Indiramma Atmiya Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎఫెక్ట్.. ఉపాధి హామీ జాబ్ కార్డుల జారీకి బ్రేక్!
Indiramma Atmiya Bharosa : తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టింది. వాటిల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఒకటి. ఈ పథకం కింద అర్హులైన పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందుతుంది. అయితే.. ఈ పథకం ప్రభావం ఉపాధి హామీ జాబ్ కార్డుల జారీపై పడింది.
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. భూమిలేని వ్యవసాయ కూలీలు ఈ పథకానికి అర్హులు. ఈ పథకం కింద ఎంపికైన ఒక్కో లబ్ధిదారునికి.. ఏడాదికి రూ. 12,000 ఆర్థిక సాయం అందుతుంది. ఈ మొత్తాన్ని రెండు విడతలుగా ఇస్తారు. ఒక్కో విడతలో రూ. 6,000 చొప్పున ఇస్తారు. దీని కోసం 2023-24లో ఉపాధి హామీ పథకం కింద 20 రోజుల పని దినాలు పూర్తి చేసి ఉండాలి.
జాబ్ కార్డులకు డిమాండ్..
ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. గ్రామాల్లో ఉపాధి హామీ జాబ్ కార్డులకు డిమాండ్ పెరిగింది. దీంతో కొత్తగా జాబ్ కార్డులు జారీ చేయవద్దని ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బందికి మౌఖికంగా ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కొన్ని రోజులుగా చాలా జిల్లాల్లో కొత్త జాబ్ కార్డుల జారీ, సవరణలు, తొలగింపులను అధికారులు నిలిపివేశారు.
పెరిగిన కూలీల సంఖ్య..
ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడానికి ఒక్కో మండలంలో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసింది. మొదటి విడతలో భాగంగా.. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.6 వేలు జమచేసింది. అయితే.. ఇన్నాళ్లు జాబ్ కార్డులు లేనివారు.. ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్నారు. కార్డులు ఉండి ఇన్నాళ్లు పనికి వెళ్లని వారు ఇప్పుడు వెళ్తున్నారు. దీంతో గ్రామాల్లో ఒక్కసారిగా ఉపాధి కూలీల సంఖ్య పెరిగింది.
ఒకరికే పథకం..
జాబ్ కార్డు ఉన్నవారికి కుటుంబంలో ఒకరికే పథకం వర్తిస్తుంది. దీంతో వేర్వేరు జాబ్ కార్డులు కావాలనే డిమాండ్ గ్రామాల్లో పెరుగుతోంది. ఇప్పటివరకు ఒకరి పేరుపై జాబ్ కార్డు ఇచ్చి.. దాంట్లో కుటుంబంలోని మిగతా వారి పేర్లను నమోదు చేశారు. ఫలితంగా కార్డుపై ఒకరికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తిస్తుంది. గతంలో కలిసి ఉండి.. పెళ్లిళ్లు అయిన వారు దీని కారణంగా నష్టపోతున్నారు. అటు జాబ్ కార్డులో ఉన్నవారి పేరుపై కాస్త భూమి ఉన్న పథకం వర్తించదు.
కార్డుల జారీకి బ్రేకులు..
ఈ నేపథ్యంలో.. జాబ్ కార్డుల్లో సవరణలకు కూడా డిమాండ్ పెరిగింది. తండ్రి పేరుపై భూమి ఉంటే.. అతని పేరు తొలగించి.. మిగతావారి పేరుమీదు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని చాలామంది భావిస్తున్నారు. దీంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని గమనించిన అధికారులు.. కొత్త జాబ్ కార్డుల జారీ, సవరణలు, తొలగింపులకు బ్రేక్ వేశారు.