TGSRTC : సమ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసీ జేఏసీ.. చర్చలకు ఆహ్వానించిన కార్మిక శాఖ!
TGSRTC : తమ డిమాండ్లను నెరవేర్చాలని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ.. ఇటీవల సమ్మె నోటీసు ఇచ్చింది. దాదాపు 10 రోజుల తర్వాత దీనిపై కార్మిక శాఖ స్పందించింది. ఆర్టీసీ జేఏసీని చర్చలకు ఆహ్వానించింది. అయితే.. ఈ చర్చలకు ఆర్టీసీ జేఏసీ నాయకులు వెళ్తారా లేదా అన్నది వేచి చూడాలి.
ఆర్టీసీ జేఏసీని కార్మిక శాఖ చర్చలకు ఆహ్వానించింది. ఈ నెల 10న చర్చలకు రావాలంటూ నోటీస్ ఇచ్చింది. ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా చర్చలకు పిలిచింది. జనవరి 27న ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. 10 రోజుల తర్వాత కార్మిక శాఖ సమ్మె నోటీసుపై స్పందించి, చర్చలకు ఆహ్వానించింది. అయితే.. ఈ చర్చలకు జేఏసీ నాయకులు వెళ్తారా లేదా అన్నది చూడాలి.
సమస్యలు పరిష్కరించాలని..
తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె సైరన్ మోగించేందుకు కార్మికులు రెడీ అయ్యారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఈనెల 9 నుంచి సమ్మెకు దిగేందుకు యూనియన్లు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కార్మిక శాఖ చర్చలకు ఆహ్వానించింది. ఉద్యోగ భద్రత, హక్కుల సాధనకు ఆర్టీసీ యాజమాన్యానికి ఎన్నోసార్లు విన్నవించామని జేఏసీ నాయకులు చెబుతున్నారు. అయినా సమస్యలు పరిష్కారం కాలేదని అంటున్నారు.
15 ప్రధాన డిమాండ్లు ఇవే..
1.ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హమీలు అమలు చేయాలి.
2.కార్మికులపై పనిభారం తగ్గించాలి.
3.డిపోల పరిధిలో కార్మిక సంఘాల కార్యక్రమాలను అనుమతించాలి.
4.ఎస్ఆర్ బీఎస్, ఎస్బీటీలను రద్దు చేయాలనే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి.
5.పీఎఫ్, సీసీఎస్ వడ్డీ సహా డబ్బు చెల్లించాలి.
6.స్వచ్ఛంద ఉద్యోగ విరమణను ఉపసంహరించుకోవాలి. డిపోల మూసివేతను ఉపసంహరించుకోవాలి.
7.కొత్త బస్సులు కొనుగోలు చేయాలి.
8.టికెట్ తీసుకోకుంటే ప్రయాణికుడినే బాధ్యుడిని చేయాలి.
9.2017, 2021 వేతన సవరణ చేయాలి.
10.2019 నుంచి రావాల్సిన డీఏలు చెల్లించాలి.
11.2019లో సమ్మెకాలంలో ఉద్యోగులపై నమోదు చేసిన పోలీసు కేసులు ఎత్తివేయాలి.
12.ఉద్యోగ విరమణ చేసిన వారికి సెటిల్మెంట్లు చెల్లించాలి.
13.అన్ని కేటగిరీలలో ఖాళీలను భర్తీ చేసి.. అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలి.
14.పాత రెగ్యులేషన్స్ సమూలంగా మార్చి.. డ్రైవర్, కండక్టర్, సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి.
15.మృతిచెందిన ఉద్యోగులు, మెడికల్ అన్‌ఫిట్ అయిన వారి స్థానంలో.. వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి.
ఎన్నోసార్లు విన్నవించాం..
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతో ఆర్టీసీ అభివృద్ధి చెందుతుందని ఆశించామని.. ఆర్టీసీ జేఏసీ నేతలు చెబుతున్నారు. కార్మికులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని భయపడే ప్రసక్తే లేదన్నారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు పోరాటం చేస్తామని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. సంస్థ ఎండీకి సమస్యలపై ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.