Jagitial Police : మెట్ పల్లిలో రెండేళ్ల బాలుడు కిడ్నాప్ - పట్టించిన సీసీ ఫుటేజీ-the person who kidnapped the boy was arrested in metpally of jagitial district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jagitial Police : మెట్ పల్లిలో రెండేళ్ల బాలుడు కిడ్నాప్ - పట్టించిన సీసీ ఫుటేజీ

Jagitial Police : మెట్ పల్లిలో రెండేళ్ల బాలుడు కిడ్నాప్ - పట్టించిన సీసీ ఫుటేజీ

HT Telugu Desk HT Telugu
Aug 15, 2024 09:16 PM IST

జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఓ బాలుడు కిడ్నాప్ అయ్యాడు. తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా… 24 గంటల్లోనే పోలీసులు కేసును చేధించారు. బాలుడిని కిడ్నాప్ చేసిన నగేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అనంతరం బాలుడిని క్షేమంగా పేరెంట్స్ కి అప్పగించారు. కేసును గంటల్లోనే చేధించిన పోలీసులకు పలువురు అభినందనలు తెలిపారు.

జగిత్యాల జిల్లాలో కిడ్నాపర్ అరెస్ట్
జగిత్యాల జిల్లాలో కిడ్నాపర్ అరెస్ట్

జగిత్యాల జిల్లా మెట్ పల్లి లో రెండేళ్ల బాలుడు కిడ్నాప్.. సుఖాంతమైంది. బాబుని ఎత్తుకెళ్ళి విక్రయించేందుకు యత్నించిన అమ్మక్కపేటకు చెందిన ఇస్లావత్ నగేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ అశోక్ కుమార్ నేతృత్వంలో అరెస్టు అయిన నగేష్ ను మీడియాకు చూపించి బాబును క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.

మెట్ పల్లి లోని దుబ్బవాడలో మంగళవారం సాయంత్రం రెండేళ్ళ బాబు కిడ్నాప్ గురయ్యాడు. సీసాలు డబ్బాలు ఏరుకుంటూ బిక్షాటన చేస్తూ జీవనం సాగించే లక్ష్మి రాజు దంపతుల కుమారుడు. అక్క అమ్ములుతో కలిసి బయటికి వెళ్ళిన బాబును బైక్ పై వచ్చిన వ్యక్తి అపహరించాడు. అక్కకు 20 రూపాయలు ఇచ్చి చాక్లెట్ కొనుక్కోమని బాబును బైక్ పై ఎత్తుకెళ్ళాడు. అక్క అమ్ములు బాబును ఎవరో బైక్ ఫై తీసుకెళ్లారని చెప్పడంతో వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.

నిందితుడిని పట్టించిన సీసీ ఫుటేజ్

బాబును బైక్ పై ఎత్తుకెళ్ళి నిందితుడిని సిసి కెమెరాలు పట్టించాయి. బాబు కిడ్నాప్ అయ్యాడని పేరెంట్స్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సిసి కెమెరాలు పరిశీలించారు. ఓ వ్యక్తి బైక్ పై వచ్చి బాబును తీసుకెళ్లిన ఆనవాలను గుర్తించారు. సిసి ఫుటేజ్ ఆధారంగా ఆరు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టగా వెంకట్రావుపేట వద్ద నిందితుడు పట్టుబడ్డాడు. 

పట్టుబడ్డ వ్యక్తి ఇబ్రహీంపట్నం మండలం అమ్మకపేటకు చెందిన ఇస్లావత్ నగేష్ ను విచారిస్తే బాబును విక్రయించేందుకు ఎత్తుకెళ్లినట్లు వెల్లడించినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. బాబును లక్షా 50 వేలకు అమ్మేందుకు ప్రయత్నించినట్లు ప్రకటించారు.

24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

రెండేళ్ళ బాబు కిడ్నాప్ కేసును 24 గంటల్లో పోలీసులు ఛేదించారు. క్షేమంగా పేరెంట్స్ కు అప్పగించారు. బాబు అపహరణకు గురయ్యాడని విషయాన్ని పోలీసులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసి, ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగడంతో బాబు క్షేమంగా దొరికాడని స్థానికులు అంటున్నారు. కిడ్నాప్ కేసును గంటల వ్యవధిలో చేదించి బాబును క్షేమంగా అప్పగించడంతో పోలీసులను పేరెంట్స్ తో పాటు పలువురు అభినందించారు.

రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.