Warangal Murder Case: ట్రాప్ చేసే హతమార్చారా..? ఇంకా వీడని రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ మర్డర్ మిస్టరీ-the murder mystery of the retired bank manager is still unsolved in warangal ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Murder Case: ట్రాప్ చేసే హతమార్చారా..? ఇంకా వీడని రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ మర్డర్ మిస్టరీ

Warangal Murder Case: ట్రాప్ చేసే హతమార్చారా..? ఇంకా వీడని రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ మర్డర్ మిస్టరీ

HT Telugu Desk HT Telugu
Dec 06, 2024 10:10 PM IST

రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ మర్డర్ మిస్టరీ కేసు ఇంకా వీడలేదు. అన్ని కోణాల్లో వరంగల్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే రాజామోహన్ హత్యపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ట్రాప్ చేసే హతమార్చారా..? అనే విషయం కొత్తగా తెరపైకి వచ్చింది.

రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ హత్య
రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ హత్య

వరంగల్ నగరంలో కలకలం సృష్టించిన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ రాజా మోహన్ దారుణ హత్య మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ నెల 3న ఉదయం 11 గంటల సమయంలో ఆయన హత్యకు గురైన విషయం వెలుగులోకి రాగా.. అప్పటి నుంచి పోలీసులు నిందితుల కోసం గాలిస్తూనే ఉన్నారు. నాలుగు బృందాలు నిందితులను పట్టుకునే పనిలో ఉండగా.. రాజామోహన్ హత్యపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

yearly horoscope entry point

సన్నిహితులే ఆయనను హతమార్చి ఉంటారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. కాగా కొద్ది రోజులుగా రాజా మోహన్ పెళ్లి చేసుకునే ప్రయత్నాలు చేస్తుండటం.. ఇందుకు కొన్ని మ్యారేజ్ బ్యూరో కన్సల్టెన్సీలను అప్రోచ్ అయినట్లుగా తెలిసింది. దీంతో అందులో ఎవరైనా రాజా మోహన్ ను ట్రాప్ చేసి, హత మార్చి ఉంటారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా వరంగల్ ట్రై సిటీలో దాదాపు 1500కుపైగా పోలీస్ ఫోర్స్, వేల సంఖ్యలోని సీసీ కెమెరాలతో పకడ్బందీ భద్రతా వ్యవస్థ ఉందని చెబుతున్న పోలీసులు హత్య జరిగిన మూడు రోజులు దాటినా ఇంతవరకు నిందితులను గుర్తించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సిటీ మధ్యలోనే హత్య..

హనుమకొండ శ్రీనగర్ కాలనీకి చెందిన వెలిగేటి రాజా మోహన్ బ్యాంక్ మేనేజర్ గా పని చేసి రిటైర్ అయ్యారు. భార్య గతంలోనే చనిపోవడం, కూతురు అమెరికాలో స్థిర పడటంతో ఆయన శ్రీనగర్ కాలనీలో ఒక్కడే ఉంటున్నాడు. కాగా డిసెంబర్ 2వ తేదీన సాయంత్రం సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన రాజా మోహన్ మొబైల్ నుంచి రాత్రి 9 గంటలు దాటిన తరువాత తన కూతురుకు ఒక్క సెకన్ వీడియో కాల్ వెళ్లి కట్ అయ్యింది. దీంతో అనుమానం వ్యక్తం చేసి ఆమె తన తండ్రి స్నేహితులకు సమాచారం ఇచ్చింది. దీంతో వాళ్లు ఆయన కోసం గాలించారు.

ఫలితం లేకపోవడంతో 3వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల ప్రాంతంలో సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఇంతలోనే వరంగల్ రంగంపేట సమీపంలో పార్క్ చేసి ఉన్న కారులో రాజా మోహన్ కిరాతకంగా హతమై ఉన్న విషయమై వెలుగులోకి వచ్చింది. దీంతో రాజా మోహన్ స్నేహితులు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం డెడ్ బాడీని మార్చురీకి తరలించారు. కాగా రాజా మోహన్ హత్య కలకలం రేపడంతో పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి విచారణ ప్రారంభించారు.

ఈ క్రమంలో నగరంలోని రెండు జంక్షన్ల వద్ద కారు సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. కారు పరిస్థితి, దానిపై ఉన్న ఆనవాళ్లను బట్టి రాజామోహన్ ను హనుమకొండలోని జులై వాడ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే హత మార్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రెండు నెలల కిందట ట్రాప్ చేసి..

అందరితో కలివిడిగా రాజా మోహన్ చిన్నాపెద్దా తేడా లేకుండా అందరితో స్నేహం చేసేవాడని తెలిసింది. ఇదిలాఉంటే హనుమకొండలో ఒంటరిగా ఉంటున్న ఆయన కొద్దిరోజులుగా మరో పెళ్లి చేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రెండు నెలల కిందట ఓ మ్యారేజ్ సైట్ ద్వారా పరిచయమైన కొందరు వ్యక్తులు ఆయన వ్యవస్థను పసిగట్టి రాజా మోహన్ ను ట్రాప్ చేసి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. ఆయన మొబైల్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు వరంగల్ నగరంలో రాజా మోహన్ అప్రోచ్ అయిన మ్యారేజ్ బ్యూరో కన్సల్టెన్సీలను కూడా పోలీసులు విచారణ జరిపినట్లు తెలిసింది.

రాజా మోహన్ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ కావడం, ఆర్థికంగా కలిగిన కుటుంబం కావడంతో డబ్బు కోసం ఆయనను ట్రాప్ చేసి ఉంటారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనతో సన్నిహితంగా ఉండే పలువురిని పోలీసులు ఎంక్వైరీ కూడా చేశారు. వారి నుంచి వచ్చిన సమాచారం మేరకు సుపారీ ఇచ్చి మర్డర్ చేయించి ఉంటారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

తలలు పట్టుకుంటున్న పోలీసులు

ఈ నెల 3న హత్య విషయం వెలుగులోకి రాగా.. మూడు రోజులు దాటినా ఇంతవరకు పోలీసులకు గట్టి క్లూస్ ఏమీ దొరకలేదు. దీంతో కేసును ఛేదించేందుకు పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. హత్యకు పాల్పడిన దుండగులు ఎలాంటి ఆధారాలు లభించకుండా చాలా జాగ్రత్త పడినట్టు పోలీసులు చెబుతున్నారు.

హత్య అనంతరం స్వెట్టర్, మాస్క్ ధరించి ఉన్న ఓ యువకుడు 3వ తేదీ తెల్లవారుజామున 3.45 గంటల నుంచి 3.49 గంటల మధ్యలో రాజా మోహన్ డెడ్ బాడీ ఉన్న కారును వరంగల్ రంగంపేటలో వదిలేసి వెళ్లిపోగా.. ఆ యువకుడు ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయినా ఇంతవరకు ఆ వ్యక్తి ఎవరో పోలీసులు కనిపెట్టలేకపోయారు.

కాగా కారును అక్కడ పార్క్ చేసిన దుండగుడు అక్కడి నుంచి నడుచుకుంటూ మెయిన్ రోడ్డు వరకు వచ్చి, ఆటో ఎక్కి ములుగు రోడ్డు, ఆరెపల్లి వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. దీంతో ఆటో డ్రైవర్ల ద్వారా కూడా వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే మూడు రోజులైనా కేసులో ఎలాంటి పురోగతి లేకపోగా.. నిందితులను గుర్తించి ఇలాంటి ఘటనలు మళ్లీ చోటుచేసుకోకుండా కఠిన శిక్షలు అమలు చేయాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి).

Whats_app_banner

సంబంధిత కథనం