TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో మరో ముగ్గురి అరెస్ట్.. 43కు చేరిన నిందితులు-the sit has arrested three more accused in the public service commission paper leak case
Telugu News  /  Telangana  /  The Sit Has Arrested Three More Accused In The Public Service Commission Paper Leak Case
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్

TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో మరో ముగ్గురి అరెస్ట్.. 43కు చేరిన నిందితులు

25 May 2023, 20:58 ISTHT Telugu Desk
25 May 2023, 20:58 IST

TSPSC Paper Leak: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్‌ లీక్ కేసులోనిందితుల అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ కేసులో తాజాగా మరో ముగ్గురు నిందితుల్ని సిట్ అరెస్ట్ చేసింది.

TSPSC Paper Leak: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ పేపర్ లీక్ కేసులో మరో ముగ్గురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన రవి నుంచి ఏఈ పేపర్ కొనుగోలు చేసినందుకు భరత్, రోహిత్, సాయిను అదుపులోకి తీసుకున్నారు. వీరితో కలిపి ఈ కేసులోఅరెస్ట్‌ చేసిన వారి సంఖ్య 43కి చేరుకుంది. ఈ కేసులో మే24న కూడా సిట్ అధికారులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.

పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ నిర్వహించిన ఏఈ పరీక్షలో టాప్ స్కోర్ సాధించిన రాయ్‌పూర్‌కు చెందిన దివ్య, రవి, కిశోర్‌లను సిట్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వీరు పేపర్ కొనుగోలు చేసి పరీక్ష రాసినట్టు అధికారులు గుర్తించారు. దీనితో వారిని విచారించిన సిట్, పోలీసులు చెప్పిన వివరాల ఆధారంగా అనుమానం రావడంతో అరెస్ట్ చేశారు.

పేపర్ లీకేజి కేసులో ప్రవీణ్, రాజశేఖర్, రేణుక ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 13 మందికి కోర్టు బెయిల్ ఇచ్చింది. వీరిలో 11 మంది జైలు నుంచి ఇప్పటికే రిలీజ్ అయ్యారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్ లకు మాత్రం బెయిల్ లభించకపోవడంతో జైల్లోనే ఉన్నారు. పేపర్‌ లీక్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన రేణుకకు మాత్రం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సిట్ విచారణకు రేణుక హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు పేపర్ కేసులో కాన్ఫిడెన్షియల్ రూమ్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నశంకర్ లక్ష్మీ పాత్రపై సిట్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆమె కాల్ డేటా వివరాలను సేకరించారు. 2017 నుంచి టీఎస్‌పీఎస్సీలో ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ అధికారులు ఇచ్చిన సమాచారంలో తేడాలు ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు.

డీఏవో, ఏఈఈ, ఏఈ పేపర్ల లీక్ అంశంలో టీఎస్‌పీఎస్సీ సిబ్బంది వివరాలు దాచిపెట్టినట్లు తేల్చారు. పేపర్లు వాల్యుయేషన్ చేయలేదని టీఎస్‌పీఎస్సీ తప్పుడు సమాచారం ఇచ్చినట్లు సిట్ అధికారులు అనుమాస్తున్నారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లో పనిచేసిన శంకర లక్ష్మీ గతంలో ఇచ్చిన సమాధానాలను పోల్చి చూస్తున్నారు.