Vemulawada : శ్రావణ మాసం సందడి.. వేములవాడ రాజన్న ఆలయం ఆదాయం రూ.6.87 కోట్లు-the income of vemulawada rajanna temple is rs 6 crores in sravana masam ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Vemulawada : శ్రావణ మాసం సందడి.. వేములవాడ రాజన్న ఆలయం ఆదాయం రూ.6.87 కోట్లు

Vemulawada : శ్రావణ మాసం సందడి.. వేములవాడ రాజన్న ఆలయం ఆదాయం రూ.6.87 కోట్లు

HT Telugu Desk HT Telugu
Sep 06, 2024 11:21 AM IST

Vemulawada : కోరిన కోర్కెలు తీర్చే కోడే మొక్కల వేములవాడ రాజన్న ఆలయంలో.. శ్రావణ మాసం సందడి నెలకొంది. భక్తుల రద్దీతో ఆలయానికి నెల రోజుల్లో రూ: 6.87 కోట్ల ఆదాయం వచ్చింది. భక్తుల రద్దీ, ఆదాయం సమకూరడంతో.. భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచాలని అధికారులు యోచిస్తున్నారు.

వేములవాడ రాజన్న ఆలయం ఆదాయం రూ.6.87 కోట్లు
వేములవాడ రాజన్న ఆలయం ఆదాయం రూ.6.87 కోట్లు

దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి.. శ్రావణ మాసంలో భక్తులు పోటెత్తారు. శుభదినాలు ఎక్కువగా ఉన్న శ్రావణ మాసంలో.. శివున్ని ఆరాధిస్తే పుణ్యం సిద్ధిస్తుందని భావించి భక్తులు క్యూ కట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ఆది, సోమ, శుక్రవారాల్లో వేలాదిగా బారులు తీరారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చొని రాజన్నను దర్శించుకున్నారు.

భక్తులు కోడె మొక్కులు చెల్లించుకుని, తలనీలాలు సమర్పించారు. చల్లంగా చూడాలంటూ వేడుకున్నారు. మొత్తంగా నెల రోజుల్లో 4.50 లక్షల మందికిపైనే రాజన్నను దర్శించుకోవడంతో మొత్తం రూ. 6,87,22,090 ఆదాయం సమకూరినట్టు ఈవో వినోద్ రెడ్డి వెల్లడించారు. అందులో అభిషేకం టికెట్ల ద్వారా రూ.21,16,500, కల్యాణ టిక్కెట్ల ద్వారా రూ.34,44,000, కేశఖండనం ద్వారా రూ.15,22,700, కొబ్బరికాయలు, బెల్లం అమ్ముకునే లైసెన్సు ద్వారా రూ.10,47,458, గండదీపం టికెట్ల ద్వారా రూ.1,09,560,, దర్మశాలల కిరాయి ద్వారా రూ.43,80,497 ఆదాయం వచ్చినట్టు ఈవో వివరించారు.

ప్రత్యేక కోడెమొక్కుల టికెట్ల ద్వారా రూ.1,74,76,600, లడ్డూ ప్రసాదాల ద్వారా రూ.1,35,81,500, బ్రేక్ దర్శనం ద్వారా రూ.12,33,000, శాశ్వత కల్యాణాల ద్వారా రూ.1,40,000, శాశ్వత పూజల ద్వారా రూ.1,69,362, బద్దిపోచమ్మ ఆలయ సేవల టికెట్ల ద్వారా రూ.9,92,195, భీమేశ్వరాలయం సేవల టికెట్ల ద్వారా రూ.3,06,720, సత్యనారాయణ వ్రత టికెట్ల ద్వారా రూ.1,86,000, ఇతర సేవల ద్వారా ఆదాయం సమకూరిందని వెల్లడించారు. శ్రావణమాసం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని ఈవో చెప్పారు. ఆలయానికి వచ్చిన భక్తులు సంతృప్తిగా స్వామివారిని దర్శించుకుని వెళ్లారని వివరించారు.

అన్నదాన సత్రం స్థలాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్..

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో నిత్యాన్నదానం ప్రారంభించాలని నిర్ణయించారు. అన్నదానం సత్రం నిర్మాణానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్థలాన్ని పరిశీలించారు. శివార్చన మండపం వద్ద సత్రం నిర్మించాలని.. అందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల స్వామి వారి దర్శనం సందర్భంగా చేసిన ప్రకటనలో భాగంగా.. స్థల పరిశీలన చేశామని ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న భక్తులకు సులభంగా, వేగంగా దర్శనం, వసతి ఇతర సౌకర్యాలను మెరుగు పర్చేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. భక్తులకు నిత్యం భోజనం దొరికేలా నిత్యాన్నదానంకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని.. 15 వేల మంది భోజనం చేసేలా భవనాన్ని నిర్మించే ప్రతిపాదనలు రూపొందించి 3 రోజుల్లోగా అందజేయాలని అధికారులను ఆదేశించారు.

(రిపోర్టింగ్- కెవి రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతినిధి, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)