MLC Kavitha Case: కవిత కేసు విచారణ మూడు వారాలు వాయిదా….
MLC Kavitha Case: ఈడీ విచారణలో ఉపశమనం కోరుతూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ధర్మాసనం విచారణ మూడు వారాల పాటు వాయిదా వేసింది. విచారణ వాయిదా పడటంతో మూడు వారాల్లో ఈడీ ఎలా వ్యవహరిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.
MLC Kavitha Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై కీలకమైన విచారణ పూర్తైంది. కేసు విచారణ మూడు వారాల పాటు వాయిదావేసింది. కేసు విచారణ వాయిదా పడిన నేపథ్యంలో ఈడీ వైఖరి ఎలా ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది.
కవిత వర్సెస్ ఈడీ కేసులో సుప్రీం కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. కవిత పిటిషన్ నేపథ్యంలో ఈడీ తరపున కేవీయట్ దాఖలు చేయడంతో ఈడీ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. కేంద్రం తరపున సొలిసిట్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు.
ఈడీ విచారణ వ్యవహారంలో మహిళల్ని వేధించే ధోరణిలో దర్యాప్తు చేస్తోందని కవిత తరపున కపిల్ సిబ్బల్ ఆరోపించారు. సాయంత్రం ఆరు తర్వాత కూడా విచారణ కొనసాగించారని కవిత తరపున న్యాయవాది ఆరోపించారు. ఇంటి వద్దే కవితను విచారించాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు.
సిఆర్‌పిసి 160 ప్రకారం విచారణ ఎలా చేయాలనే విషయంలోఎలాంటి మార్గదర్శకాలు ఉన్నాయనే విషయంపై ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించారు.
సిఆర్‌పిసికి, పిఎంఎల్‌ఏ చట్టానికి వేర్వేరు నిబంధనలు ఉన్నాయని తుషార్ మెహతా వివరించారు. పిఎంఎల్‌ఏ చట్టం నిబంధనలు సిఆర్‌పిసి నిబంధనలు వేర్వేరని పేర్కొన్నారు.
అదే సమయవంలో నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసుల్ని పరిశీలించాల్సి ఉంటుందని కవిత తరపున న్యాయవాదులు వాదించారు. నళిని చిదంబరం కేసును కవిత కేసుతో పోలిక ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అన్ని రకాల ఆధారాలు ఉన్నందునే విచారించారని కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణ మూడు వారాల పాటు వాయిదా పడింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందనే ఆరోపణలపై ఈడీ విచారణ నిలుపుదల చేయాలని కోరుతూ కవిత సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కవిత తరపున వాదనలు వినిపించిన కపిల్ సిబల్ ఢిల్లీలోని కవిత నివాసంలో ఆమెను విచారించాలన్నారు. గతంలో నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ ఉదంతాల్లో ఈ తరహా తీర్పులిచ్చారని గుర్తు చేశారు. దీనిపై ధర్మాసనంలో న్యాయమూర్తులు చర్చించారు.
మరోవైపు కేంద్రం తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. విజయ్ మదన్ లాల్ కేసులో సిర్‌పిసి 160 నిబంధనలు మనీలాండరింగ్ చట్టానికి వర్తించదనే సంగతి గుర్తు చేశారు.
గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పులను కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులు ఉటంకించారు. అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి ఛాప్టర్ 12 నిబంధనలకు వర్తించవన్నారు. దీంతో జోక్యం చేసుకున్న కపిల్ సిబల్ తరపు న్యాయవాది పిఎంఎల్‌ఏ చట్టంలోని 65వ నిబంధన చూడాలని సూచించారు. దీంతో సిబల్ వాదనలపై సొలిసిటర్ జనరల్ అభ్యంతరం తెలిపారు. సిఆర్‌పిసి 160కూడా 12వ అధ్యాయంలో భాగమేనని అదనపు సొలిసిటర్ జనరల్ వాదించారు.
చట్టంలో నిబంధనలు స్పష్టంగా ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడటంతో ఈ కేసులో వాదనలు వినిపించేందుకు గడువు ఇవ్వాలని సిబల్ కోరారు. పిఎంఎల్‌ఏ చట్టంలోని 8వ నిబంధనను పరిశీలించాలని కపిల్ సిబ్బల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎమ్మెల్సీ కవితకు ఎలాంటి సంబంధం లేదని కపిల్ సిబల్ వాదించారు. ఇరుపక్షాలు వాదనలు విన్న ధర్మాసనం మూడు వారాల్లోపు అదనపు సమాచారాన్ని కోర్టుకు తెలియ చేయవచ్చని ధర్మాసనం సూచించింది. ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతోపాటు.. అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజులు వాదించారు. ఈ కేసుకు సాధారణమైనది కాదని, ప్రత్యేక చట్టం కింద మాత్రమే విచారణ జరుగుతోందని కోర్టు దృష్టికి తెచ్చారు . గతంలో విజయ్ మండల్ కేసులో ఇచ్చిన తీర్పు PMLA కేసుల్లో వర్తించదని ఈడీ తరపు న్యాయవాది వాదించారు.