TG Teachers Transfers : తెలంగాణలో జూన్ 7 నుంచి టీచర్ల బదిలీలు - రేపోమాపో షెడ్యూల్!
Teachers Transfers in Telangana: తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియపై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఈనెల 7వ తేదీ నుంచి తిరిగి మొదలవుతుందని అధికారులు ప్రకటించారు.
Teachers Transfers in Telangana: తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడటం, మళ్లీ లోక్ సభ ఎన్నికలు రావటంతో ఈ ప్రక్రియ ముందుగా సాగలేదు. అయితే జూన్ 6వ తేదీతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఎత్తివేయనున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఈ ప్రక్రియ షురూ కానుంది.
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియపై విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం కీలక అప్డేట్ ఇచ్చారు. సోమవారం పాలిసెట్ ఫలితాల విడుదల అనంతరం… మీడియాతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ…. ఈనెల 7వ తేదీ నుంచి తిరిగి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు. ఇదే నెలలో ఈ ప్రక్రియను మొత్తం పూర్తి చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఒకటి రెండు రోజుల్లోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
బడి బాట కార్యక్రమం….
ఈ నెల 6 నుంచి బడి బాట కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఈ నెల 12న బడులు పునఃప్రారంభమవుతన్న సంగతి తెలిసిందే.
విద్యా సంవత్సర క్యాలెండర్ ఇదే….
ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సర క్యాలెండర్‌ను విడుదల చేసింది. జూన్ 12, 2024 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. 2025, ఏప్రిల్ 23 వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. అక్టోబర్ 2 నుంచి 14 వరకు పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు. డిసెంబర్ 23 నుంచి 27 వరకు 5 రోజుల పాటు క్రిస్మస్ సెలవులు కాగా, వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించారు. 2025, ఫిబ్రవరి 28లోపు పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది మార్చి నెలలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని హైస్కూల్స్ ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు కొనసాగనున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణలో ఒకటి నుంచి 10వ తరగతుల వరకు అకడమిక్ క్యాలెండర్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులు స్కూల్స్ పనిచేయనున్నాయి. జూన్ 12, 2024న ప్రారంభమై ఏప్రిల్ 23, 2025తో ముగుస్తాయి. ఏప్రిల్ 24, 2025 నుంచి జూన్ 11, 2025 మొత్తం 49 రోజులు ఈ విద్యాసంవత్సరంలో వేసవి సెలవులు ఉంటాయి. అలాగే అక్టోబర్ 13 నుంచి 25 వరకు మొత్తం 13 రోజుల దసరా సెలవులు ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు మొత్తం 6 రోజులు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. దీంతో పాటు ప్రతి రోజు ప్రభుత్వ పాఠశాలల్లో 5 నిమిషాల యోగా, మెడిటేషన్ క్లాసులు ఉండాయని ప్రకటించింది.