Narsapur BRS:నర్సాపూర్ బిఆర్ఎస్ పార్టీ క్యాడర్లో స్తబ్ధత, ఎటూ తేల్చని అధిష్టానం
Narsapur BRS: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది ఇప్పట్లో తేలే వ్యవహారంలా కనిపించడం లేదు. నర్సాపూర్ అభ్యర్థి ఎంపిక వ్యవహారంపై పార్టీ అధిష్టానం తేల్చకపోవడంతో క్యాడర్‌లో స్తబ్దత నెలకొంది.
Narsapur BRS: ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో అధికార పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించడంతో వారంతా ప్రచారం చేసు కోవడంలో మునిగి తేలుతున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి అభ్యర్థితత్వాన్ని ప్రకటించకపోవడంతో అనుచరులు ఆందోళనకు గురవుతున్నారు.
ట్రెండింగ్ వార్తలు
మాజీ మంత్రి , కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ లో జాయిన్ అయిన సునీత లక్ష్మారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందనే ఊహాగానాల నేపధ్యంలో, పార్టీలో గందరగోళం నెలకొని ఉంది. మదన్ రెడ్డి చేతిలో వరుసగా రెండు సార్లు 2014, 2018 ఎన్నికల్లో ఓడిపోయిన సునీత లక్ష్మా రెడ్డికి 2023 లో సీట్ ఇస్తానని హామీ ఇవ్వటం తోనే పార్టీ లో జాయిన్ అయ్యానని చెప్తున్నారు.
మదన్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టికెట్ తనకే ఇవ్వాలని పట్టుపడుతున్నారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులూ, క్యాడర్ కూడా మదన్ రెడ్డికి టికెట్ ఇస్తే మేము తప్పకుండా గెలిపించుకుంటామని, సునీత లక్ష్మా రెడ్డికి టికెట్ ఇస్తే.. ఆమెకు మద్దతు ఇవ్వబోమని చెబుతున్నారు.
రాష్ట్రం మొత్తం టిక్కెట్లు ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్ నర్సాపూర్ తో పాటు నాలుగు నియోజకవర్గాల అభ్యర్థులు ఎవరనేది ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టారు. అప్పుడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటి రామారావు, విదేశీ పర్యటనలో ఉన్నాడు అని తాను తిరిగిరాగానే నర్సాపూర్ అభ్యర్థి ఎవరో అనేది తేలుతుంది అని పార్టీ నాయకులూ చెప్పారు.
మంత్రి రామారావుని సీటు కోరుతున్న మదన్ రెడ్డి, సునీత లక్ష్మా రెడ్డి ఇద్దరు కూడా కలిశారు. రామారావు మాత్రం అంత నాన్నగారే చూస్తున్నారు అని, ఆయననే అభ్యర్థి ఎవరో త్వరలో తెలుస్తారు అని చెప్పటంతో మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చింది.
మదన్ రెడ్డి పోటీచేస్తేనే గెలిసే అవకాశం..
వయసు పైపడిందనే కారణం తప్ప, మదన్ రెడ్డి పైన ఎటువంటి కంప్లైంట్స్ లేకపోవటం, తనకు ముఖ్యమంత్రి తో పాటు, జిల్లా మంత్రి అయినా టి హరీష్ రావు మద్దతు ఉండటం, అన్నింటికంటే మిన్నుగా మదన్ రెడ్డి పోటీచేస్తేనే పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని ఇంటెలీజెన్స్, పార్టీ క్యాడర్ కూడా చెప్పడం తో పార్టీ నాయకత్వం అభ్యర్థిని మార్చాలనే విషయంలో పునరాలోచనలో పడింది.
పార్టీ నియోజకవర్గ నాయకులూ మాత్రం, అభ్యర్థి ఎవరనేది తెలిస్తే వారు కూడా మిగతా నియోజకవర్గ అభ్యర్థులలాగా ప్రచారం చేసుకుంటామని అంటున్నారు. అభ్యర్థి ఎవరనేది తేలకపోవటం తో, నర్సాపూర్ లో మంత్రి హరీష్ రావు కూడా ఎటువంటి కార్యక్రమాలు చేయడం లేదు. అభ్యర్థి ప్రకటన లేటు కావడంతో, నర్సాపూర్ బిఆర్ఎస్ నాయకుల్లో, క్యాడర్లో స్థబ్ధత నెలకొని ఉన్నది.
సునీత లక్ష్మారెడ్డి కి మాత్రం ఒక పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ అధినేత సపోర్ట్ ఉందని, తానే అన్ని అయ్యి పార్టీ నాయకత్వం తో మాట్లాడుతున్నారు అని తన అనుచరులు చెపుతున్నారు. తనకు టికెట్ ఇస్తే ఆ ఇండస్ట్రియలిస్ట్ ఎంత ఖర్చైనా వెనకాడకుండా గెలిపించుకుంటాడని చెబుతున్నారు. ఆ కంపెనీ ఓనర్ కూడా, పార్టీ నాయకత్వానికి చాల దగ్గర కావటంతో, నర్సాపూర్ అభ్యర్థిత్వం పైన ఎటు తేల్చలేని పరిస్థితి ఏర్పడిందని జిల్లాలో ప్రచారం జరుగుతోంది.