Krishna River Updates : మరింత పెరిగిన నీటిమట్టం - నాగార్జునసాగర్ గేట్లు ఎత్తేది ఎప్పుడు..? తాజా అప్డేట్స్ ఇవే-the water level in nagarjusagar project has crossed 558 6 feet ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Krishna River Updates : మరింత పెరిగిన నీటిమట్టం - నాగార్జునసాగర్ గేట్లు ఎత్తేది ఎప్పుడు..? తాజా అప్డేట్స్ ఇవే

Krishna River Updates : మరింత పెరిగిన నీటిమట్టం - నాగార్జునసాగర్ గేట్లు ఎత్తేది ఎప్పుడు..? తాజా అప్డేట్స్ ఇవే

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 03, 2024 10:23 AM IST

Nagarjuna Sagar project Updates : కృష్ణమ్మ పరుగులుతో సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. శనివారం ఉదయం నాటికి నీటిమట్టం 558.6 అడుగులకు చేరింది.

సాగర్ ప్రాజెక్ట్ (ఫైల్ ఫొటో)
సాగర్ ప్రాజెక్ట్ (ఫైల్ ఫొటో) (Image Source Twitter)

Nagarjuna Sagar project Updates : ఎగువన కురుస్తున్న వర్షాలు, వరదలతో కృష్ణమ్మ పొంగిపోర్లుతుంది. పైనుంచి వస్తున్న వరదలతో కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి భారీగా నీటిని దిగువుకు విడుదల చేస్తుండగా… నాగార్జున సాగర్ కు వరద నీరు వచ్చి చేరుతోంది.

శనివారం ఉదయం 8.21 గంటల రిపోర్ట్ ప్రకారం…. నీటిమట్టం 558.6 అడుగులకు చేరింది. సాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 229.14 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

ఇక ఇన్ ఫ్లో 3,91,355 క్యూసెకులుగా నమోదు కాగా… 31,510 క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరో 30 అడుగుల మేర నీటిమట్టం చేరుకుంటే… గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. భారీగా ఇన్ ఫ్లో ఉండటంతో మరో రేపు లేదా ఎల్లుండి గేట్లను ఎత్తే అవకాశం ఉంది. దీనిపై ప్రాజెక్ట్ అధికారులు ప్రకటన చేయాల్సి ఉంది.

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద…

మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. శనివారం ఉదయం 7:36 గంటల రిపోర్ట్ ప్రకారం….. ఇన్ ఫ్లో 4,44,474 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 5,53,134 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 883 అడుగులకు చేరింది. పూర్తి నీటి సామర్థ్యం 215.81గా ఉండగా….ప్రస్తుతం 204.79 గా ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

మరోవైపు శ్రీశైలం వచ్చే టూరిస్టుల సంఖ్య పెరిగింది. ఘాట్ రోడ్డులో వాహనాల రద్దీ పెరిగింది. ఓ దశలో కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. నెమ్మదిగా వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి ఉంది.

ఇక శ్రీశైలంలో స్నానానికి దిగి.. వరద నీటిలో వ్యక్తి గల్లంతయ్యాడు. శ్రీశైలం ప్రాజెక్టు దిగువ భాగాన ఉన్న లింగాలగట్టు పెద్ద బ్రిడ్జ్ కింద అందరు చూస్తుండగానే వరదనీటిలో కొట్టుకుపోయాడు. వరద ఉదృతి ఎక్కువగా ఉండటంతో ఈ ఘటన జరిగింది. సదరు వ్యక్తి నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన యాదయ్యగా పోలీసులు గుర్తించారు.

ఇక పులిచింతల ప్రాజెక్టు వద్ద పరిస్థితి చూస్తే…. ప్రస్తుతం 113.51 అడుగుల నీటిమట్టం ఉంది. 2.47 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇన్ ఫ్లో 15,571 క్యూసెకులుగా ఉండగా… ఔట్ ఫ్లో 50 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండిన తర్వాత… గేట్లు ఎత్తితే పులిచింతలకు భారీగా వరద నీరు వచ్చి చేరనుంది. ఆ తర్వాత పులిచింతల గేట్లు కూడా ఎత్తుతారు.

NOTE : ఎగువ నుంచి వస్తున్న వరదతో ఆయా ప్రాజెక్టుల్లో నీటి నిల్వల గణాంకాలు మారుతుంటాయి. ఆ వివరాలను https://apwrims.ap.gov.in/mis/reservoir/ లింక్ పై క్లిక్ చేసి ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను తెలుసుకోవచ్చు

Whats_app_banner