NTR Statue in Khammam: ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణపై హైకోర్టు ఆంక్షలు.. అనుమతులు రద్దు-the telangana high court has imposed restrictions on the unveiling of ntrs idol in khammam district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  The Telangana High Court Has Imposed Restrictions On The Unveiling Of Ntr's Idol In Khammam District

NTR Statue in Khammam: ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణపై హైకోర్టు ఆంక్షలు.. అనుమతులు రద్దు

HT Telugu Desk HT Telugu
May 26, 2023 07:05 AM IST

NTR Statue in Khammam: ఖమ్మంలో శ్రీకృష్ణుడి అవతారంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు విధించింది. విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వం మంజూరు చేసిన అనుమతులు నిలిపివేసింది.

ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు నిలిపివేయాలని హైకోర్టు ఉత్తర్వులు
ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు నిలిపివేయాలని హైకోర్టు ఉత్తర్వులు

NTR Statue in Khammam: వివాదాస్పదంగా మారిన ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై అభ్యంతరం చెబుతూ పలు సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఖమ్మం పట్టణంలోని లకారం చెరువు మధ్యలో తానా సహకారంతో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను గురువారం హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

ఖమ్మంలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతివ్వడాన్ని సవాల్‌ చేస్తూ భారత యాదవ సమితితో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.సత్యంరెడ్డి, న్యాయవాది చెలికాని వెంకటయాదవ్‌లు వాదనలు వినిపించారు.

''ఎన్టీఆర్‌ను సినిమా నటుడిగా తాము అభిమానిస్తున్నామని, ఆయన విగ్రహం ఏర్పాటుపై ఎలాంటి అభ్యంతరం లేదని కృష్ణుడి రూపంలో ఏర్పాటు చేస్తేనే యాదవుల మనోభావాలను దెబ్బ తీసినట్లు అవుతుందని పేర్కొన్నారు. చెరువు మధ్యలో విగ్రహం ఏర్పాటు చేయడంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు, రాష్ట్ర ప్రభుత్వం 2016 డిసెంబరులో ఇచ్చిన జీవోకు, వాల్టా చట్టానికి విరుద్ధం'' అని వివరించారు.

ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు వాదనలు వినిపించారు. చెరువు మధ్యలో విగ్రహం ఏర్పాటుకు 2022 జూన్‌ 20న ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఇదేమీ ప్రజోపయోగమైన రోడ్డు వంటి ప్రాంతం కాదన్నారు.శ్రీకృష్ణుడి రూపంలో విగ్రహ ఏర్పాటుపై వ్యతిరేకత రావటంతో మార్పులు చేసినట్టు అదనపు అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు చెప్పారు. విగ్రహం నుంచి నెమలి పించం, పిల్లన గ్రోవిని తొలగించినట్టు వివరించారు. 'తానా' ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని పెడుతున్నట్టు చెప్పారు. ఆ సమయంలో జోక్యం చేసుకున్న కోర్టు ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న విగ్రహం ఫోటోలు ఉన్నాయా? అని ప్రశ్నించింది. ఉన్నాయని చెప్పిన అదనపు అడ్వకేట్ జనరల్ ఫోటోలను కోర్టుకు సమర్పించారు.

తానా తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ... ఎన్టీఆర్‌ పలు సినిమాల్లో కృష్ణుడి పాత్ర పోషించి ప్రజల మనసుల్లో ఆ రూపంలోనే నిలిచిపోయారన్నారు. అది కృష్ణుడి విగ్రహం కాదని, ఎన్టీఆర్‌ విగ్రహమేనన్నారు.

ఆ సమయంలో జోక్యం చేసుకున్న రాంచందర్ రావు శ్రీ కృష్ణుని రూపంలో సినిమాల్లో నటించినపుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకని ప్రశ్నించారు. శ్రీ కృష్ణుడు ఒక కులానికి దేవుడు కాదని, ప్రపంచం మొత్తానికి ఆరాధ్య దైవమన్నారు. దేవునికి కులాన్ని ఆపాదించటం సమంజసం కాదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యవద్దని ఉత్తర్వులు ఇచ్చింది.

పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం పబ్లిక్ ప్లేసులో విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదన్నారు. లేక్ వద్ద అనుమతి ఇస్తే చెరువు మధ్యలో దానిని పెడుతున్నారని చెప్పారు. ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలనుకుంటే ఆయన ధరించిన వేరే పాత్రల రూపంలో పెట్టుకోవచ్చన్నారు. అలా కాకుండా దేవుని రూపంలో విగ్రహం పెట్టటం ఏంటని ప్రశ్నించారు. విగ్రహ ఏర్పాటుపై స్టేని పొడిగించాలని కోరారు.

వాదనలను విన్న న్యాయమూర్తి గత వారం ఇచ్చిన ఉత్తర్వులను సవరించడానికి నిరాకరించారు. విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని విచారణను జూన్‌ 6కు వాయిదా వేశారు.

కరాటే కళ్యాణి సభ్యత్వం రద్దు…

మరో వైపు ఎన్టీఆర్‌ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించిన నటి కరాటే కళ్యాణిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా వేటు వేసింది. ఆమె సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మా నుంచి కళ్యాణి సభ్యత్వాన్ని రద్దు చేస్తూ మా జనరల్ సెక్రటరీ రఘుబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆమెకు వివరిస్తూ నోటీసులు పంపారు.

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్( విగ్రహ ఏర్పాటుపై కరాటే కళ్యాణి కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన 'మా'.. ఆమెకు షోకాజ్‌ నోటీసు జారీ చేసి వివరణ కోరారు. 'మా' నోటీసుపై స్పందించిన కరాటే కళ్యాణి ఈ నెల 16న తన వివరణ ఇచ్చింది. అయితే కళ్యాణి వివరణపై 'మా' కార్యవర్గం సంతృప్తి చెందలేదు. 'మా' నిబంధనల ప్రకారం కరాటే కళ్యాణిని సస్పెండ్ చేస్తున్నట్లు రఘుబాబు తెలిపారు. ఈ వ్యవహారంపై కరాటే కళ్యాణి స్పందించాల్సి ఉంది.

IPL_Entry_Point