YSRTP In Congress: కాంగ్రెస్ విలీనానికి ముహుర్తం ఫిక్స్..రేపు ప్రకటించే ఛాన్స్?
YSRTP In Congress: వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి ముహుర్తం ఖరారైనట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో షర్మిల భేటీ జరగడంతో షర్మిల చేరిక లాంఛనంగా కానుంది. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా షర్మిల నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
YSRTP In Congress: వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముహుర్తం ఖరారైనట్టు కనిపిస్తోంది. వైఎస్ వర్థంతి సందర్భంగా షర్మిల కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో షర్మిల భేటీ కావడంతో ఎపిసోడ్ ముగింపు దశకు వచ్చినట్టేనని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో షర్మిల సేవల్ని వినియోగించుకోవడంపై కాంగ్రెస్ పార్టీ సైతం స్పష్టమైన అవగాహనతో ఉన్నట్టు తెలుస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంఛనం కానుంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి వీలైనంత త్వరగా ముగింపు ఇచ్చేందుకు అటు కాంగ్రెస్‌తో పాటు ఇటు షర్మిల కూడా రెడీ అవుతున్నారు. “సోనియాను ధిక్కరించి జగన్ వదిలిన బాణంగా రాజకీయాల్లో ప్రవేశించిన షర్మిల.. ఇప్పుడు తప్పిపోయిన గొర్రె పిల్లలా మళ్లీ సొంత గూటికి చేరబోతోందని” ఏపీకి చెందిన ఓ ముఖ్య కాంగ్రెస్ నాయకుడు వ్యాఖ్యనించారు.
వైఎస్సార్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రను ఆపేయాలని కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది. పార్టీని ధిక్కరించేలా జగన్ ఓదార్పు చేస్తున్నారని, తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందుకోవడం కోసమే ఓదార్పు మొదలు పెట్టారని ప్రత్యర్థులు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో జగన్ రెండు, మూడు జిల్లాల్లో యాత్రలు పూర్తి చేసిన తర్వాత వైఎస్ కుటుంబాన్ని సోనియా ఢిల్లీ పిలిపించారు. ఈ భేటీలో యాత్రను ఎట్టి పరిస్థితుల్లో ఆపేయాలని, వైఎస్ మరణంతో చనిపోయిన కుటుంబాలను ఒకే చోటకు చేర్చి ఆదుకోవాలని సూచించడాన్ని జగన్, షర్మిల వ్యతిరేకించినట్టు చెబుతారు.
2010లో జరిగిన భేటీ తర్వాత దాదాపు 13ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి షర్మిల దూరంగానే ఉన్నారు. మరోవైపు జగన్ సొంత పార్టీ పెట్టుకుని ఏపీలో అధికారంలోకి కూడా వచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చిన షర్మిలకు రాజకీయ భవితవ్యం లేకపోవడంతో సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఆమె తెలంగాణలో రాజకీయ భవిష్యత్తు వెదుక్కోడానికి అక్కడ వైఎస్సార్‌టీపీని ఏర్పాటు చేసుకుని పనిచేస్తున్నారు. సొంత పార్టీతో షర్మిల ప్రభావం ఎంత ఉంటుందనేది ఇప్పటికీ ప్రశ్నగానే ఉంది.
మరోవైపు షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి తీసుకువచ్చేందుకు వైఎస్ మిత్రులు తెరవెనుక ప్రయత్నాలు చాలా కాలంగా చేస్తున్నారు. సొంత పార్టీలో కొనసాగడం కంటే కాంగ్రెస్‌తో కలిసి సాగడమే మేలని ఆమెను ఒప్పించినట్టు చెబుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు డికె.శివకుమార్ మంత్రాంగం కూడా ఉందని ప్రచారం ఉంది. గురువారం సోనియా గాంధీతో షర్మిల భేటీ తర్వాత ఈ ఎపిసోడ్‌కు క్లైమాక్స్‌కు చేరినట్టైంది.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో దాదాపు 40 నిమిషాలకు పైగా చర్చలు జరిపిన షర్మిల వైఎస్ఆర్టీపీ విలీనం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రాజకీయ పరిస్థితులపై ప్రధానంగా చర్చించినట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరికకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వైఎస్ వర్ధంతి సందర్భంగా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
షర్మిల రాజకీయ భవిష్యత్తు మీద కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. కర్ణాటక నుంచి షర్మిలను రాజ్యసభకు పంపే అవకాశాలున్నట్టు చెబుతున్నారు. పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె సేవల్ని వినియోగించుకునే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు చెబుతున్నారు. షర్మిల ఏపీ రాజకీయాలపై ఆసక్తి చూపకపోయినా కాంగ్రెస్ పార్టీ ఆఫర్‌కు అనుగుణంగా అడుగులు వేసే అవకాశాలున్నాయి.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల పాలేరు నుంచి పోటీ చేస్తారని ప్రచారం ఉంది. సికింద్రాబాద్ నుంచి కూేడా ఆమె పేరు వినిపిస్తోంది. వైఎస్సార్‌టీపీని విలీనం చేస్తే ఆమెను స్టార్ కాంపెయినర్‌గా వాడుకోవచ్చని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ముందస్తు ఎన్నికల ప్రచారంతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం కావొచ్చనే ప్రచారం నేపథ్యంలో షర్మిల ఎలాంటి ప్రభావం చూపిస్తారనేది కీలకం కానుంది. పార్టీలో సముచిత స్థానం కల్పించి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాధ్యత వహించాలని కోరితే షర్మిల దానికి విభేదించకపోవచ్చంటున్నారు. మరోవైపు షర్మిల రాకను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు.