TG New Ration Cards : పథకాలకు దూరం.. ఇంకా ఎంత కాలం? రేషన్ కార్డుల కోసం పేదల ఎదురుచూపులు
TG New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ కాక చాలా కాలం అయ్యింది. దీంతో చాలామంది పేదలకు సంక్షేమ పథకాలు అందడం లేదు. ఇప్పటికే చాలాసార్లు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. కానీ కార్డులు జారీ కాలేదు. ఈసారి అయినా జారీ చేస్తారా అని పేదలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
తెలంగాణలో చాలా ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సంక్రాంతి తర్వాత అప్లికేషన్లు స్వీకరించే అవకాశం ఉంది. దీంతో రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారిలో ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. అయితే.. రేషన్ కార్డులు లేక చాలా కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందడం లేదు. గత ప్రభుత్వం హాయాంలో దరఖాస్తు చేసుకున్నా.. ఇప్పటికీ కార్డులు రాలేదని పేదలు వాపోతున్నారు.
ప్రజావాణిలోనూ..
రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లలో ప్రతి సోమవారం ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులోనూ రేషన్‌కార్డు కోసం చాలామంది దరఖాస్తులు చేసుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత.. ప్రజాపాలన పేరుతో ఆరు అంశాలపై గ్రామాల్లో గ్రామసభలు పెట్టారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా స్వీకరించిన అప్లికేషన్ ఫామ్‌లో రేషన్ కార్డు కాలం పొందుపర్చారు. కానీ.. చాలామంది తెల్ల కాగితంపై దరఖాస్తు చేసుకున్నారు. వాటిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేవు.
ఇంకా ఎంత కాలం..
రేషన్ కార్డులు లేకపోవండతో.. చాలా కుటుంబాలు కొన్ని పథకాలకు దూరమవుతున్నాయి. ఆరోగ్య శ్రీ, 200 యూనిట్ల కరెంటు, రూ.500 గ్యాస్ సిలిండర్, బ్యాంకు రుణాలు, స్కాలర్‌షిప్స్ వంటి పథకాలకు నోచుకోలేకపోతున్నారు. అయితే.. ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటారా? కొత్తగా దరఖాస్తు చేసుకోవాలా? అనేది ఇంకా స్పష్టత రాలేదు. రేషన్ కార్డుల జారీకి సంబంధించి అర్హతల అంశంపై ఇంకా విధి విధానాలను ఖరారు కాలేదు.
ప్రజలు ఏమంటున్నారు..
ప్రజాపాలన గ్రామసభలు పెట్టినప్పుడు రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఇచ్చామని ప్రజలు చెబుతున్నారు. ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులు ఇస్తామనడం సంతోషంగా ఉందని అంటున్నారు. కార్డు లేకపోవడంతో రేషన్ బియ్యం రావడం లేదని.. ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకోవాలనుకుంటే.. కార్డు కావాలని అడుగుతున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి త్వరగా రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
అధికారులు ఏమంటున్నారు..
అయితే.. కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాని అంటున్నారు. ప్రస్తుతం ఎలాంటి దరఖాస్తులు పెండింగ్‌లో లేవని చెబుతున్నారు. అంటే.. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోలేదని అర్థం అవుతోంది. విధివిధానాలు ఖరారయ్యాక.. మళ్లీ అప్లై చేసుకోవాలని అధికారులు చెబుతున్నట్టు తెలుస్తోంది.