Vikarabad : లగచర్ల దాడి ఘటన.. ఇంకా పరారీలోనే కీలక నిందితుడు సురేష్.. ఎక్కడ ఉన్నాడు?
Vikarabad : లగచర్లలో అధికారులపై దాడి ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం గ్రామాల్లో సాధారణ పరిస్థితులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. అటు ఈ ఘటనలో ప్రధాన నిందితుడు సురేష్ ఇంకా పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇటు లగచర్ల గ్రామస్తులు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.
వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. పోలీసులు మరో నలుగురిని రిమాండ్‌కు పంపారు. ప్రస్తుతం లగచర్ల, రోటిబండ, పులిచర్లకుంటలో సాధారణ పరిస్థితులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. శనివారం.. కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీని కలిసి.. అడిషనల్ డీజీ మహేష్ భగవత్ వివరాలు తెలుసుకున్నారు. ఈ కేసులో కీలక నిందితుడు సురేష్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. సురేష్ ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుంది.
సురేష్ ఆచూకీ కనిపెట్టడం పోలీసులకు సవాల్‌గా మారింది. దాడి జరిగిన వెంటనే అతడు అజ్ఞాతంలోకి వెళ్లాడు. సురేష్ ఆచూకీని 5 రోజులు దాటినా కనిపెట్టలేకపోయారు. మహారాష్ట్రలోని పుణె ప్రాంతంలో ఉంటాడని ప్రచారం జరిగింది. ఇంకవైపు హైదరాబాద్‌లోనే రహస్య ప్రదేశంలో దాగి ఉంటాడని మరో ప్రచారం జరుగుతోంది.
అతడిని పక్కా ప్రణాళిక ప్రకారం.. అజ్ఞాతంలోకి పంపించి.. సెల్‌ఫోన్ కూడా అందుబాటులో లేకుండా జాగ్రత్తలు తీసుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడు పోలీసులకు దొరికితే చిక్కులు ఎదురవుతాయనే భావనతోనే దాచి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు అయ్యారు.
బాధితుల ఫిర్యాదు..
ప్రభుత్వం తమ వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిందని.. బాధిత రైతు, గిరిజన కుటుంబాల సభ్యులు ఆరోపించారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి ఫిర్యాదు చేశారు. మణిపుర్‌లో మహిళలపై దాడి జరిగితే రాహుల్ గాంధీ వెళ్లి పరామర్శించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారని, లగచర్లకు కూడా ఆయన రావాలని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ తమ దగ్గరకు రాలేకపోతే.. అడ్రస్ ఇస్తే తామే అక్కడికి వెళ్లి రాహుల్‌కు సమస్యను వివరిస్తామన్నారు. కలెక్టర్, అధికారులపై జరిగిన దాడిని తాము ఖండిస్తున్నామని, సీఎం నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు గిరిజనుల భూమి మాత్రమే ఉందా అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. గిరిజనుల భూములను దోచుకోవడం సరికాదన్నారు.
గిరిజనులపై పోలీసులు లైంగిక దాడులు చేశారని మహిళలు చెబుతున్నారని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కోరామని ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ వివరించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి లగచర్ల గ్రామాన్ని సందర్శిస్తామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య స్పష్టం చేశారు.