Naini FlyOver: హైదరాబాద్ ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు కొత్తగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జికి మాజీ మంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణం పూర్తి చేసుకున్న ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
నగరంలో అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఒకటైన ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ జంక్షన్ వరకు ఉక్కుతో నిర్మించిన బ్రిడ్జికి మాజీ మంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించారు. ముషీరాబాద్‌లో సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో నాయిని వీఎస్టీ కార్మిక సంఘం నాయకుడిగా ఉమ్మడి రాష్ట్రంలో గుర్తింపు పొందారు.
తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి హోంమంత్రిగా పనిచేశారు. నాయిని చేసిన సేవలకు గుర్తుగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు స్టీల్ బ్రిడ్జికి ఆయన పేరు పెడుతున్నట్టు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రూ.450 కోట్లతో నిర్మించిన పొడవైన స్టీల్ బ్రిడ్జిని శనివా రం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఎస్‌ఆర్డీపీలో భాగంగా జిహెచ్‌ఎంసి పరిధిలో 2.63 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు.
ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్ నగర్, వీఎస్టీ జంక్షన్లలో దశాబ్దాల తరబడి ఉన్న ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడం సంతోషంగా ఉందంటూ కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 2.63 కి.మీల పొడవైన ఈ వంతెనను స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద జీహెచ్‌ఎంసీ నిర్మించిందని తెలిపారు.
ముషీరాబాద్ కేంద్రంగా రాజకీయాల్లో చురుగ్గా పనిచేసిన నాయిని నర్సింహారెడ్డి తెలంగాణ ఉద్యమంలో తన వంతు సేవలందించారని.. వీఎస్టీ ఫ్యాక్టరీలో కార్మికుల యూనియన్ నేతగా దశాబ్దాల పాటు పనిచేసిన అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ వంతెనకు ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేటీఆర్ తెలిపారు.