Congress CPI Alliance: కాంగ్రెస్, సిపిఐల మధ్య సీట్ల కేటాయింపులో తెగని పంచాయితీ-the negotiations with the congress party regarding the seats to be allotted to the cpi have not come to an end ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Congress Cpi Alliance: కాంగ్రెస్, సిపిఐల మధ్య సీట్ల కేటాయింపులో తెగని పంచాయితీ

Congress CPI Alliance: కాంగ్రెస్, సిపిఐల మధ్య సీట్ల కేటాయింపులో తెగని పంచాయితీ

HT Telugu Desk HT Telugu
Sep 08, 2023 11:55 AM IST

Congress CPI Alliance: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించినా కమ్యూనిస్టుల్లో మాత్రం క్లారిటీ రావడం లేదు. కాంగ్రెస్‌ కలిసి వెళ్లాలని సిపిఐ భావిస్తున్నా అవి కోరుకునే సీట్ల విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు.

సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ
సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ

Congress CPI Alliance: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ఓటమి లక్ష్యంగా పని చేయాలని భావిస్తున్న సిపిఐకు కోరుకున్న సీట్లు దక్కే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి మూడు అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి అంగీకరిస్తే కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోవాలని ఆ పార్టీ కార్యదర్శివర్గ సమావేశం అభిప్రాయపడింది.

yearly horoscope entry point

కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా కొత్తగూడెం, మునుగోడులతోపాటు బెల్లంపల్లి, హుస్నాబాద్‌లలో ఏదో ఒక స్థానం అడగాలని సీపీఐనేతలు నిర్ణయించారు. కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ బుధవారం రాత్రి హైదరాబాద్‌లో సమావేశం అయ్యారు. ఏ స‌్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై గురువారం ఆ పార్టీ రాష్ట్ర నేతలు చర్చించారు.

కాంగ్రెస్‌తో పొత్తు అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. సిపిఐ కోరుకుంటున్న సీట్లకు సంబంధించి కేసీ వేణుగోపాల్‌కు ఇచ్చిన జాబితాను, కాంగ్రెస్‌ నుంచి వచ్చిన స్పందనను పార్టీ నేతలకు నారాయణ వివరించారు. బుధవారం నారాయణతో జరిగిన సమావేశంలో మాణిక్‌రావ్‌ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.

కొత్తగూడెం, మునుగోడు, బెల్లంపల్లి, హుస్నాబాద్‌, వైరా స్థానాలు కావాలని సీపీఐ కోరింది. అయితే ఖమ్మంలో రెండు స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్యతం చేయలేదు. సిపిఐకు రెండు ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎమ్మెల్సీ ఇస్తామని కాంగ్రెస్‌ ప్రతిపాదించింది. మునుగోడును సీపీఐకి ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థులు ఉన్నారని కాంగ్రెస్‌ ముఖ్యనేతలు నారాయణతో భేటీలో తేల్చి చెప్పారు. ఖమ్మం జిల్లాలో తమ పార్టీ పోటీ చేయాల్సిందేనని, సిపిఐకు అధిక బలమున్న కొత్తగూడెం ఉండాలని సీపీఐ కార్యదర్శివర్గం పార్టీ భేటీలో నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెంలో పోటీ చేయాలని భావిస్తున్నారు.

మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ తరఫున మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూాడా కొత్తగూడెం నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. మునుగోడు, కొత్తగూడెంతోపాటు బెల్లంపల్లి, హుస్నాబాద్‌లలో ఒకటి కలిపి మొత్తం మూడు సీట్లతో పొత్తు ఖరారుకు కాంగ్రెస్‌తో ప్రయత్నించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను ఆ పార్టీ కార్యదర్శివర్గం కోరింది.

మరోవైపు సీట్ల కేటాయింపు విషయంలో సీపీఎంతోనూ కాంగ్రెస్‌ పార్టీ చర్చించాల్సి ఉండటంతో, ఆ రెండు పార్టీల భేటీ జరిగిన తర్వాత సీపీఎంతో కూడా మాట్లాడాలని సీపీఐ నేతలు నిర్ణయించారు. తమ డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తే పొత్తు ఖరారవుతుందని చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు కలిసే పోటీ చేస్తాయని ప్రకటించారు. పొత్తులపై త్వరలోనే స్పష్టత వస్తుందని కూనంనేని ఆశాభావం వ్యక్తం చేశారు .

Whats_app_banner