Dimple Hayati Issue: డింపుల్ ఇంట్లోకి అగంతకులు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
Dimple Hayati Issue: హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో వివాదంతో వార్తల్లో నిలిచిన హీరోయిన్ డింపుల్ హయతి నివాసంలోకి అగంతకులు ప్రవేశించడం కలకలం రేపింది. ఓ యువతీ, యువకుడు డింపుల్ నివాసంలోకి రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Dimple Hayati Issue: సినీ నటి డింపుల్ హయాతి ఇంట్లోకి ప్రవేశించిన యువతి, యువకుడు ప్రవేశించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో ఉంటున్న డింపుల్ హయతి నివాసంలోకి గురువారం ఓ యువతీయువకుడు ప్రవేశించారు. డింపుల్ పెంపుడు కుక్క వెంట పడటంతో వెనుదిరిగిపోయారు. ఈ క్రమంలో అగంతకులు ఇంట్లోకి ప్రవేశించడంపై డింపుల్ పోలీసులకు డయల్ 100 ద్వారా సమాచారం ఇచ్చారు.
జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని ఎస్‌కేఆర్ ఎన్‌క్లేవ్‌లో డింపుల్ హయతి ఆమె స్నేహితుడు విక్టర్ డేవిడ్‌తో కలిసి ఉంటున్నారు. అపార్ట్‌మెంట్ సెల్లార్ పార్కింగ్ విషయంలో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో వివాదం తలెత్తింది. ఈ వ్యవహారంలో డింపుల్, డేవిడ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు ఐపీఎస్ అధికారి కక్ష పూరితంగా తనను వేధిస్తున్నారని డింపుల్ ఆరోపించారు. డింపుల్ హయతి, రాహుల్ హెగ్డేల మధ్య వివాదం నడుస్తుండగానే గురువారం ఓ జంట ఆమె ఇంట్లోకి అనుమతి లేకుండా ప్రవేశించడంతో డింపుల్ ఆందోళనకు గురైంది.
గురువారం ఉదయం డింపుల్ నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన యువతి, యువకుడు వారు ఉంటున్న ఫ్లోర్‌లో ప్రవేశించి డింపుల్ నివాసంలోకి వెళ్లారు. వారిని గమనించిన పనిమనిషి ఎవరని ఆరా తీసే ప్రయత్నం చేసింది. ఇంతలో డింపుల్ పెంపుడు కుక్క వారి వద్దకు వెళ్లడంతో భయపడిన వారు తిరిగి లిఫ్టులోకి వెళ్లిపోయారు.
వారిని వెంబడిస్తూ లిఫ్టు లోపలికి వెళ్లిన కుక్క తిరిగి వెంటనే బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న డింపుల్ వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు యువతీయువకుల్ని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. పోలీసుల విచారణలో రాజమండ్రి నుంచి వచ్చామని, డింపుల్ అభిమానులమని వివరించారు.
ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో డింపుల్‌ను పరామర్శించడానికి వచ్చినట్లు పోలీసులకు తెలిపారు. పోలీసులు ఆ సమాచారాన్ని ఆమెకు తెలిపి వారిని విడిచిపెట్టామని తెలిపారు. డింపుల్ ఇంట్లోకి ప్రవేశించిన యువతీ యువకుల్ని కొప్పిశెట్టి సాయిబాబు, అతని బంధువు శృతిగా గుర్తించారు. వారిద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చి విడిచి పెట్టారు.