Vemula Veeresam: కాంగ్రెస్‌లో వేముల వీరేశం చేరికపై కుదరని ముహుర్తం, వీడని ఉత్కంఠ-the moment when vemula veeresham joins the congress the excitement is not over ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  The Moment When Vemula Veeresham Joins The Congress, The Excitement Is Not Over

Vemula Veeresam: కాంగ్రెస్‌లో వేముల వీరేశం చేరికపై కుదరని ముహుర్తం, వీడని ఉత్కంఠ

HT Telugu Desk HT Telugu
Sep 20, 2023 07:01 AM IST

Vemula Veeresam: తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఇపుడు అందరినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నకిరేకల్. కాంగ్రెస్ పార్టీ చేరికల్లో భాగంగా ఇక్కడి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తన అనుచరగణంతో కాంగ్రెస్ లోకి వెళుతున్నారని దాదాపు నెల రోజులుగా ప్రచారం జరుగుతోంది.

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం

Vemula Veeresam: వేముల వీరేశం కాంగ్రెస్‌‌ పార్టీలో చేరడంపై ఉత్కంఠ వీడటం లేదు. తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఇపుడు అందరినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నకిరేకల్… కాంగ్రెస్ పార్టీ చేరికల్లో భాగంగా ఇక్కడి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తన అనుచరగణంతో కాంగ్రెస్ లోకి వెళుతున్నారని దాదాపు నెల రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆయన తన దగ్గరి అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో కూడా బీఆర్ఎస్ కు గుడ్ బై చెబుతున్నామని ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

అందరి అభీష్టం మేరకు కాంగ్రెస్ లో చేరాలని అంతర్గతంగా నిర్ణయించుకున్నా బహిరంగంగా ప్రకటించలేదు. ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ సమీప తుక్కు గూడలో జరిగిన కాంగ్రెస్ విజయోత్సవ సభ సందర్భంగానే పార్టీలో చేరుతారని భావించారు. ఖమ్మం జిల్లా సీనియర్ నాయకుడు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో చేరారు.

మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి చేరిక కూడా జరిగిపోయింది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి జిట్టా బాలక్రిష్ణారెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా పనిచేసి తుంగతుర్తి నాయకుడు మందుల సామేలుకు భవనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కానీ, నెల రోజులుగా జరుగుతున్న వేముల వీరేశం చేరికకు మాత్రం ఇంకా ముహూర్తం కుదరకపోవడంతో ఆయన అనుచరవర్గంలో ఉత్కంఠ నెలకొంది.

అసలేం జరుగుతోంది...?

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన సమయంలోనే వేముల వీరేశం చేరిక కూడా ఉంటుందని ప్రచారం జరిగింది. ఖమ్మంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి చేరిక జరిగిపోయింది. అప్పటి నుంచి పొంగులేటి ద్వారానే వీరేశం కాంగ్రెస్ లోకి వెళతారని అనుకున్నారు.

బీఆర్ఎస్ తన సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇవ్వడంతో.. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేములకు మొండి చేయి చూపినట్లు అయ్యింది. కాంగ్రెస్ నుంచి తమ పార్టీలోచేరిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. దీంతో , వేముల వీరేశం కొత్త దారి వెతుక్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

ఈ పరిస్థితిలో ఆయనకు ఉన్న ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ఒక్కటే అన్న అభిప్రాయంతో ఆ దిశలో ప్రయత్నాలు మొదలు పెట్టారు.నకిరేకల్ లో ఇప్పటికే ముగ్గురు నాయకులు టికెట్లు ఆశిస్తూ పనిచేస్తున్నారు. వీరిలో దైద రవీందర్, వేదాసు శ్రీధర్‌లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు కాగా, కొండేటి మల్లయ్య సీనియర్ నేత కుందూరు జానారెడ్డి దగ్గరి అనుచరుడు.

వీరు ముగ్గురు ఉండగా జిల్లాలో కాంగ్రెస్ నాయకత్వంతో ఎలాంటి పరిచయాల్లేని వేముల వీరేశానికి స్వాగతం చెప్పేవారు ఎవరుంటారన్న చర్చ జరిగింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంగీకారం లేకుండా పార్టీలో చేరడం, ఆనక అన్ని వర్గాలనూ కలుపుకొని వెళ్లడం అంత తేలిక కాదని గుర్తించి కోమటిరెడ్డిని ఒప్పించే పనిలో పడ్డారు.

వీడని ఉత్కంఠ

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 లో జరిగిన ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ ఎమ్మెల్యేగా, వేముల వీరేశం నకిరేకల్ ఎమ్మెల్యేగా ఒకేసారి విజయం సాధించారు. ఒకరు కాంగ్రెస్ కాగా, మరొకరు బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్). నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త హత్య విషయంలో ఈ ఇద్దరి నాయకుల మధ్య వివాదం మొదలైంది. వ్యవహారం కోర్టు కేసుల వరకూ వెళ్లింది.

దీంతో ఇప్పటి వరకూ ఇద్దరు నేతల మధ్య గ్యాప్ పూడలేదు. పార్టీ కోసం పలువురు సీనియర్ నాయకులు, ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోమటిరెడ్డిని ఒప్పించేందుకు శ్రమ తీసుకున్నారు. ఇక, పార్టీలో చేరడమే తరువాయి అని ఎదురు చూస్తున్న వేముల వీరేశం, ఆయన అనుచరులకు ఇంకా గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది.

ఒక వేళ స్థానిక ఎంపీ కోమటిరెడ్డిని కాదని, ఏఐసీసీ నాయకత్వం సమక్షంలో పార్టీలో చేరితే.. ఎన్నికల సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న అంశమే వేముల వర్గాన్ని పార్టీలో చేరకుండా ఆపుతోందని అంటున్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ వ్యవహారానికి తెరపడుతుందని వేముల వర్గం ఆశాభావంతో ఉంది. ఢిల్లీ పెద్దల వద్దే ఏ విషయమూ తేల్చుకుని ప్రత్యామ్నాయం గురించి యోచించే పనిలో ఉన్నారని ఆయన వర్గం నేతలు చెబుతున్నారు. ఏ రకంగా చూసినా.. నకిరేకల్ రాజకీయాలు ఆసక్తికరంగా మారి రక్తికడుతున్నాయి.

(రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్లగొండ)

WhatsApp channel