదు .ఇప్పటికీ డీపీఆర్ సిద్ధం కాలేని పరిస్థితి ఉంది. మరోవైపు ఎత్తిపోతల నీటి కోసం మూడు జిల్లాల రైతులు ఆశలు పెట్టుకున్నారు. త్వరితగతిన ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే తమ ప్రాంతమంతూ సస్యశ్యామలంగా మారుతుందని భావిస్తున్నారు.

డిండి ప్రాజెక్ట్
డిండి ప్రాజెక్ట్

Dindi Lift Irrigation Project : మూడు జిల్లాలు.., ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు.. 21 మండలాలు.. 3.61లక్షల ఎకరాల ఆయకట్టు.. వందలాది గ్రామాలకు తాగునీరు అందివ్వాల్సిన డిండి ఎత్తిపోతల పథకం రైతుల సహనానికి పరీక్ష పెడుతోంది. రూ.6190 కోట్ల అంచనా వ్యయంతో 2015 లోనే ప్రభుత్వ అనుమతులు ఇచ్చిన డిండి ఎత్తిపోతల పథకానికి ఇప్పటికీ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) సిద్ధం కాలేదంటే ఈ ప్రాజెక్టు నిర్మాణంపై పాలకుల చిత్తశుద్ధి తెలిసిపోతుంది.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి, ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని దేవరకొండ, మునుగోడు, నాగార్జున సాగర్, నల్గొండ, నకిరేకల్ .. ఏడు నియోజకవర్గాల పరిధిలో 3.61 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సిన ప్రాజెక్టు విషయంలో తాత్సారం జరుగతోంది. 2015 జూన్ 11వ తేదీన ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం జీవో 107ను విడుదల చేసింది.

ఒక్క నల్గొండ జిల్లా పరిధిలోనే ఈ పారజెక్టు 3.41 లక్షల ఎకరాలకు సాగునీరు దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని వందలాది గ్రామాల్లోని ఫ్లోరైడ్పీ డితులకు తాగునీటిని అందించాల్సి ఉంది. ఉత్తర్వులు వెలువడి తొమ్మిదేళ్లు కావొస్తున్నా ఈ ప్రాజెక్టుకు నీటిని ఎక్కడి నుంచి ఇస్తారో ఇంకా తేల్చకుండానే రిజర్వాయర్లు మాత్రం నిర్మిస్తున్నారు. వీటి కింద డిస్టిబ్యూటరీలు, ఫీల్డ్ చానల్స్ నిర్మాణానికి భూసేకరణ కూడా జరపలేదు.

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న డిండి ఎత్తిపోతల విషయాన్న గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. మహబూబ్ నగర్ – నల్గొండ జిల్లాల మధ్య సాగునీటి పంపకాల వివాదం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 2015 జూన్ 10వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అమరుసటి రోజే డిండి ఎత్తిపోతల పథకానికి ప్రత్యేక జీవో (జీఓ నెంబర్ 107) విడుదల చేసింది. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలను రూ.35,200 కోట్ల అంచనా వ్యయంతో, 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరి ఇచ్చేలా రూపొందించారు.

ఈ ప్రాజెక్టు పనులను శరవేగంగా మొదలు పెట్టి పూర్తి దశకు తీసుకువచ్చిన ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకం విషయంలో మహబూబ్ నగర్ జిల్లా నాయకుల ఒత్తిడితో పక్కన పడేసిందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. వాస్తవానికి డిండి ఎత్తిపోతలకు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఇస్తానన్నది కేవలం 0.5 టీఎంసీ ( అర టీఎంసీ ) మాత్రమే. శ్రీశైలం బ్యాక్ వాటర్ లో నార్లాపూర్ జర్వాయర్ నుంచి 60 వరద రోజుల్లో (ఫ్లడ్ డేస్ ) 30 టీఎంసీల నీరు తీసుకోవాల్సి ఉంది. నల్గొండ జిల్లాకు ఎస్.ఎల్.బి.సి టన్నెల్ ద్వారా తీసుకునే క్రష్ణా నీరు సరిపోతుందని, తమ ప్రాజెక్టు నుంచి అర టీఎంసీ ఎలా కేటాయిస్తారని మహబూబ్ నగర్ నాయకులు అడ్డుపడడంతో ప్రాజెక్టు నిర్మాణం ప్రమాదంలో పడింది.

ఈలోగా తెలంగాణ సాగునీటి రంగ నిపుణుడు ఆర్.విద్యాసాగర్రావు పేరును డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ప్రభుత్వం పెట్టింది. అసలు ఎక్కడి నుంచి ఎంత మేర నీరు తీసుకుంటారో తేల్చకుండా, డీపీఆర్ పూర్తి చేయకుండానే, డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా సింగరాజుపల్లి, గొట్టిముక్కుల, చింతపల్లి, కిష్టరాంపల్లి, శివన్నగూడెం(చర్లగూడెం) మొత్తం అయిదు చోట రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టింది.

ఇందులో కనీసం డెబ్బై శాతం పనులు పూర్తి కావొచ్చాయి. కానీ, వీటి కింద డిస్టిబ్యూటరీలు, ఫీల్డ్చా నల్స్ కోసం ఇంకా భూ సేకరణ కూడా చేపట్ట లేదు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాని 2024 బడ్జెట్ లో రూ.300 కోట్లు కేటాయించారు. అయితే, ఇందులో అంతర్భాగంగా ఉన్న డిండి ఎత్తిపోతల పథకానికి ఎంత మొత్తంలో కేటాయించన్న విషయం ప్రకటించలేదు. నాగర్ కర్నూల్ జిల్లాలోని ఉల్పర నుంచి చివరి రిజర్వాయరు మునుగోడు నియోజకవర్గంలోని శివన్నగూడెం వరకు 66 కిలో మీటర్ల నిడివిలో ప్రధాన కాల్వలు తవ్వాల్సి ఉంది. ఇందులోని కొన్ని చోట్ల చిన్న చిన్న సొరంగాలు కూడా అవసరం పడుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని ఏదుల నుంచి నీరు తీసుకుంటారా..? ఉల్పర నుంచి డ్రా చేస్తారా అన్న విషయంలో స్పష్టత లేదు.

ఈ ప్రభుత్వమైనా ప్రాజెక్టును పూర్తి చేయాలి : సుధాకర్ రెడ్డి, నల్గొండ సీపీఎం జిల్లా కార్యదర్శి

‘‘ ఆర్.విద్యాసాగర్ రావు డిండి ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇచ్చి తొమ్మిదేళ్లు కావొస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును దాదాపుగా నిర్లక్ష్యం చేసింది. నీటి అనుమతులు, డీపీఆర్ లేకుండా కేవలం జలాశయాలు నిర్మిస్తే రైతులకేం లాభం. శ్రీశైలం ఫోర్ షోర్ నుంచి ఎక్కడి నుంచి నీరు తీసుకుంటారు, పర్యావరణ అనుమతులు ఎప్పుడు తెస్తారు అన్నది ప్రభుత్వ తలనొప్పి. నల్గొండ జిల్లా ప్రజలకు కావాల్సింది మాత్రం సాగు, తాగునీరు. డిండి ఎత్తిపోతల పథకంలో ఇస్తానన్నదే అర టీఎంసీ. కనీసం ఒక టీఎంసీ కేటాయించడం న్యాయం. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వమైన ఈ విషయంలో వేగిర పడాలి. జిల్లా నుంచే సాగునీటి శాఖా మంత్రిగా ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలి.. సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నందున.. తమ జిల్లా నాయకులను సముదాయించి, వివాదానికి తెరదించి డిండి ఎత్తిపోతల పథాన్ని పూర్తి చేయాలి ’’ అని నల్గొండ సీపీఎం జిల్లా కార్యదర్శి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ

ప్రతినిధి )