Ts Agency Policing: ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు
Ts Agency Policing: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు.
Ts Agency Policing అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అటవీ ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతవరణంలో నిర్వహించేందుకు తగిన జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.
తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్ గడ్ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మావోయిస్టులను కట్టడి చేయడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఏరియా డామినేషన్ లో భాగంగా అటవీ ప్రాంతాలతో పాటు గుట్టలను జల్లెడ పడుతున్నారు.
ప్రతాపగిరి ఫారెస్ట్ ను చుట్టుముట్టిన పోలీసులు
అటవీ ప్రాంతాలపై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో సోమవారం భూపాలపల్లి, ములుగు ఎస్పీలు కిరణ్ ఖారే, గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, పోలీసుల పహారా నడుమ కాటారం మండలం ప్రతాపగిరి అటవీ ప్రాంతంలోని గొంతెమ్మ గుట్ట ఏరియాను పరిశీలించారు.
ప్రతాపగిరి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో కాలినడకన ప్రయాణించి గుట్టపైకి చేరుకున్నారు. గుట్ట చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించడంతో పాటు పాండవుల భేరి, శివ లింగానికి స్థానికులతో కలిసి పూజలు చేశారు. కాకతీయులు తమ స్థావరంగా, రక్షణగా ఏర్పాటు చేసుకున్న ప్రహరీని, కాకతీయుల నిర్మాణాలను పరిశీలించి స్థానికులతో మాట్లాడి వివిధ అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
భయాందోళనలో జనాలు
ప్రతాపగిరి ఫారెస్ట్ ఏరియాలో జిల్లా ఉన్నతాధికారుల పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాన్నంతా చుట్టుముట్టారు. అటవీ ప్రాంతంలోకి భారీగా పోలీస్ వాహనాలు, గ్రే హౌండ్, వివిధ విభాగాల పోలీసులు ప్రవేశించడంతో స్థానికులు భయాందోళన చెందారు.
(హిందుస్థాన్ టైమ్స్, వరంగల్ ప్రతినిధి)