Godavari Water to Musi : మూసీ నదికి గోదావరి జలాలు.. తొలి దశలో గండిపేట నుంచి బాపూఘాట్ వరకు!
Godavari Water to Musi : మూసీ పునరుజ్జీవంపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మూసీ నదికి గోదావరి జలాలు తరలించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి చకచకా అడుగులు పడుతున్నాయి. దీంతో మూసీ నది స్వరూపమే మారిపోనుందని అధికారులు చెబుతున్నారు.
మూసీ పునరుజ్జీవంపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. గండిపేటలో గోదావరి నీళ్లు నింపేందుకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. 15 రోజుల్లో టెండర్లను పిలవడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తొలి దశలో గండిపేట నుంచి బాపూఘాట్ వరకు పనులు జరగనున్నాయి.
బాపూఘాట్‌ను సుందరీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. మూసీ పునరుజ్జీవంలో భాగంగా బాపూఘాట్‌ను అభివృద్ధి చేయనున్నారు. బాపూఘాట్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ ఇప్పటికే ప్రకటించారు. బాపూఘాట్ దగ్గర ఎస్టీపీలతో నీటిని శుద్ధి చేయడానికి ఏర్పాట్లు చేయనున్నారు. ఎస్టీపీలకు రూ.7 వేల కోట్లతో టెండర్లు పిలవడానికి రంగం సిద్ధమైంది.
మూసీ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చేందుకు పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్, ఇతర నమూనాలతో సహా సాధ్యమైన అన్ని మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. మూసీ ప్రాజెక్టుకు ఇతర అభివృద్ధి పనులకు లింక్ ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అంటున్నారు.
ఇటు మూసీ ప్రక్షాళన అంశం రాజకీయ మంటలు రేపుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల సవాళ్లు, ప్రతిసవాళ్లకు వేదికగా నిలుస్తోంది. మూసీ రివర్ బెడ్ లోని ఆక్రమణలను తొలగించడం, మూసీ మురుగు నీటి శుద్ధీకరణ, సుందరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50లక్షల కోట్ల ప్రాజెక్టుకు డిజైన్ చేసింది.
కాలుష్య కూపంగా మారిన మూసీ నదిని ప్రక్షాళనకు జరిగిన ప్రయత్నాలు చాలా తక్కువ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకింత ప్రయత్నించినా అది నివేదికలు, అంచనాల దశ దాటలేదు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లా ప్రజల జనజీవనంతో పెనవేసుకున్న మూసీ నది నీరు.. ఇపుడు విషతుల్యంగా మారింది.
మూసీ పునరుజ్జీవం పూర్తయితే.. హైదరాబాద్ అద్భుత నగరంగా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ వంటి నగరాలకు ఏమాత్రం తీసిపోకుండా తయారవుతుందన్నారు. ఆర్థికంగా నగరం గణనీయమైన వృద్ధిని సాధిస్తుందని చెప్పారు. మూసీ అభివృద్ధి విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.