Bathukamma: దీపావళికి బతుకమ్మ సంబరాలు ఆ ఊరి స్పెషల్..
Bathukamma: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను అద్దం పట్టే పండుగ బతుకమ్మ. దసరా ముందు తొమ్మిది రోజుల పాటు పూలను పూజించడం, చిన్నాపెద్దా అందరూ కలిసి బతుకమ్మ ఆడటం ఇక్కడి సంప్రదాయం. కానీ ఉమ్మడి వరంగల్ లోని ఆ గ్రామంలో దీపావళికి బతుకమ్మ సంబరాలను జరుపుకోవడం కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది.
Bathukamma: హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం సీతంపేట గ్రామంలో నేతకాని కులస్తులు దీపావళికి బతుకమ్మ సంబరాలు నిర్వహించుకుంటారు. నేతకాని కులస్తులు మూడు రోజుల పాటు గంగ నోముల పండుగ నిర్వహించి, చివరి రోజు బతుకమ్మ ఆడే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. సాధారణంగా దసరా ముందు అందరితో కలిసి ఒకసారి.. తమ సంపద్రాయం ప్రకారం దీపావళికి మరో సారి బతుకమ్మ ఆడే ఆనవాయితీ కొనసాగిస్తున్నారు.
రాష్ట్రంలో సీతంపేట నేతకాని కులస్తుల దీపావళి బతుకమ్మ పండుగ స్పెషల్గా నిలుస్తుండగా.. మహారాష్ట్రలోని కొందరు నేతకాని కులస్తుల పొలాల అమావాస్య సందర్భంగా ఇలా గంగనోముల పండుగ నిర్వహించుకుంటుడటం గమనార్హం. కాగా సీతంపేట లో సోమవారం నుంచి నేతకాని కులస్తులు కేదారీశ్వరుడికి పూజలు చేయగా బుధవారం నిర్వహించిన బతుకమ్మ సంబరాలతో ఈ ఏడాది గంగ నోముల పండుగ ఘనంగా ముగిసింది.
అసలేంటీ గంగ నోముల పండుగ
కొన్ని దశాబ్ధాల కిందట మహారాష్ట్రకు చెందిన కొందరు నేతకాని కులస్తులు ప్రస్తుత హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం సీతంపేట గ్రామానికి వలస వచ్చినట్లు పూర్వీకులు చెబుతున్నారు.
ఇక్కడికి వచ్చిన నేతకాని కులస్తులు వ్యవసాయాన్ని జీవనాధారంగా మార్చుకున్నారు. సాగు చేస్తూ జీవనం సాగించడం మొదలుపెట్టారు. కాగా మహారాష్ట్రలో దీపావళి సందర్భంగా నిర్వహించే పొలాల అమావాస్య పండుగలో భాగంగా అక్కడి నేతకాని కులస్తుల ఆరాధ్యదైవమైన కేదారీశ్వరుడి వ్రతం చేస్తుంటారు.
మూడు రోజుల పాటు నిష్టతో కేదారీశ్వరుడికి పూజలు చేసి, మొక్కులు చెల్లిస్తుంటారు. పిండివంటకాలు చేయడం, దేవుడికి పూజలు చేయడం, గంగాజలం సమర్పించడం లాంటి పూజా క్రతువులు ఉంటాయి కాబట్టి ఈ పండుగను గంగనోముల పండుగ అని కూడా పిలుస్తుంటారు. అదే సంప్రదాయాన్ని ఇక్కడి ప్రజలు కొనసాగిస్తున్నారు.
మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన నేతకాని కులస్తుల వల్లే ఈ సంప్రదాయం మొదలైందని కొంతమంది చెబుతుండగా.. అదంతా ఇక్కడి నేతకానీల ఆనవాయితేనని మరికొందరు చెబుతుండటం విశేషం.
రేగడి మట్టితో ఎడ్ల విగ్రహాలు
గంగనోముల పండుగను నేతకాని కులస్తులు మూడు రోజుల పాటు నిర్వహిస్తుంటారు. మద్యం, మాంసానికి దూరంగా ఉంటూ పూజలు చేస్తుంటారు. దీపావళి పండుగ సమయంలో మంచి రోజులు చూసుకుని మొదటిరోజు నేతకాని కులస్తులంతా ఉదయమే స్నానాలాచరించి గ్రామ సమీపంలోని గంగ(చెరువు) వద్దకు వెళ్తారు.
పరిశుద్ధంగా భావించే రేగడి మట్టిని సంప్రదాయబద్ధంగా ఇంటికి తీసుకొచ్చుకుని ఆ మట్టితో చిన్నపాటి జోడెడ్ల విగ్రహాలు తయారు చేస్తారు. తాము స్వయంగా పండించి తెచ్చిన ధాన్యం గింజలు, పూలు, పసుపు, కుంకుమలు, ఇంట్లో చేసిన పిండివంటకాలతో ఆ జోడెడ్లను అలంకరిస్తారు. అనంతరం వాటికి పూజలు చేస్తారు. రెండో రోజు వాటిని ఊరేగింపుగా తీసుకెళ్లి గంగలో నిమజ్జనం చేస్తారు. ఇలా చేయడం వల్ల వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండుతాయనే ఇక్కడి జనాల్లో కనిపిస్తోంది.
చివరి రోజు బతుకమ్మ సంబరాలు
రెండు రోజుల పూజల తరువాత చివరి రోజు నేతకాని కులస్తులంతా గునుగు, తంగేడుతో పాటు వివిధ రకాల పూలతో బతుకమ్మలు పేరుస్తారు. వాటితో ఆడ, మగ తేడా లేకుండా నేతకాని కులస్తులంతా ఆడిపాడతారు. ఆ మరుసటి రోజు ఉదయం కేదారీశ్వరుడికి తలకెత్తుకుని గంగనోముల పండుగను ముగిస్తారు.
అనంతరం ఒక్క పొద్దులు విడిచి సందడిగా గడుపుతుంటారు. ఇలా మూడు రోజుల పాటు సందడిగా సంబరాలు జరుపుకునే సంప్రదాయం సీతంపేట గ్రామ స్పెషాలిటీ కాగా.. ఈ మూడు రోజుల పాటు గ్రామస్థులంతా వారితో కలిసి వివిధ పూజల్లో పాల్గొంటారు. వాళ్లు కూడా బతుకమ్మ లు పేర్చి నేతకానీల సంబరాల్లో పాలుపంచుకుంటుంటారు. దీంతో ఏటా రెండు సార్లు బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం ఆ గ్రామానికి ప్రత్యేకతను చాటిచెబుతోంది.
ఘనంగా ముగిసిన ఉత్సవాలు
ఈ సంవత్సరం సీతంపేట నేతకాని కులస్తులు గంగనోముల పండుగలో భాగంగా గత సోమవారమే కేదారీశ్వరుడి పూజలు ప్రారంభించారు. సోమవారం నుంచి ఇంట్లో వాళ్లంతా కలిసి నిష్టగా పూజలు చేసి తమ ఆరాధ్య దైవమైన కేదారీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు రోజుల క్రతువు ముగిసిన అనంతరం బుధవారం సాయంత్రం నేతకాని కులస్థులు, గ్రామస్థులు బతుకమ్మలతో ఆడిపాడారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి బంధువులను పిలిపించుకుని సంబరాల్లో మునిగితేలారు.
బుధవారం సాయంత్రం నిర్వహించిన ఈ సంబరాలకు ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఇతర నేతలు హాజరై బతుకమ్మ ఆటపాటలతో అలరించారు. దాదాపు మూడు తరాల నుంచి కొనసాగుతున్న ఈ సంప్రదాయం సీతంపేటకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని గ్రామస్థులు చెబుతుండగా.. ఇక్కడి గ్రామస్థులంతా నేతకాని కులస్తుల పూజల్లో పాల్గొంటూ సామరస్య స్ఫూర్తిని చాటుతుండటం విశేషం.
(హిందుస్థాన్ టైమ్స్, వరంగల్ ప్రతినిధి)