Tspsc Paper leak: చేతులు మారిన కోట్ల రుపాయలు.. సిట్ దర్యాప్తులో కొత్త విషయాలు-the sit found that crores of rupees had changed hands in the paper leak case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  The Sit Found That Crores Of Rupees Had Changed Hands In The Paper Leak Case

Tspsc Paper leak: చేతులు మారిన కోట్ల రుపాయలు.. సిట్ దర్యాప్తులో కొత్త విషయాలు

HT Telugu Desk HT Telugu
Jun 01, 2023 09:26 AM IST

Tspsc Paper leak: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కేసు దర్యాప్తు సాగుతూనే ఉంది. పేపర్ లీక్ వ్యవహారంలో అక్రమాలు అనుకున్న దానికంటే ఎక్కువే ఉన్నాయని సిట్ గుర్తించింది. ఇన్నాళ్లు పేపర్ లీక్‌ కేసుకే పరిమితం అనుకుంటే తాజాగా హైటెక్ కాపీయింగ్ కూడా వెలుగులోకి వచ్చింది.

పేపర్ లీక్ కేసులో చేతులు మారిన కోట్ల రుపాయలు
పేపర్ లీక్ కేసులో చేతులు మారిన కోట్ల రుపాయలు

Tspsc Paper leak: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రశ్నపత్రాల లీకేజి కుంభకోణం విస్తృతి అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు పేపర్‌ లీక్ వ్యవహారంలో 40లక్షల రుపాయలు చేతులు మారాయని భావిస్తే దాని విలువ రూ.కోట్లలోనే ఉంటుందని దర్యాప్తు బృందం అంచనా వేసింది. నిందితుల సంఖ్య కూడా మరింత పెరుగుతుందని ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

పేపర్ లీక్ కేసులో నిందితులు దాదాపై వందమందికి పైగా ఉంటారని, వీరందరిని అరెస్టు చేస్తామని చెబుతున్నారు. పేపర్‌ లీక్ జరిగిన తీరుపై లోతుగా దర్యాప్తు అధికారులకు అందులో తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెల్లడవుతుండటంతో ఆశ్చర్యపోతున్నారు.

కమిషన్‌లో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న రాజశేఖర్‌రెడ్డి, కమిషన్ కార్యదర్శి వద్ద సహాయకుడిగా పనిచేస్తున్న ప్రవీణ్‌లు కలిసి ప్రశ్నపత్రాలు చోరీ చేశారు. ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాన్ని ప్రవీణ్‌ రూ.10 లక్షలకు డాక్యా నాయక్‌కు అమ్మాడు. డాక్యానాయక్‌ దాన్ని మరో 13 మందికి విక్రయించాడు. ఇలా దాదాపు రూ.40 లక్షలు చేతులు మారినట్లు మొదట్లో భావించారు.

మార్చి 12న జరగాల్సిన టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ పరీక్ష ప్రశ్నాపత్రం కూడా లీకైనట్లు సమాచారం రావడంతో దర్యాప్తు మొదలైంది. కమిషన్‌ అప్పటికే గ్రూప్‌-1, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌, సీడీపీవో, సూపర్‌వైజర్‌ గ్రేడ్‌-1, ఏఈఈ, డివిజనల్‌ ఎకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏవో), ఏఈ పరీక్షలు నిర్వహించింది. వీటిలో సీడీపీవో, సూపర్‌వైజర్‌ గ్రేడ్‌-1, ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్‌ పరీక్షలు మినహా మిగతా నాలుగు పరీక్షలను రద్దు చేసింది. ఈ నాలుగు పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్‌ అయినట్లు నిందితులు అంగీకరించడంతో కమిషన్ వాటిని రద్దు చేసింది.

ఒకరి నుంచి మరొకరికి చేరిపోయాయి…

చోరీ చేసిన ప్రశ్నపత్రాలను ప్రవీణ్‌, రాజశేఖర్‌ ముఠా రకరకాలుగా అమ్ముకున్నారు. రూ.లక్షలు పెట్టి ప్రశ్నపత్రం కొనుక్కున్న వారు వాటిని ఇతరులకు విక్రయించి.. తమ సొమ్మును రాబట్టుకునేందుకు ప్రయత్నించారు. మొదట్లో ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డిలను పోలీసులు ఎంత ప్రశ్నించినా సరైన సమాచారం రాలేదు.

తమ వద్ద ప్రశ్నపత్రాలు కొన్నవారి వివరాలు మాత్రమే వారు చెప్పగలిగారు. వారి వద్ద కొనుగోలు చేసిన అభ్యర్థులు మరికొందరికి, అలా ఇంకొందరికి అమ్మారు. గొలుసు కట్టుగా మారిన ఈ కుంభకోణాన్ని గుర్తించడం పోలీసులకు కూడా కష్టంగా మారింది. మొదట్లో ప్రవీణ్‌, రాజశేఖర్‌, డాక్యానాయక్‌ల ద్వారా ప్రశ్నపత్రాలు 20 మందికి మాత్రమే చేరి ఉంటాయనుకున్నారు.

ఇప్పటికే అవి 40 మందికి చేరినట్లు సిట్ గుర్తించింది. వీరిలో చాలామంది వివరాలు ప్రవీణ్‌, రాజశేఖర్‌లకు కూడా తెలియవు. ప్రవీణ్‌ తన స్నేహితుడు సురేష్‌కు గ్రూప్‌-1, ఏఈ ప్రశ్నపత్రాలు ఇచ్చాడు. సురేష్‌ గ్రూప్‌-1 పరీక్ష రాశాడు. ఏఈ ప్రశ్నపత్రాన్ని మాత్రం 78 మందికి విక్రయించాడు. సురేష్‌ ద్వారా ప్రశ్నపత్రం తీసుకున్న విద్యుత్తుశాఖ ఏఈ రమేష్‌ మరో 30 మందికి దానిని అమ్మాడు. వందలాది మంది ప్రశ్నాపత్రాల కొనుగోలు కేసులో లాభపడ్డారని సిట్ గుర్తించింది.

పదికోట్లు సంపాదించాలనుకుని…

పేపర్‌ లీక్ కేసులో ఎలక్ట్రికల్ డిఈని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశ్నాపత్రాల విక్రయాలతో పది కోట్ల రూపాయలు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడని గుర్తించారు. సురేష్‌ ద్వారా టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాలను దక్కించుకొని భారీగా లాభపడ్డాడు. ఈ కేసులో తాను ఎవరికీ పట్టుబడనని ఇన్నాళ్లు ధైర్యంగా ఉన్నారు. సిట్‌ పోలీసుల దర్యాప్తుతో ఆయన బండారం బయట పడింది. అంతకుముందు హైటెక్ కాపీయింగ్ కోసం చేసిన ప్రయత్నాలు బయటపడ్డాయి.

సైదాబాద్‌కు చెందిన పూల రమేష్‌ 2007లో విద్యుత్‌ శాఖ ఏఈగా ఉద్యోగం పొందాడు. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తున్నాడు. గతంలో నార్కట్‌పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రికి వెళ్లినప్పుడు అక్కడి వైద్యుడి ద్వారా సురేష్‌ పరిచయమయ్యాడు.

అలా ఏర్పడిన పరిచయంతో సైదాబాద్‌లోని సురేష్‌ ఇంట్లోనే రమేష్ అద్దెకు దిగాడు. సురేష్‌.. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడైన ప్రవీణ్‌కుమార్‌కు స్నేహితుడు. వీరంతా ఒకే భవన సముదాయంలో ఉండేవారు. సురేష్‌ ద్వారా పరీక్ష ప్రశ్నపత్రాలను తీసుకొన్న రమేష్‌ వాటిని 30 మందికి విక్రయించి 70:30 నిష్పత్తిలో వాటాలు పంచుకున్నారు.

రమేష్‌కు సాంకేతిక పరిజ్ఞానంతోపాటు పరీక్షల నిర్వహణ, కేంద్రాలు తదితర అంశాలపై పట్టుంది. దాన్ని అవకాశంగా మరో ప్రణాళిక రూపొందించారు. గతంలో నిర్వహించిన ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ పరీక్షలో హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌తో సమాధానాలు చేరవేసేలా ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ అనుభవాన్ని ఏఈఈ, డీఏఓ పరీక్షలకు ఉపయోగించుకున్నట్లు గుర్తించారు.

డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షల్లో అక్రమాలు…

ఈ ఏడాది జనవరి 22న డీఏవో, ఫిబ్రవరి 26న ఏఈఈ పరీక్షలు జరిగాయి. రమేష్‌... పరీక్షలకు కొద్దిరోజుల ముందు ఏడుగురు అభ్యర్థులతో మాట్లాడాడు. ఒక్కొక్కరి నుంచి రూ.30-40 లక్షలకు బేరసారాలు జరిపాడు. అడ్వాన్సుగా రూ.1.10 కోట్లు రాబట్టాడు.

ఆ తర్వాత తనకు డబ్బులు చెల్లించిన అభ్యర్థుల పరీక్ష కేంద్రాల వివరాలను తెలుసుకున్నాడు. ఆ కళాశాల ప్రిన్సిపల్‌, ఇన్విజిలేటర్లకు భారీగా నగదు చెల్లించి తనకు సహకరించేలా ఏర్పాట్లు చేశాడు. పరీక్షా కేంద్రాల్లో ఆ అభ్యర్థులకిచ్చే ప్రశ్నపత్రాల 'కోడ్‌' వివరాలను ముందుగానే అంచనా వేశాడు. పరీక్ష రోజు అభ్యర్థులకు హైటెక్‌ విధానంలో సమాధానాలు చేరవేసేందుకు అవసరమైన మైక్రోఫోన్లు, డివైస్‌లు, వైర్లు, బ్లూటూత్‌లను కొన్నాడు.

వాటిని అభ్యర్థుల లోదుస్తులు, బెల్టులు, చెవుల్లో మైక్రోఫోన్లు అమర్చి ఇన్విజిలేటర్ల సహాయంతో పరీక్షా కేంద్రాలకు పంపారు. పరీక్షకు గైర్హాజరైన ఇతర అభ్యర్థుల ప్రశ్నపత్రాలను ఇన్విజిలేటర్లు ఫొటోలు తీసి రమేష్‌కు వాట్సప్‌ చేశారు. బయట ఉన్న రమేష్‌ ప్రశ్నపత్రాల 'కోడ్‌'లకు అనుగుణంగా చాట్‌ జీపీటీ, బోధనా నిపుణుల సహకారంతో సమాధానాలు సేకరించి ఫోన్‌ చేయగానే బ్లూటూత్‌ ద్వారా ఆటోమేటిక్‌గా రిసీవర్‌ నుంచి అభ్యర్థులకు జవాబులు చేరవేశాడు.

టాపర్ల జాబితాతో అక్రమాలు వెలుగులోకి…

సిట్‌ దర్యాప్తులో భాగంగా టాపర్ల జాబితా బయటకు తీసినప్పుడు ఈ అభ్యర్థుల గుట్టు బయటపడింది. వీరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించినప్పుడు హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌ వెలుగు చూసింది. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో 13 మందిని పోటీ పరీక్షలకు హాజరుకాకుండా టీఎస్‌పీఎస్సీ డీబార్‌ చేసింది. ఇప్పటికే డిబార్‌ చేసిన 37 మందితో కలిపి మొత్తం డిబారైన అభ్యర్థుల సంఖ్య 50కి చేరింది. డిబార్‌లపై అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు, వివరణలు ఉంటే రెండురోజుల్లో ఇవ్వాలని స్పష్టంచేసింది.

పూల రవి, రాయపురం విక్రమ్‌, రాయపురం దివ్య, ధనావత్‌ భరత్‌ నాయక్‌, పాశికంటి రోహిత్‌కుమార్‌, గాదే సాయిమధు, లోకిని సతీష్‌కుమార్‌, బొడ్డుపల్లి నర్సింగ్‌రావు, గుగులోత్‌ శ్రీనునాయక్‌, భూక్యా మహేష్‌, ముదావత్‌ ప్రశాంత్‌, వదిత్య నరేష్‌, పూల రమేష్‌కుమార్‌లను పరీక్షల నుంచి నిషేధిస్తూ కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

WhatsApp channel