Dharmasagar Water: ధర్మసాగర్ కు చేరిన దేవాదుల నీళ్లు.. పది రోజుల తరువాత ఎట్టకేలకు ట్రయల్ రన్ సక్సెస్-the waters devadula have reached dharmasagar ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Dharmasagar Water: ధర్మసాగర్ కు చేరిన దేవాదుల నీళ్లు.. పది రోజుల తరువాత ఎట్టకేలకు ట్రయల్ రన్ సక్సెస్

Dharmasagar Water: ధర్మసాగర్ కు చేరిన దేవాదుల నీళ్లు.. పది రోజుల తరువాత ఎట్టకేలకు ట్రయల్ రన్ సక్సెస్

HT Telugu Desk HT Telugu

Dharmasagar Water: జువ్వాడి చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం మూడో దశ పనుల్లో భాగంగా హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల శివారులో నిర్మించిన దేవన్నపేట పంప్ హౌజ్ మోటార్ ఎట్టకేలకు ఆన్ అయ్యింది. పది రోజుల తర్వాత దేవాదుల నీళ్లు ధర్మసాగర్‌ చేరాయి.

ధర్మసాగర్‌కు చేరిన దేవాదుల నీరు

Dharmasagar Water: జువ్వాడి చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం మూడో దశ పనుల్లో భాగంగా హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల శివారులో నిర్మించిన దేవన్నపేట పంప్ హౌజ్ మోటార్ ఎట్టకేలకు ఆన్ అయ్యింది. ఇక్కడ ఏర్పాటు చేసిన మూడు మోటార్లలో ఒక దానిని ఆన్ చేసి జనగామ జిల్లాలో ఎండుతున్న పంటలకు సాగు నీటిని అందించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేయగా.. సాంకేతిక లోపాల కారణంగా ఇబ్బందులు తలెత్తాయి.

దీంతో ప్రభుత్వం ఛాలెజింగ్ తీసుకుని పనులు చేయించగా.. ఎట్టకేలకు సమస్యలన్నీ తీరాయి. దీంతో గురువారం తెల్లవారుజామున ఇరిగేషన్ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ మేరకు దేవన్నపేట పంప్ హౌజ్ నుంచి గోదావరి నీళ్లు తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ధర్మసాగర్ రిజర్వాయర్ కు చేరుకున్నాయి. దాదాపు పది రోజులుగా అధికారులు, ఇతర ఇంజనీర్లు దేవాదుల పంప్ హౌజ్ వద్దనే మకాం వేసి పనులు చేయించగా.. ఎట్టకేలకు మోటార్ ఆన్ కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ఎట్టకేలకు మోటార్ ఆన్…

జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో సాగునీరు అందక పంటలు ఎండుతున్న దృష్ట్యా ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు మూడో దశలో భాగంగా దేవన్నపేట వద్ద నిర్మించిన పంప్ హౌజ్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గంగారం నుంచి భీమ్ ఘన్ పూర్ నుంచి రామప్పకు వచ్చిన గోదావరి నీటిని ధర్మసాగర్ రిజర్వాయర్ కు తరలించేందుకు దాదాపు 49.06 కిలోమీటర్ల మేర టన్నెల్ పనులు పూర్తి చేశారు.

దేవన్నపేట వద్ద ఇప్పటికే మూడు మోటార్లు ఏర్పాటు చేయగా.. అందులో ఒక లైన్ పనులు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో ఒక మోటార్ ను ఆన్ చేసి దాని ద్వారా నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఈ నెల 18న రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు దేవన్నపేట పంప్ హౌజ్ ను విజిట్ చేసి మోటార్ ను ఆన్ చేసే ప్రయత్నం చేశారు. కానీ సాంకేతిక సమస్యల కారణంగా మోటార్ ఆన్ కాకపోవడంతో మంత్రులు చేసేదేమీ లేక వెనుదిరగాల్సి వచ్చింది.

పది రోజుల తరువాత..

దేవన్నపేట పంప్ హౌజ్ లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న స్కాడా సిస్టమ్ లో సాంకేతిక లోపాల కారణంగా మోటార్ మొరాయించగా.. ఆస్ట్రియా నుంచి ఆండ్రిట్జ్ కంపెనీ ఇంజనీర్లు వచ్చి రిపేర్ చేసే పనులు చేపట్టారు. పంప్ హౌజ్ వద్దే మకాం వేసి మంగళవారం నాటికే ఆ సమస్యను పరిష్కరించారు.

ఆ తరువాత ట్రయల్ నిర్వహించే ప్రయత్నాలు మొదలు పెట్టగా, ఈసారి గేట్ వాల్వ్ లు లాక్ అయి సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో మరో ఇద్దరు టెక్నిషియన్లను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి రెండు రోజులుగా శ్రమించి, ఆ పనులు పూర్తి చేశారు. దీంతో పది రోజుల పాటు అధికారులు, ఇంజనీర్లు శ్రమించగా.. ఎట్టకేలకు సమస్యలన్నీ సాల్వ్అయ్యాయి.

రాత్రంతా శ్రమించి మోటార్లు ఆన్

సమస్యలన్నీ సాల్వ్ అయిన అనంతరం ట్రయల్ రన్ నిర్వహించేందుకు బుధవారం సాయంత్రం అధికారులు ప్రయత్నం చేశారు. కానీ ఈసారి ఎలక్ట్రికల్ సిస్టంలో సమస్యల కారణంగా మోటార్ మొరాయించింది. దీంతో ఆండ్రిట్జ్ కంపెనీ ఇంజనీర్లు, జిల్లా ఇరిగేషన్ అధికారులు రాత్రంతా శ్రమించి, ఆ సమస్యను పరిష్కరించారు.

గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మోటార్ ఆన్ చేయగా.. 3.27 గంటల వరకు గోదావరి నీళ్లు దేవాదుల పంప్ హౌజ్ నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్ కు చేరుకున్నాయి. దీంతో సాగునీటి కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఇబ్బందులు తీరిపోనుండగా, పది రోజుల శ్రమ ఫలించినందుకు ఇంజనీర్లు, ఇరిగేషన్ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నేడు మంత్రుల చేతుల మీదుగా ఓపెనింగ్

ట్రయల్ రన్ సక్సెస్ ఫుల్ గా పూర్తి కావడంతో దేవాదుల పంప్ హౌజ్ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఓపెనింగ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు మంత్రులు ఇద్దరూ దేవన్నపేట పంప్ హౌజ్ ను విజిట్ చేసి, అనంతరం ధర్మసాగర్ రిజర్వాయర్ ను సందర్శించారు. అనంతరం సాగునీటిని విడుదల చేయనుండగా, జనగామ జిల్లాలోని 60 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

HT Telugu Desk

సంబంధిత కథనం